Thursday, January 12, 2017

క్షీర సాగర మథనం

         దేవ దానవులు అమృతో త్పాదనం కోసం క్షీర సాగర మథనం చేస్తుండగా అగ్ని జ్వాలల కోలాహలంతో హాలాహలం పుట్టి అందరినీ భయ భ్రాంతులను చేసింది. దానిని అడ్డగించే మహనీయులెవరూ కానక చివరకు తమకు ఆ మహేశ్వరుడొక్కడే గతి యని తలంచి బ్రహ్మాది దేవతలంతా కైలాసానికి వెళ్ళి తమ కష్టాన్ని మొర పెట్టుకుని ఆయన వైభవాన్ని ఇలా స్తుతించారు: 
                                             

భూతాత్మ! భూతేశ! భూత భావన రూప! దేవ! మహాదేవ! దేవ వంద్య!
ఈ లోకములకెల్ల ఈశ్వరుండవు నీవు బంధ మోక్షములకు ప్రభుడ వీవ
యార్త శరణ్యుండ వగు గురుండవు నిన్ను గోరి భజింతురు కుశల మతులు
సకల సృష్టి స్థితి సంహార కర్తవై బ్రహ్మ విష్ణు శివాఖ్య బరగు దీవు
పరమ గుహ్యమైన బ్రహ్మంబు సద సత్త
మంబు నీవ, శక్తి మయుడ వీవ
శబ్ద యోని వీవ జగదంతరాత్మవు నీవ
ప్రాణ మరయ నిఖిలమునకు  

భావం: ఓ పరమేశ్వరా! నీవు పంచ భూతాలకూ ఆత్మయైన వాడవు. భూత నాథుడవు. జీవులకు కారణ రూపమైన దేవుడవు. దేవ దేవా! మహా దేవా! దేవ వంద్యా! అన్ని లోకాలనూ పాలించే వాడవు నీవు. లోకంలోని బంధ మోక్షాలకు కారణమైన ప్రభుడవు నీవు. దు:ఖించే వారిని చేరదీసే తండ్రివి నీవు. వారికి మోక్షాన్ని ఇచ్చేవాడవు నీవే. బుద్ధిమంతులు ప్రీతితో నిన్ను పూజిస్తారు. సమస్తమైన సృష్టికీ, స్థితికీ, నాశనానికీ కర్తవు నీవే. బ్రహ్మ, విష్ణువు, శివుడు అనే పేర్లతో ప్రకాశించే వాడవు నీవు. భావింపరాని పరమాత్మవు నీవే. ప్రకృతి పురుష స్వరూపుడవు నీవే. శక్తి యుక్తుడవు నీవే. శబ్దానికి జన్మ స్థానం నీవే. లోకాలకు అంతరాత్మవు నీవే. సమస్తానికీ ప్రాణం నీవే   
 

నీ యంద సంభవించును
నీ యంద వసించి యుండు నిఖిల జగములున్
నీయందు లయము బొందును
నీ యుదరము సర్వ భూత నిలయము రుద్రా!


భావం: పరమేశ్వరా! అన్ని లోకాలూ నీలోనే పుడతాయి. నీలోనే వసిస్తాయి. నీలోనే లయమవుతాయి. అన్ని ప్రాణులకూ నీ ఉదరం ఆలవాలం.  


అగ్ని ముఖంబు,పరాపరాత్మక మాత్మ, కాలంబు గతి, రత్న గర్భ పదము,
శ్వనంబు నీ యూర్పు, రసన జలేశుండు, దిశలు కర్ణంబులు, దివము నాభి,
సూర్యుండు కన్నులు, శుక్లంబు సలిలంబు, జఠరంబు జలధులు, చదలు శిరము,
సర్వౌషధులు రోమచయములు, శల్యంబు లద్రులు, మానస మమృతకరుండు
ఛందములు ధాతువులు ధర్మ సమితి హృదయ
మాస్య పంచక ముపనిష దాహ్వయంబు
నయిన నీరూపు పర తత్వమై శివాఖ్య
మై స్వయంజ్యోతియై  యొప్పు నాద్యమగుచు.


భావం: అగ్ని నీ ముఖం, జీవాత్మ-పరమాత్మల కలయిక నీ యాత్మ, కాలం నీ నడక, భూమి నీ పాదం, వాయువు నీ శ్వాస, వరుణుడు నీ నాలుక, దిక్కులు నీ చెవులు, స్వర్గం నీ నాభి, సూర్యుడు నీ కన్నులు, నీరు నీ వీర్యం, సముద్రాలు నీ గర్భం, ఆకాశం నీ శిరస్సు, సమస్త ఓషధులూ నీ రోమ సమూహాలు, పర్వతాలు నీ ఎముకలు, చంద్రుడు నీ మనస్సు, వేదాలు నీ ధాతువులు, ధర్మ శాస్త్రాలు నీ హృదయం, ఉపనిషత్తులు నీ పంచ ముఖాలు, నీ రూపం పరతత్వం, నీవు స్వయం ప్రకాశుడవు. శివ స్వరూపుడైన పరం జ్యోతివి నీవు. సర్వమునకూ నీవే ఆద్యుడవు.   
 

కొందరు కలడందురు నిను;
కొందరు లేడందురతడు గుణి కాడనుచుం
గొందరు; కలడని లేడని,
కొందల మందుదురు నిన్ను గూర్చి మహేశా!


భావం: ఓ మహా ప్రభూ! శివా! కొందరు నీవున్నావని అంటారు, కొందరు నీవు లేవంటారు, మరి కొందరు నీవు గుణాతీతుడవంటారు, ఇంకా కొందరు నీవు ఉన్నావో లేవో అనే సందేహంతో బాధలు పడుతుంటారు. 

