Tuesday, January 24, 2017

రుక్మిణీ కళ్యాణం

పోతన గారి పుణ్యమా అని తెలుగు వారందరికీ చిరపరిచితమైన రుక్మిణీ కళ్యాణ ఘట్టంలోని కొన్ని మధుర శ్లోకాలు స్మరించి తరించుదామా!    
                                           

యే నీ గుణములు కర్ణేంద్రియంబులు సోక దేహ తాపంబులు తీరిపోవు
నే నీ శుభాకార మీక్షింప కన్నుల కఖిలార్థ లాభంబు కలుగుచుండు
నే నీ చరణ సేవ లే ప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబు పొందగలుగు
నే నీ లసన్నామ మే ప్రొద్దు భక్తితో దడవిన బంధ సంతతులు వాయు
నట్టి నీ యందు నాచిత్త మనవరతము
నచ్చి యున్నది నీ యాన నానలేదు
కరుణ చూడుము కంసారి! ఖల విదారి!
శ్రీయుతాకార! మానినీ చిత్త చోర! 

భావం: కంసాంతకా! ప్రశస్తమైన నీ గుణాలు చెవుల బడితే చాలు, శరీర తాపాలన్నీ శమిస్తాయి. ఓ కళ్యాణ స్వరూపా! మంగళ కరమైన నీ స్వరూపం తిలకిస్తే చాలు నేత్రాలకు నిఖిల ప్రయోజనాలు సిద్ధిస్తాయి. దుష్టులను దునుమాడువాడా! నిరంతరం నీ పాద సేవ చేస్తే చాలు లోకంలో మహోన్నతి నొందవచ్చు. మానవతుల మనసులు హరించువాడా! సంతతమూ నీ దివ్య నామం సంస్మరిస్తే చాలు బంధాలన్నీ పటాపంచలవుతాయి. నీ మహిమ ఎక్కడ? నేనెక్కడ? అని సిగ్గు చెందక నాహృదయం నీయందు లగ్నమయింది. ఇది నిజం. నన్ను కరుణతో కటాక్షించు.      

ధన్యున్ లోకమనోభిరాము గుల విద్యా రూప తారుణ్య సౌ
జన్య శ్రీ బల దాన శౌర్య కరుణా సంశోభుతున్ నిన్ను నే
కన్యల్ గోరరు? కోరదే మును రమాకాంతా లలామంబు రా
జన్యానేకప సింహ! నా వలననే జన్మించెనే మోహముల్? 

భావం: మదపుటేనుగు వలె క్రొవ్వి చరించునట్టి శతృ రాజులకు సింహం వంటివాడవైన ఓ శ్రీ కృష్ణా! నీవు ధన్యుడవు. లోకుల మనస్సులను రంజింపచేసేవాడవు. వంశము, విద్య, చక్కదనము, జవ్వనము, మంచితనము, సంపద, బలము, దానము, పరాక్రమము, కారుణ్యము అనే గుణాలతో మిక్కిలి అలరారుతున్నవాడవైన నిన్ను కోరని కన్యలు ఎవరూ ఉండరు. ఉవిదలలో ఉత్తమురాలైన శ్రీ మహాలక్ష్మి అలనాడు నిన్ను చెట్టబట్టలేదా? ఈ మోహము నాకే పుట్టి నేనే అరుదుగా మోహించితినా? వలపు అనేది నా వల్లనే జన్మించిందా?    

శ్రీయుత మూర్తి! యో పురుష సింహమ! సింహము పాలి సొమ్ము గో
మాయువు గోరు చందమున మత్తుడు చైద్యుడు నీ పదాంబుజ 
ధ్యాయినియైన నన్ను వడి దా గొనిపోయెద నంచు నున్న వా
డా యధమాధముండెరుగ డద్భుతమైన భవత్ప్రతాపమున్

భావం: వక్షస్థలము నందు లక్ష్మీ దేవిని వహించిన ఓ పురుష శ్రేష్ఠుడా! ఓ మంగళ మూర్తీ! పురుషులలో సింహము వంటి వాడవు నీవు. సింహమునకు అర్హమైన సొత్తును నక్క వాంఛించునట్లు నీ చరణ సరోజాలను స్మరించే నన్ను మదోన్మత్తుడైన శిశుపాలుడు  శీఘ్రంగా వచ్చి తీసుకుపోవడానికి యత్నిస్తున్నాడు. అల్పులలో అల్పుడైన ఆ చేది దేశపు రాజు ఆశ్చర్యజనకమైన నీ పరాక్రమం ఎరుగడు సుమా!    

వ్రతముల్ దేవ గురు ద్విజన్మ బుధ సేవల్ దాన ధర్మాదులున్
గత జన్మంబుల నీశ్వరున్ హరి జగత్కల్యాణు గాంక్షించి చే
సితి నేనిన్ వసుదేవ నందనుడు నా చిత్తేశుడౌ గాక ని
ర్జితులై పోదురు గాక సంగరములో జేదీశ ముఖ్యాధముల్   

భావం: పూర్వ జన్మములందు నేను జగన్నాయకుడూ, లోకాలకు శుభాలను కలిగించేవాడూ అయిన గోవిందుడిని పతిగా కోరి నోములు నోచి ఉంటే, దేవతలకూ, గురువులకూ, బ్రాహ్మణులకూ, విద్వాంసులకూ సేవలొనర్చి ఉంటే, దాన ధర్మాది పుణ్య కార్యాలు సలిపి ఉంటే వసుదేవుని కుమారుడైన శ్రీ కృష్ణుడు నాకు ప్రాణేశ్వరుడు అవుతాడు. శిశుపాలుడు మొదలుగా గల నీచులు భండనంలో పరాజితులు అవుతారు.  

