Saturday, January 7, 2017

బ్రహ్మాది దేవ కృత శ్రీ కృష్ణ స్తుతి

భగవానుడైన శ్రీ కృష్ణుడు తల్లి దేవకి దేవి గర్భము నందుండగా, అసలు పుట్టుకయే లేని స్వామి భక్త సముద్ధరణకు తల్లి గర్భమునందు ప్రవేశించి లీలగా జన్మను స్వీకరించు సమయంలో పరవశులైన బ్రహ్మాది దేవతలు ఆ అప్రమేయుడైన భగవంతుని గుణ గానం చేస్తారు. 
జగద్గురువైన శ్రీకృష్ణుని లీలలు వివరంగా వర్ణింపబడిన పోతన భాగవతంలోని దశమ స్కంధం లోని ఘట్టాల నుంచి మన స్తుతులను ప్రారంభించుకోవడం ఆ జగద్గురు కృపకు మనలను పాత్రులను చేయాలని ప్రార్థిస్తూ స్తుతించుకుందాం.
                                     
సత్య వ్రతుని నిత్య సంప్రాప్తి సాధను కాల త్రయము నందు కలుగు వాని
భూతంబులైదును పుట్టు చోటగు వాని ఐదుభూతములం దమరు వాని
ఐదు భూతంబులు అణగిన పిమ్మట బరగు వానిని, సత్య భాషణంబు, 
సమ దర్శనంబును జరిపెడు వానిని నిన్నాశ్రయింతుము, నీ యధీన
         మాయ చేత ఎరుక మాలిన వారలు
         పెక్కు గతుల నిన్ను పేరుకొందురు
         ఎరుగ నేర్చు విబుధులేక చిత్తంబున
         నిఖిల మూర్తులెల్ల నీవయండ్రు


భావం: మహానుభావా! నీవు సత్యమే వ్రతముగా కలవాడవు. నిత్యత్వం అనే యోగ సిద్ధి ప్రాప్తించడానికి ఆధారమైన వాడవు. జరిగినది, జరుగుతున్నది, జరుగబోయేది అయిన కాలములలో ఉండెడు వాడవు. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అనే అయిదు భూతాలూ నీయందే జన్మిస్తూ ఉండెడి వాడవు, ఆ అయిదు భూతాలలోనూ నీవే నిండి ఉండిన వాడవు. ప్రళయంలో పంచ భూతాలూ అణగిపోయిన తర్వాత కూడా నీవు నిలిచి ఉండే వాడవు. సృష్టిలో ఉన్న సత్యమనేదే వాక్కుగా కలవాడవు. అన్నింటినీ సమానంగా చూడడం అనేది నిర్వహిస్తూ ఉండేవాడవు అయిన నిన్ను ఆశ్రయించుచున్నాము.
               నీ అధీనంలో మాయ అనేది ఉంటుంది. కానీ ఆ మాయ చేత అఙ్ఞానం ఆవరించిన వారు నీయందు భేదభావం వహిస్తారు. ఙ్ఞానులైన పండితులు మాత్రం ఒకే మనస్సుతో ఆలోచించి అన్నీ నీవేనని అనగలుగుతారు.
    


పకృతి యొక్కటి పాదు, ఫలములు సుఖ దు:ఖములు రెండు, గుణములు మూడు వేళ్ళు
తగు రసంబులు నాల్గు ధర్మార్థ మఖరంబులు, ఎరిగెడి విధములైదింద్రియంబులు,
ఆరు స్వభావంబులా శోక మోహాదు లూర్ములు, ధాతువులొక్క యేడు,
పై పొరలెనిమిది ప్రంగలు, భూతంబులైదు బుద్ధియు మనోహంకృతులును
             రంధ్రంబులు తొమ్మిదియు, గోటరములు
             ప్రాణ పత్ర దశకంబు, జీవేశ పక్షి యుగము
             కలుగు సంసార వృక్షంబు కలుగ చేయ   
             కాన నడగింప రాజ వొక్కరుడ వీవ


