Tuesday, January 10, 2017

దేవకీ దేవి చేసిన శ్రీ కృష్ణ స్తుతి

కంసుని చెరలో నున్న దేవకీ వసుదేవులకు అజుడైన పరమాత్మ జన్మించిన తరుణంలో, పుణ్య చరితయైన దేవకీ దేవి ఆ దేవదేవుని చూచి ఈ విధంగా స్తుతించింది.
                                             

అట్టిట్టిదానరానిదై మొదలై నిండుకొన్నదై వెలుగుచు గుణము లేని
దై యొక్క చందంబుదై కలదై నిర్విశేషమై  క్రియలేక చెప్పరాని
దేరూపమని శృతులెప్పుడు నొడివెడి యా రూపమగుచు నధ్యాత్మ దీప
మై బ్రహ్మ రెండవ యర్థంబు తుది జగంబులు నశింపగ పెద్ద భూత గణము
సూక్ష్మ భూతమందు జొరగ నా భూతంబు
ప్రకృతిలోన జొరగ ప్రకృతివోయి
వ్యక్తమందు జొరగ వ్యక్తమడంగును
శేష సంఙ్ఞ నీవు సెలువ మగుదు

భావం: బ్రహ్మ దేవుని ఆయుర్దాయంలోని రెండవ సగం పూర్తి అయిన తరువాత స్థూలమైన పంచ మహా భూతాలూ అహంకారమనే సూక్ష్మ భూతంలో లీనమవుతాయి. అది మూల ప్రకృతిలో లీనమవుతుంది. ఆ మూల ప్రకృతి వ్యక్తి తత్వంలోనికి లీనమవుతుంది. ఆ వ్యక్తి తత్వం కూడా లీనమైన తరువాత శేషుడవై నీవు నిలబడి ఉంటావు. అలాంటి నీ తత్వం అలాంటిదీ, ఇలాంటిదీ అనే వర్ణనకు అతీతమైనది. అదే అన్నింటికీ మొదలు. అన్నిటా అదే నిండి వెలుగుతూ ఉంటుంది. గుణాలకు అది అతీతమైనది. ఏకైక తత్వంగా నిలబడి ఉంటుంది. అదికాక వేరుగా శేషించినదంటూ ఏమీ ఉండదు. దాని రూపం ఇలా ఉంటుంది అని చెప్పడానికి వీలు లేదు. ఎందువల్లనంటే అది సర్వ క్రియా స్వరూపమైనది. వేదాలు ఈ తత్వాన్ని గురించే ఎప్పుడూ గానం చేస్తూ ఉంటాయి. దానికి ఆధారంగా నిలబడిన జ్యోతి అది. అది నీవే!   

విశ్వము లీల ద్రిప్పుచు నవిద్యకు జుట్టమవైన నీకు దా
శాశ్వతమైన కాలమిది సర్వము వేడబమందు రట్టి వి
శ్వేశ్వర! మేలుకుప్ప నిను నెవ్వడుకోరి భజించు వాడపో
శాశ్వత లక్ష్మి మృత్యుంజయ సౌఖ్యయుతుం డభయుండు మాధవా! 

భావం: విశ్వేశ్వరా! ఈ విశ్వాన్ని అంతటినీ నీ లీలతో ప్రవర్తింపచేస్తూ ఉంటావు. దానికి ఆధారమైన అవిద్య అనబడే మాయకు నీవు దగ్గరి బంధువువు. కనుక ఈ శాశ్వతమూ, అనంతమూ అయిన కాలమంతా నీవు నడిపించే మాయ. ఈ విధంగా శాశ్వతమైన కాలాన్ని ప్రవర్తింప చేస్తూ జగత్తులకు మేలు చేకూర్చే నిన్ను కోరి ఆరాధించే వాడు వివేకవంతుడు. వాడే సమస్త లక్ష్మీ కళలను, శాశ్వత మృత్యుంజయత్వాన్నీ, శాశ్వత సుఖాన్నీ పొందిన వాడు. లక్ష్మీ దేవికి భర్తవైన నిన్ను సేవించే వాడే భయం అంటే ఏమిటో తెలియని వాడు.        

ఒంటొ నిల్చి పురాణ యోగులు యోగ మార్గ నిరూఢులై  
కంటి మందురు కాని నిక్కమ కాన! రీ భవదాకృతిం
గంటి భద్రము గంటి, మాంసపు కన్నులం గనబోల, దీ 
తొంటి రూపు దొలగంబెట్టుము తోయజేక్షణ! మ్రొక్కెదన్

భావం: ప్రాచీన కాలం నుంచీ మహా యోగీశ్వరులు యోగ మార్గంలో అత్యంత దీక్షతో ఒంటరిగా తమకు తాము సాధన చేసి నిన్ను చూచామంటారు. కానీ వారు చూచింది తాము చూడదలచిన రూపాన్నే కానీ నీవు అనుగ్రహించే ఆ రూపాన్ని కాదు. నీవు అనుగ్రహించి దర్శనం ఇప్పించిన ఆ రూపాన్ని నేను చూచాను. ఇంక నాకు భయమనేదే లేదు. ఈ భౌతికమైన కన్నులతో నీ ఈ దివ్య రూపాన్ని చూడటం కష్టంగా ఉంది. సర్వానికీ ఆధారమైన ఈ స్వస్వరూపాన్ని ఉపసంహరించుకో. నీ చూపులలో ఏవేవో వెలుగులు విచ్చుకుంటున్నాయి. కమల దళాల వంటి కన్నులు గల ఓ దేవా! నీకిదే నమస్కారం చేస్తున్నాను.      

విలయ కాలమందు విశ్వంబు నీ పెద్ద 
కడుపులోన దాచు కడిమి మేటి 
నటుడ వీవు, నేడు నా గర్భజుడవౌట, 
పరమ పురుష!వేడబంబు గాదె!

భావం: సృష్టి అంతా ప్రళయంలో లీనమైపోయినప్పుడు ఆ సమస్త విశ్వాన్నీ నీ కడుపులో దాచుకున్న సమర్థుడవైన మహా నటుడవు. అటువంటి పరమ పురుషుడవు నీవు నా కడుపున పుట్టడం నీ మాయ కాకపోతే మరేమిటి!   

నలిన లోచన! నీవు నిక్కము నాకు పుట్టెదవంచు నీ 
ఖలుండు గంసుండు పెద్ద కాలము కారయింట నడంచె దు
ర్మలిన చిత్తుని నాఙ్ఞ సేయుము, మమ్ము గావుము భీతులన్,
నులుసు లేక ఫలించె నోచిన నోము లెల్లను నీవయై    

భావం: పద్మ దళాల వంటి చక్కని కన్నులున్న నీవు నాకడుపున పుట్టబోతున్నావని విని దుర్మార్గుడైన కంసుడు మమ్ములను చాలా కాలం ఈ కారాగృహంలో బంధించి బాధ పెట్టాడు. మురిగిపోయిన మనస్సు గల ఈ దుష్టుని శిక్షించి, భయ భ్రాంతులమైన మమ్ము రక్షించుము. మేము నోచుకున్న నోములన్నీ ఏ లోటూ లేకుండా ఈ విధంగా నీ రూపంగా పండినాయి.  

No comments:

Post a Comment