ఘనులాత్మీయ తమో నివృత్తి కొరకై గౌరీశు మర్యాద నె
వ్వని పాదాంబుజ తోయమందు మునుగన్ వాంఛింతు రే నట్టి నీ
యనుకంపన్ విలపింపనేని వ్రత చర్యన్ నూరు జన్మంబులన్ 
నిను జింతించుచు ప్రాణముల్ విడిచెదన్ నిక్కంబు ప్రాణేశ్వరా!  

భావం: నాథా! మహాత్ములు తమ అఙ్ఞాన రాహిత్యం కొరకు పార్వతీ పతి అయిన పరమేశ్వరుని వలెనే యే పరమ పురుషుని పాదపద్మాలలో ప్రభవించిన గంగా జలాలలో స్నానం చేసి పుణ్యవంతులు కాగోరుదురో అట్టి తీర్థ పాదుడవైన నీ అనుగ్రహానికి నేను అర్హురాలను కాకపోతే అనగా నీవు నన్ను పరిగ్రహింపని పక్షమున బ్రహ్మచర్య వ్రత నిష్ఠ వహించి నూరు జన్మలకైనా నీవే నా పతి కావాలని నిన్నే ధ్యానిస్తూ నా ప్రాణాలు నీకే అర్పిస్తాను. ఇది నా మనో నిశ్చయం. అందుకే నన్ను ఉపేక్ష చేయక వచ్చి నన్ను తీసుకుని పొమ్ము.        

ప్రాణేశ! నీ మంజు భాషలు వినలేని కర్ణ రంధ్రంబుల కలిమి యేల?
పురుష రత్నమ! నీవు భోగింపగా లేని తనులతవలని సౌందర్యమేల?
భువనమోహన! నిన్ను బొడగానగా లేని చక్షురింద్రియముల సత్త్వమేల?
దయిత! నీ యధరామృతం బానగా లేని జిహ్వకు ఫల రస సిద్ధియేల?
నీరజాతనయన! నీ వన మాలికా
గంధమబ్బలేని ఘ్రాణమేల?
ధన్య చరిత! నీకు దాస్యంబు సేయని 
జన్మమేల? యెన్ని జన్మములకు 

భావం: ఓ ప్రాణ నాయకా! ఇంపులైన నీ వాక్కులు విననోచని చెవుల వల్ల ప్రయోజనం శూన్యం. పురుషోత్తమా! నీవు అనుభవింపని సుందర సుకుమార శరీర లావణ్యం ఎందుకూ కొరగాదు. జగన్మోహన మూర్తీ! లోకమునను మోహము పుట్టించ జాలిన నిన్ను సందర్శింప నోచని కనుల కలిమి దండుగ. జీవితేశ్వరా! నీ అధర సుధారసం ఆస్వాదింపని నాలుకకు ఫల రసముల ప్రాప్తి ఎందుకు? కమలాక్షా! నీవు ధరించు వనమాలికా సౌరభం ఆఘ్రాణించని ఈ నాసిక ఏల? ధన్య చరిత్రా! నీ పాద పరిచర్యకు ఉపకరించని ఈ జన్మ ఎన్ని జన్మలెత్తినా ఏమి లాభం? అనగా త్వక్చక్షుశ్రోత్ర జిహ్వాఘ్రాణములను ఙ్ఞానేంద్రియములు కలిగినందుకు ఆయా ఇంద్రియముల వలన సుఖములు నీ వల్లనే అనుభవిస్తూ నీ సేవ చేస్తూ ఉండేదే జన్మ గానీ అట్టివి కాని జన్మములు ఎన్ని ఎత్తినను వ్యర్థమే.     

నమ్మితి నా మనంబున సనాతనులైన ఉమా మహేశులన్
మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు గదమ్మ! మేటి పె
ద్దమ్మ దయాంబురాశివి గదమ్మ హరింబతి సేయుమమ్మ నిన్
నమ్మిన వారికెన్నడును నాశము లేదు గదమ్మ ఈశ్వరీ! 


భావం: అమ్మా! గౌరీ! శాశ్వతులూ, ఆది దంపతులు అయిన పార్వతీ పరమేశ్వరులైన మిమ్ము మదిలో నమ్ముకుని ఉన్నాను. మేలుకోరి నేను మిమ్ములను భక్తితో కొలుస్తున్నాను. తల్లులలోకెల్లా ప్రధానురాలైన నీవు పెద్ద తల్లివి, దయకు సముద్రము వంటి దానవు. తల్లీ! లోకములో నిన్ను నమ్ముకున్న వారికి ఎన్నటికీ చెరపు అనేది లేదు. శ్రీ కృష్ణుని నాకు భర్త అగునట్లుగా చేయుము.  





No comments:

Post a Comment