 భావం: జీవులకందరికీ ఈశ్వరుడవు నీవొక్కడివే. ఈ సృష్టిలో సంసారమనే వృక్షం ఒకటుంది. దానికి పకృతి అనే పాదు ఒకటి, సుఖ దు:ఖాలనేవి దాని రెండు ఫలాలు, సత్వము, రజస్సు, తమస్సు అనే గుణాలు మూడు దానికి వేళ్ళు, ధర్మము, అర్థము, కామము, మోక్షము అనే నాలుగు పురుషార్థాలు ఆ ఫలముల రసాలు. దానికి శబ్దం, స్పర్శం, రూపం, రుచి, వాసన అనే అయిదు ఇంద్రియాలు గ్రహించే విధానాలు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే ఆరు స్వభావాలు ఆ వృక్షానికి గల ఆరు ఊర్ములు (ఆకలి, దాప్పిక, శోకము, మోహము, ముసలితనం, మరణం అనేవి) రసం, రక్తం మాంసం, మేథస్సు, అస్తి, మజ్జ, శుక్రము అనే ఏదు ధాతువులూ ఆ వృక్షానికి గల ఏడు పొరలుగా ఉంటాయి. ఇంత తెలిసీ ఇంకా తొట్రుపాటు పడడమెందుకు? పంచభూతాలు, బుద్ధి, మనస్సు, అహంకారం అనే ఎనిమిదీ ఆ వృక్షానికి కొమ్మలు.
      పంగల నుండి సాగిన కన్నులు, చెవులు, ముక్కు పుటాలు, నోరు, మల మూత్ర ద్వారాలు అనే తొమ్మిదీ ఆ వృక్షానికి గల తొమ్మిది తొర్రలు. ఈ సంసార వృక్షం ప్రాణం, అపానము, వ్యానము, ఉదానము, సమానము అనే పంచ ప్రాణాలు; నాగము, కూర్మము, కృకరము, దేవదత్తము, ధనంజయము అనే అయిదు ఉప ప్రాణాలు- మొత్తం పది ప్రాణాలు అనే ఆకులు ధరించి ఉంటుంది. జీవుడు, ఈశ్వరుడు అనే రెండు పక్షులు ఆ వృక్షం పైన నివసిస్తూ ఉంటాయి. ఇటువంటి అద్భుతమైన సంసార వృక్షాన్ని పుట్టించడానికి, రక్షించడానికి, మళ్ళీ లయం చేయడానికి ప్రభువు నీవు ఒక్కడవే.
 


నీ దెస తను చిత్తములిడి
యే దెసలకు పోక కడతు రెరుక కలుగు వా
రా దూడ యడుగు క్రియ నీ
పాదంబను నావకతన భవ సాగరమున్


భావం: తెలిసిన వారు అనగా ఙ్ఞానులైన వారు తమ మనస్సును, శరీరమును యేవైపునకు పోనీయకుండా నీయందే నిలుపుతారు. అందువలననే వారు నీ పాదమనే నావ ఆధారంతో భయంకరమైన సంసార మహా సముద్రాన్ని ఆవుదూడ అడుగును దాటినంత తేలికగా దాటగలుగుతారు.  

మంచివారికెల్ల మంగళ ప్రదమయ్యు
గల్లరులకు మేలు గానియట్టి
తనువులెన్నియైన దాల్చి లోకములకు
సేమమెల్ల ప్రొద్దు సేయు దీవు


భావం: ఎన్ని శరీరాలు అవసరమైతే అన్ని శరీరాలూ ధరిస్తూ నీవు నిత్యమూ లోకాలకు క్షేమం కలుగచేస్తూ ఉంటావు. ఆ శరీరాలతో నీవు మంచివారి కందరికీ శుభములు చేకూరుస్తూ, దుష్టులకు శిక్ష విధిస్తూ ఉంటావు. 


ఎరిగిన వారల మనుచును
గొరమాలిన ఎరుక లెరింగి కొందరు నీ పే
రెరింగియు తలపగ నొల్లరు
పరతు రధో గతుల జాడ పద్మ దళాక్షా!


