Tuesday, January 10, 2017

దామోదరుని స్తుతి

నలకూబర, మణిగ్రీవులనే యక్షులు నారద శాపం చేత మద్ది చెట్లై పడి ఉండగా, యశోదమ్మచే రోటికి కట్టబడిన చిన్ని కృష్ణుడు ఆ రోటితో ఆ చెట్లను పెకలించి వారికి శాప విమోచనం ప్రసాదిస్తాడు. తమ స్వస్వరూపాలను పొందిన ఆ కుబేర పుత్రులు తమ అహంకారం నశించగా బాల కృష్ణునికి తల వంచి నమస్కరించి ఇలా స్తుతించారు.  
                                       
              దీనిలో ఆఖరి పద్యం మనందరం కూడా నిరంతరం ఆ స్వామిని ప్రార్థించడానికి ఎంతో అనువైనది. అసలు కోరవలసింది అదే.

బాలుడవె నీవు, పరుడ వ
నాలంబుడవధిక యోగి వాద్యుడవు తను
స్థూలాకృతియగు విశ్వము 
నీ లీలా రూపమండ్రు నిపుణులు కృష్ణా! 

భావం: కృష్ణా! నీవు బాలుడవు కానే కాదు, పరబ్రహ్మవు. నీకు నీవే కానీ వేరే ఆధారం అక్కరలేని వాడవు. పరమ యోగివి. అన్నింటికీ మొదటి వాడవు నీవు. అత్యంత సూక్ష్మం నుండి అతి స్థూలం వరకు ఈ విశ్వమంతా నీ రూపమే అని వివేకవంతులు అంటారు.  

ఎల్ల భూతంబుల కింద్రియాహంకృతి ప్రాణంబులకు అధిపతివి నీవ! 
ప్రకృతియు ప్రకృతి సంభవ మహత్తును నీవ, వీని కన్నిటికిని విభుడవీవ,
ప్రాకృత గుణ వికారముల పొందక పూర్వ సిద్ధుండవగు నిన్ను జింత సేయ 
గుణవృతుండోపునే? గుణహీన! నీ యంద కల గుణంబుల నీవ కప్పబడుదు.
మొదల నెవ్వని యవతారములు శరీరు
లందు సరిదొడ్డు లేని వీర్యముల దనువు
లడర జన్మించి వారలయందు జిక్క 
పట్టి పరమేశ! మ్రొక్కెద మయ్య ! నీకు 

భావం: అన్ని జీవ రాసులకూ, ఇంద్రియాల అహంకారానికీ, ప్రాణాలకూ నీవే అధిపతివి. ప్రకృతివీ నీవే, దాని నుండి పుట్టిన మహత్తూ నీవే. అయినా వీటికి వేటికీ అందకూండా అధికారం చూపేదీ నీవే.ప్రకృతి గుణాలు నీలో ఏ మార్పూ కలిగించలేవు. ఎందుకంటే నీవు వాటి కన్నా ముందు నుండీ ఉన్నవాడవు. నీలో నుంచి అవి పుట్టుకు వస్తాయి. ఇక గుణాలతో ఆవరింపబడిన వాడు నిన్ను గూర్చి ఏ విధంగానూ ధ్యానం చేయలేడు. ఏ గుణాలూ లేనివాడవు నీవు. నీ నుండి గుణాలు వస్తూ ఉంటాయి. వాటి చేత కప్పబడి రహస్యంగా దాగి ఉంటావు. ఈ శరీరం ధరించిన ఎవరూ కూడా నీ అవతార వైభవాలకి సాటి రారు. నీ రూపాలు వేరు, వీళ్ళ రూపాలు వేరు. ఈ జీవులంతా నీ తేజస్సుతో శరీరాలు ధరించి పుడతారు. కనుక నీవు వాళ్ళకి అంతుపట్టవు. అట్టి పరమేశ్వరా! నీకు నమస్కారం చేయుచున్నాము.

భువనములు సేయ గావగ 
నవతీర్ణుడవైతి కాదె యఖిలేశ్వర! యో
గి వరేణ్య! విశ్వ మంగళ!
కవి సన్నుత! వాసుదేవ! కళ్యాణ నిధీ! 

భావం: ఈ లోకాలన్నింటినీ సృష్టించడానికీ, రక్షించడానికీ అవతరించావు కదా! నీవు ఈ అంతటికీ ఈశ్వరుడవు. యోగులందరూ నిన్ను దైవంగా వరించారు. ఈ ప్రపంచానికి శుభాలు చేకూర్చే వాడవు నీవు. సృష్టిలోని శుభాలు అన్నీ నీ నుండే పుట్టుతూ ఉన్నవి. కవులచే స్తుతింపబడు వాడా! కళ్యాణములకు నిధి వంటి వాడా!          

తపస్వి వాక్యంబులు దప్ప వయ్యెన్
నెపంబునం కంటిమి నిన్ను జూడం
దపంబులొప్పెన్, మముదావకీయ, 
ప్రపన్నులంజేయుము భక్త మిత్రా! 

భావం: మహా తపస్వి అయిన నారద మునీంద్రుని మాటలు తప్పకుండా జరిగినవి. ఆయన శాపం అనే నెపం కారణంగా నిన్ను చూడగలిగాము. ఇన్ని సంవత్సరాలూ నిన్ను చూడాలనే తపించిపోయాము. ఇప్పటికి మా తపస్సు ఫలించింది. నీవు భక్తులైన వారికి పరమ మిత్రుడవు. మమ్ములను నీ భక్తులుగా మన్నించి అనుగ్రహించుము.

నీ పద్యావళులాలకించు చెవులున్ నిన్నాడు వాక్యంబులున్
నీ పేరంబనిసేయు హస్త యుగముల్ నీ మూర్తిపై జూపులున్
నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్ నీసేవపై జిత్తముల్
నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణన్ నీరేజ పత్రేక్షణా! 

భావం: కమల పత్రాల వంటి నేత్రాలు కల మహానుభావా! నీపై రచించిన స్తుతి వింటూ ఉండే చెవులనూ, నిన్ను గురించి మాట్లాడే వాక్కులనూ, ఏ పని చేసినా నీ పేరనే పనిగా చేసేటట్లూ-నీరూపం పైననే ఉండేటట్లూ మా బుద్ధులూ, నీ పైననే మా చూపులన్నీ ఉండేటట్లూ, నీ పాదములను ఎల్లప్పుడూ మ్రొక్కే శిరస్సునూ, నీ పైనే ఉండేటట్లు మా మనస్సు మాకు దయతో అనుగ్రహించు.    


No comments:

Post a Comment