తలప ప్రాణేంద్రియ ద్రవ్య గుణ స్వభావుడవు, కాల క్రతువులును నీవ;
సత్యంబు ధర్మ మక్షరము ఋతంబును, నీవు ముఖ్యుండవు నిఖిలమునకు
ఛందోమయుండవు సత్వ రజ స్తమ, శ్చక్షుండవై యందు సర్వ రూప
కామ పురాధ్వర కాల గతాది భూత ద్రోహ భయము చోద్యంబు గాదు
లీల లోచన వహ్ని స్ఫులింగ శిఖల,
నంతకాదుల గాల్చిన యట్టి నీకు
రాజ ఖండావతంస! పురాణ పురుష!
దీన రక్షక! కరుణాత్మ! దేవ దేవ!


భావం: ఓ దయామయా! దేవ దేవా! పురాణ పురుషా! చంద్ర కళా కిరీటా! దీన రక్షకా! ఆలోచిస్తే ప్రాణమూ, ఇంద్రియాలూ, ద్రవ్య గుణాలూ నీకు స్వభావ సిద్ధాలు. కాలమూ యఙ్ఞాలూ నీవే. సత్యమూ, ధర్మమూ, ఓంకారమూ, మోక్షమూ నీవే. అన్నింటికీ ఆధారం నీవే. వేద రూపుడవు నీవే. సత్వము, రజస్సు, తమస్సు నీ నేత్రాలు. అన్ని రూపాలలోను నీవు ఉన్నావు. నుదుటి కంటి మంటలతో యమాదులను అవలీలగా నీవు కాల్చి వేసావు. అటువంటి నీకు మన్మథుడూ, త్రిపురాసురులూ, దక్ష యఙ్ఞము, కాలకూట విషము మొదలైన వాటి నుండి హాని కలుగుతుందనే సంకోచం ఏ మాత్రం లేదు.   



మూడు మూర్తులకు మూడు లోకములకు
మూడు కాలములకు మూలమగుచు
బేధమగుచు తుది నబేధమై యొప్పారు
బ్రహ్మ మనగ నీవ ఫాల నయన 


భావం: ఓ శంకరా! బ్రహ్మ, విష్ణు, ఈశ్వరులనే మూడు మూర్తులకూ, స్వర్గ పాతాళ భూములనే మూడు లోకాలకూ, భూత భవిష్యత్ వర్తమానాలనే మూడు కాలాలకూ నీవే మూలం. మొదట బేధంతో కనిపించినా చివరికి అబేధ స్వరూపంతో ఒప్పుతున్న పరబ్రహ్మం నీవే.   

సద సత్తత్వ చరాచర
సదనంబగు నిన్ను బొగడ జలజ భవాదుల్
పెదవులు కదలుప వెరతురు
వదలక నిను పొగడ నెంత వారము దేవా!


భావం: ఓ స్వామీ! సదసద్రూపమైన ఈ చరాచార ప్రపంచానికి మూలాధారం అయిన నిన్ను బ్రహ్మాదులు కూడా ప్రస్తుతించడానికి భయపడి పెదవులు కదిలించలేరు. అటువంటి నిన్ను స్తుతించడానికి మేము ఎంత వారము?



బాహు శక్తి సురాసురుల్ చని పాలవెల్లి మథింప హా
లాహలంబు జనించె నేరి కలంఘ్య మై భువనంబు గో
లాహలంబుగ జేసి చిచ్చును లాగముం గొని ప్రాణి సం
దోహమున్ బ్రతికింపవే? దయ దొంగిలింపగ నీశ్వరా!


భావం: ఓ పరమేశ్వరా! దేవతలూ, రాక్షసులూ తమ భుజ బలంతో పాల సముద్రాన్ని చిలకగా హాలాహల విషం పుట్టి ఎవరికీ లొంగకుండా లోకాలను కోలాహలం చేస్తున్నది. ఎవరూ దానిని ఎదిరించలేక పోతున్నారు.అది లోకానికి ఎంతో క్షోభ కలిగిస్తు ఉన్నది. ఆ విష జ్వాలను అవలీలగా పరిగ్రహించు. దయతో ప్రాణికోటిపై నీ కరుణ పడునట్లు వారిని కరుణించు. 



లంపటము నివారింపను
సంపద కృప సేయ జయము సంపాదింపం
జంపెడి వారి వధింపను
సొంపారగ నీక చెల్లు సోమార్థ ధరా!


భావం: ఓ చంద్ర శేఖరా! ఆపదను తొలగించడానికీ, ఆనందాన్ని చేకూర్చడానికీ, జయాన్ని సంపాదించడానికీ, కౄరులను హత మార్చడానికీ నీకే సాధ్యమవుతుంది. 


నీకంటె నొండెరుంగము
నీకంటెం బరులు గావ నేరరు జగముల్
నీకంటె నొడయడెవ్వడు
లోకంబుల కెల్ల నిఖిల లోక స్తుత్యా!


భావం: అన్ని లోకాల చేతనూ పొగడ బడుతున్న స్వామీ! నీవే మాకు దిక్కు. నిన్ను తప్ప మరెవ్వరినీ ఆశ్రయింపము.నీవు తప్ప ఇంకెవరూ లోకాలను కాపాడ లేరు. అన్ని లోకాలలోనూ నీ కంటే గొప్పవాడు వేరు ఎవ్వడు లేడు.  


No comments:

Post a Comment