భావం: పద్మముల వంటి కన్నులు కల వాడా! దేవా! నిజంగా ఙ్ఞానులైన వారిని రక్షించే నీ నామ సంకీర్తన చేయక, కొందరు ఙ్ఞానులము అనుకుంటూ, దుష్టులై పనికి మాలిన తెలివితేటలతో నీ నామ సంకీర్తన చేయడానికి ఇష్ట పడరు. ఆ విధంగా ప్రవర్తించి, అధోగతులైన వారిని చూసి అయినా వారు నేర్చుకోరు.      


నీవారై నీ దెస తమ
భావంబులు నిలిపి ఘనులు భయ విరహితులై
యే విఘ్నంబుల చెందక
నీ వరలెడి మేటి చోట నెగడుదు రీశా!


భావం: ప్రభూ! గొప్ప వారైన వారు నీ వారుగా ఉంటూ నీయందే తమ భావాలను నిలిపి ఉంచడం చేత భయం అనేది లేక, నీయందు హృదయాలు నిలపడం వల్ల విఘ్నాల బారి పడక, నీవు ఎక్కడ ఉంటావో ఆ దివ్య లోకంలోనే వారూ నివసిస్తారు.  




నిను నాలుగాశ్రమంబుల
జనములు సేవింప నఖిల జగముల సత్వం
బును శుద్ధంబును శ్రేయం
బును ననుగాత్రంబు నీవు వొందుదువు హరీ!


భావం: ఓ భగవంతుడా! బ్రహ్మ చారులు, గృహస్తులు, వానప్రస్థులు, సన్యాసులు- అనే నాలుగు ఆశ్రమాల ప్రజలు నిన్ను సేవిస్తూ ఉండగా అన్ని లోకాలలోనూ సత్వమయమైనదీ, పరిశుద్ధమైనదీ, క్షేమము చేకూర్చేదీ అయిన దేహాన్ని నీవు పొందుతూ ఉంటావు.   


నళినాక్ష! సత్వగుణంబు నీ గాత్రంబు గాదేని విఙ్ఞాన కలితమగుచు
నఙ్ఞానబేధకం బగు టెట్టు? గుణముల యందును వెలుగ నీవనుమతింప
బడుదువు, సత్వ రూపంబు సేవింపంగ సాక్షాత్కరింతువు సాక్షివగుచు
వాఙ్ఞ్మనంబుల కవ్వలిదైన మార్గంబు కలుగు, నీగుణ జన్మ కర్మ రహిత
మైన రూపును బేరు నత్యనఘ బుద్ధు
లెరుగుదురు, నిన్ను గొల్వ నూహించుకొనుచు
వినుచు దలచుచు బొగడుచు వెలయువాడు
భవము నొందడు నీ పాద భక్తుడగును


భావం: పద్మ దళముల వంటి కన్నులు గల శ్రీమన్నారాయణా!  సత్వ గుణమే నీ శరీరంగా రూపు కట్టుకొంది. ఆ విధంగా కాకపోతే  నీ శరీరం విఙ్ఞానంతో నిండి ఉండి అఙ్ఞానాన్ని బేధించడం ఎలా సాధ్యం? గుణములలో కూడా వెలుగుతూ ఉన్న వాడుగా నీవు పరిగణింప బడుతూ ఉన్నావు. అలా కాకుండా నీ సత్వ రూపాన్నే సేవిస్తే సాక్షాత్కరిస్తావు. అటువంటప్పుడు నీవు గుణములకు అంటక కేవలము సాక్షిగా ఉంటావు. నీ మార్గం వాక్కుకు, మనసుకూ అతీతంగా ఉంటుంది. పుణాత్ములైన వివేకవంతులు గుణములకు, కర్మలకు అతీతమైన నీ రూపాన్ని గ్రహిస్తారు. నిన్ను సేవిస్తూ, భావన చేస్తూ, నిన్ను గురించి వింటూ, స్మరిస్తూ, స్తోత్రం చేస్తూ జీవించేవాడు తిరిగి ఈ సంసారాన్ని పొందడు. నీ పాదములనే అంటి పెట్టుకుని భక్తుడై ఉండిపోతాడు.      


