Thursday, January 12, 2017

అంబరీష గుణ వర్ణన

విష్ణు భక్తుల్లో శ్రేష్ఠుడైన అంబరీషుని గుణ గణాలను వర్ణించే ఈ పద్యాలు సాధకులందరికీ కూడా మార్గ నిర్దేశం చేస్తాయి.
                                     

చిత్తంబు మధురిపు శ్రీ పాదములయంద; పలుకులు హరి గుణ పఠనమంద;
కరములు విష్ణు మందిర మార్జనములంద; శ్రవములు హరి కథా శ్రవణమంద;
చూపులు గోవింద రూప వీక్షణమంద; శిరము కేశవ నమస్కృతుల యంద;
పదము లీశ్వర గేహ పరి సర్పణమంద; కామంబు చక్రి కైంకర్యమంద;
సంగ మచ్యుత జనతనుసంగమంద,
ఘ్రాణ మసురారి భక్తాంఘ్రి కమలములంద
రసన తులసి దళములంద, రతులు పుణ్య 
సంగతుల యంద యా రాజ చంద్రమునకు   

భావం: ఆ రాజ చంద్రుని మనస్సు శ్రీహరి పాదాల మీదే, మాటలు హరి గుణ సంకీర్తనమందే, చేతులు విష్ణు మందిరాలను శుభ్ర పరచడమందే, చెవులు హరి కథలను వినడమందే, చూపులు గోవిందుని రూపాన్ని తనివి తీరా చూడడం మీదే, శిరమును శ్రీహరి చెంత నమస్కరించడమందే, పాదాలు విష్ణు దేవుని ఆలయాలను చుట్టి రావడమందే, కోరిక హరి సేవయందే, చెలిమి విష్ణు భక్తుల యందే, ఘ్రాణము భక్త జనుల పాద కమలములందు, నాలుక పవిత్ర తులసీ దళములందు, కోరికలు పుణ్య విషయాల యందే నిమగ్నమై ఉండేవి. వాస్తవమునకు అతడు స్వీయేంద్రియ భోగమునకు దేనిని కోరలేదు. అతడు సర్వేంద్రియాలను భగవత్సంబంధమైన కార్యక్రమములలో నిల్పి భక్తి యోగంలోనే దేహాన్ని నెలకొనేటట్లు చేసాడు.      

ఘన వైభవంబునం గల్మష దూరుడై యఙ్ఞేశు నీశు నబ్జాక్షు గూర్చి 
మొనసి వశిష్ఠాది ముని వల్లభుల తోడ దగిలి సరస్వతీ తటము నందు
మేధతో బహు వాది మేధంబులొనరించె గణుతింపరాని దక్షిణలు వెట్టి 
సమ లోష్ట హేముడై సర్వ కర్మంబులు హరి పరంబులు గాగ నవని యేలె
విష్ణు భక్తులందు విష్ణువు నందుగ
లంక మెడల మనసు లంకె పెట్టి
విహిత రాజ్య వృత్తి విడువని వాడునై
యతడు రాచ తపసి యనగ నొప్పె


భావం: గొప్ప వైభవంతో పుణ్యాత్ముడై అంబరీషుడు విద్యుక్త ధర్మ పాలనము నందు తన సమస్త రాచ కర్మ ఫలమును పరమ భోక్త, ఇంద్రియానుభూతికి పరమైన వాడు, దేవదేవుడగు విష్ణువునకు అర్పించి భగవన్నిష్ఠులైన వశిష్ఠుడు మొదలైన ఋషులతో కూడి యఙ్ఞేశుడైన శ్రీహరిని గూర్చి సరస్వతీ నదీ తీరంలో లెక్కించరాని దక్షిణలు పెట్టి మహదైశ్వర్యములోను, యుక్తమగు సామగ్రిలోను ఎన్నో అశ్వమేథ యాగాలు చేసాడు. బంగారాన్నీ, మట్టి పెళ్ళనూ సమానంగా చూసే అతడు సర్వ కర్మలను హరి పరం చేసి భూమిని పరిపాలించాడు. విష్ణు భక్తుల పట్ల, శ్రీహరి పట్ల మనసు లంకె పెట్టి తనకు విధించబడ్డ రాజ్య పాలన వదలక భూమండల చక్రవర్తియైన అంబరీషుడు ఈ విధంగా భక్తి యోగమున నెలకొనిన వాడై రాజర్షిగా విరాజిల్లాడు.  

హరియని సంభావించును, హరి యని
దర్శించు, నంటు; నాఘ్రాణించున్;
హరి యని రుచి గొన దలచును,
హరిహరి!ఘను నంబరీషు నలవియె పొగడన్?

భావం:ఆ భగవంతుని భక్తుడైన అంబరిషుడు 'హరీ' అని తలచేవాడు, 'హరి' అని చూసేవాడు, 'హరి' అని తాకేవాడు, 'హరి' అని వాసన చూసేవాడు, 'హరి' అంటూ రుచి చూసేవాడు. అహా! గొప్పవాడైన ఆ అంబరీషుడిని కొనియాడ సాధ్యమా!         

No comments:

Post a Comment