బలి చక్రవర్తి వద్దకు చిన్ని వటువుగా వెళ్ళిన విష్ణువు మూడడుగుల భూమినిమ్మని కోరగా పరవశుడైన బలి మేరలేని ఔదార్యంతో దానమిస్తాడు. అప్పుడు స్వామి బ్రహ్మాండాలన్నీ విస్తరించిన వర్ణన పోతన గారు వాక్కులో అమృతాన్ని కురిపించారా అన్నట్లు దర్శింప చేస్తారు.
ఇంతింతై, వటుడింతయై, మరియు దానింతై, నభో వీథిపై
నంతై, తోయద మండలాగ్రమున కల్లంతై, ప్రభారాశిపై
నంతై, చంద్రుని కంతయై, ధ్రువునిపై నంతై, మహర్వాటి పై
నంతై, సత్య పదోన్నతుం డగుచు బ్రహ్మాండాంత సంవర్థియై
భావం: కొద్ది కొద్దిగా ఎదిగినాడు స్వామి. ఇంత వాడు అంత వాడైనాడు, అంత వాడు మరింత వాడైనాడు. క్రమ క్రమంగా పెరిగిపోతున్నాడు. వరుసగా ఆకాశం కంటె, మేఘ మండలం కంటె, వెలుగుల రాశి కంతె పైకి పెరిగాడు. చంద్రుని వరకూ, ధృవ తార వరకూ, మహర్లోకం వరకూ, ఆ పైన సత్య లోకం వరకూ పెరుగుతూ బ్రహ్మాండమంతా నిండి పోయాడు.
రవి బింబం బుపమింప బాత్రమగు ఛత్రంబై, శిరో రత్నమై
శ్రవణాలంకృతియై గళాభరణమై సౌవర్ణ కేయూరమై
ఛవిమత్కంకణమై కటి స్థలి నుదంచ ద్ఘంటయై నూపుర
ప్రవరంబై పద పీఠమై వటుడు దా బ్రహ్మాండమున్ నిండుచోన్
భావం: వామనుడు బ్రహ్మాండమంతా నిండిపోతున్న ఆ సమయంలో సూర్య బింబం క్రమ క్రమంగా అతనికి గొడుగుగా పోల్చడానికి వీలైంది. తర్వాత శిరోమణిగా, తర్వాత మకర కుండలంగా, తర్వాత కంఠాభరణంగా, ఆ తర్వాత బంగారు భుజ కీర్తిగా, అటు తర్వాత కాంతులీనే కంకణంగా, అనంతరం మొలలోని గంటగా, ఆ పైన మేలైన కాలి అందెగా, చివరకు పాదపీఠంగా ప్రకాశించింది.
ఒక పదంబు క్రింద నుర్వి పద్మము నంటి
కొన్న పంకలవము కొమరు దాల్చె
నొకటి మీద దమ్మి కొదిగిన తేటినా
వెలసె మిన్ను నృప! త్రివిక్రమమున
భావం: రాజా! ఈ విశ్వరూపంలో ఒక పాదం క్రింద ఉన్న భూమండలం పద్మానికి అంటుకున్న చిన్న బురద ముద్ద వలె ఒప్పింది. ఇంకొక పాదం మీద ఉన్న ఆకాశం పద్మం మీద వ్రాలిన తుమ్మెద వలె ప్రకాశించింది.
జగములెల్ల దాటి చనిన త్రివిక్రము,
చరణ నఖర చంద్ర చంద్రికలను
బొనుగు పడియె సత్యమున బ్రహ్మ తేజంబు,
దివసకరుని రుచుల దివియ వోలె
భావం: అన్ని లోకాలకూ దాటిపోయిన త్రివిక్రమ దేవుని యొక్క చంద్రుని వంటి కాలిగోళ్ళ కాంతికి లోకంలోని బ్రహ్మ తేజస్సు సూర్యుని ముందు దివిటీ వలె వెల వెల పోయింది.
తన పుట్టిల్లిదె పొమ్మటంచు నజుడుం దన్నాభి పంకేరుహం
బు నిరీక్షించి, నటించి యున్నత పదంబుం జూచి తత్పాద సే
చనముంజేసె కమండలూదకములం జల్లించి, తత్తోయముల్
విను వీథిం బ్రవహించె దేవనది నా విశ్వాత్ము కీర్తి ప్రభన్.
భావం: మహా విష్ణువు బొడ్డు తామరను చూసి "నా జన్మ స్థానం ఇదే సుమా" అని అనుకుంటూ బ్రహ్మదేవుడు సంతోషించినాడు. తన కమండల జలంతో స్వామి పాదాన్ని కడిగాడు. ఆ జల ధారలు భగవంతుని కీర్తి కాంతితో నిండి ఆకాశంలో దేవ నదిగా ప్రవహించాయి.
No comments:
Post a Comment