ధరణీ భారము వాసెను
పురుషోత్తమ! ఈశ! నీదు పుట్టువున, భవ
చ్చరణాంబుజముల ప్రాపున
ధరణియు నాకసము గాంచెదము నీ కరుణన్


భావం: పురుషోత్తమా! ఈశ్వరా! నీవు జన్మించడం వల్ల ఈ భూ భారం తగ్గిపోయింది.  నీ పాద పద్మములు మాకు అండగా ఉండగా నీ దయ వల్ల భూమి, ఆకాశమూ ఎక్కడ ఉన్నాయో చూడ గల్గుతాము.    


పుట్టువు లేని నీకభవ! పుట్టుట క్రీడయు కాక పుట్టుటే?
యెట్టనుడున్ భవాది దశలెల్లను జీవులయం దవిద్య దా
జుట్టుచు నుండు గాని నిను జుట్టినదింబలె బొంత నుండియుం
జుట్టగలేమి తత్క్రియల జొక్కని యెక్కటి వౌదు వీశ్వరా!


భావం: పుట్టుటయే లేని నారాయణా! నీకు పుట్టుక అంటూ వేరే లేదు. అటువంటి నీవు ఇలా పుట్టడం అనేది నీకు క్రీడయే కానీ పుట్టుక కాదు కదా! అది ఎలా అంటే జన్మ, మరణం మొదలైన స్థితులన్నీ మాయ కారణంగా జీవులను ఆవరిస్తూ ఉంటాయి. కానీ నిన్ను మాత్రం ఆ మాయా దేవి ప్రక్కన నిలబడి కూడా స్పృశించలేక దూరంగా ఉండిపోతుంది. కనుక ఆ మాయామయమైన క్రియలు వేటిలోనూ చిక్కుకొనకుండా ఏకైక మూర్తివిగా నిలబడిపోతావు. కనుకనే ఈ జగత్తులకన్నిటికీ నీవు ఈశ్వరుడవు.  



గురు పాఠీనమవై జల గ్రహమువై కోలంబవై శ్రీ నృకే
సరివై భిక్షుండవై హయాననుడవై క్ష్మాదేవతా భర్తవై
ధరణీ నాథుడవై దయా గుణ గణోదారుండవై లోకముల్
పరిరక్షించిన నీకు మ్రొక్కెద మిలా భారంబు వారింపవే!


భావం: నీవు ఎన్నో అవతారాలెత్తి దయా దాక్షిణ్యాలు మొదలైన గుణాలతో ఉదారుడవై లోకాలను రక్షించావు. మహా మత్స్య రూపుడవై, కూర్మ మూర్తివై, వరాహ రూపుడవై, శ్రీ నరసింహుడవై, వామన మూర్తివై, హయగ్రీవుడవై, పరశురాముడవై, శ్రీరామచంద్రుడవై లోకాలను రక్షించిన నీకు ఇదే మేము నమస్కరిస్తున్నాము. ఈ భూమి భారాన్ని తొలగించవలసిందిగా నిన్ను ప్రార్థిస్తున్నాము.  


ముచ్చిరి యున్నది లోకము
నిచ్చలు కంసాది ఖలులు నిర్దయులేచన్
మచ్చిక గావగ వలయును
విచ్చేయుము తల్లి కడుపు వెడలి ముకుందా!


భావం: కంసుడు మొదలైన దుర్మార్గులు క్రూరంగా వేధిస్తూ బాధిస్తూ ఉంటే ఈ లోకం నిత్యం దు:ఖంలో మునిగి పోయి ఉంది. ముకుందా! లోకాన్ని కాపాడడానికి తల్లి కడుపులో నుండి వెంటనే బయటికి రమ్ము.       







      

No comments:

Post a Comment