శ్రీకృష్ణ పరమాత్మను సంహరించాలని తరుముతూ కాలయవనుడు ఒక గుహలోకి ప్రవేశిస్తాడు. ఆ గుహ పూర్తి అంధకారంగా ఉంటుంది. ఎవరో ఒక వ్యక్తి ఉన్నట్లు తెలిసి అతడే శ్రీకృష్ణుడనుకొని కాలయవనుడు కాలితో తన్నుతాడు. ఆ మహా తపస్వి కన్నులు తెరచి చూచేసరికి కాలయవనుడు భస్మమైపోతాడు. అతడే ముచికుందుడు. దేవతల వరంతో దీర్ఘ నిద్రలో ఉన్న ఆయన నారాయణుడైన శ్రీకృష్ణుని చూచి సంభ్రమంతో స్తోత్రం చేస్తారు.
నీ మాయ జిక్కి పురుష,
స్త్రీ మూర్తిక జనము నిన్ను సేవింపదు; వి
త్తామయ గృహగతమై సుఖ
తామసమై కామవంచితంబై ఈశా!
భావం: సర్వేశ్వరా! స్త్రీ పురుష రూపమైన ఈ లోకంలోని జన సమూహము నీ మాయ చేత మోహితులై ధన సంపాదన రూపమైన వ్యాధిని, సంసార రూపమైన గృహమును పొంది, ఆహార, నిద్ర, భయము, సంగము, పువ్వుల గంధము మొదలైన వాని వల్ల అనుభవములను అల్ప సుఖములనే చీకటిలో మునిగి నిన్ను భజింప నేరక ఉన్నారు.
పూని యనేక జన్మముల బొంది తుదిం తన పుణ్య కర్మ సం
తానము పేర్మి గర్మ వసుధా స్థలి బుట్టి ప్రపూర్ణ దేహుడై
మానవుడై గృహేచ్ఛబడు మందుడజంబు తృణాభిలాషయై
కానక పోయి నూతబడు కైవడి నీ పద భక్తి హీనుడై
భావం: ఓ స్వామీ! గొర్రె చక్కగా పెరిగిన గడ్డిని చూసి అపేక్షపడి దాని వలన హానిని తెలుసుకొన లేక తినబోయి నూతిలో పడునట్లు, పలు జన్మములెత్తి యెత్తి నీపాదాములందు భక్తి లేక చచ్చి చచ్చి తుదకు పుణ్య కార్యముల ఫలంగా కర్మ క్షేత్రమైన ధరాతలంలో పూర్ణ దేహంతో అవయవ హీనత లేని దుర్లభమైన మనుష్య జన్మమెత్తి పుట్టి కూడా మూఢత వల్ల నీ పద భక్తి లేని వాడై నిన్నెరుగక గేహాదులందలి వాంఛకు వశుడై, నిద్రా భయ సంగమాలయందు ఆశ కలవాడు అగుచున్నాడు.
తరుణీ పుత్ర ధనాదుల,
మరగి మహా రాజ్య విభవ మద మత్తుడనై
నరతను లుబ్ధుడనగు నా
కరయంగ బహుకాల మీశ! యారడి బోయెన్
భావం: పరమేశ్వరా! ఆలు, బిడ్డలు, ధనము మున్నగు వాటి యందు అపేక్షను ఉంచి వానితో గాఢానుబంధము గలవాడనై మహారాజ్య సంపత్తి చేత మదించిన మనసు కలవాడనై, మనుష్య శరీరమునందు గల అత్యాశను వహించి యున్న నాకు వ్యర్థముగా చాలా కాలం గడిచిపోయింది.
ఘట కుడ్య సన్నిభంబగు
చటుల కళేబరము జొచ్చి జనపతి నంచుం
బటు చతురంగంబులతో
నిటు నటు తిరుగుదును నిన్ను నెరుగక ఈశా!
భావం: కుండ, గోడ నానాటికీ క్షీణించిపోవునవి. అదేవిధంగా జడమైన, చంచలమైన ఈ దేహంలో ప్రవేశించి నేను రాజును అనే అభిమానం చేత చతురంగ బలములైన రథ, గజ, తురగ పదాతులతో విర్ర వీగుతూ, నీ స్వరూపమును విచారించి తెలుసుకోవలెనన్న చింత లేక భూమియందు అటు నిటు క్రుమ్మరుచు కాలము వ్యర్థముగా గడిపితిని.
వివిధ కామ భోగ విషయ లాలసు మత్తు
నప్రమత్త వృత్తి నంతకుండ
వైన నీవు వేళ యరసి త్రుంతువు సర్ప
మొదిగి మూషికంబు నొడియునట్లు
భావం: పలు విధములైన మనోరథములు, శబ్దాది విషయములందు ఆశ వహించి యేమరి యుండగా నీవు మాత్రం యేమరపాటు చెందక యమ ధర్మ రాజ స్వరూపుడవై పాము కనిపెట్టి యుండి తటాలున ఎలుకను ఒడిసి పట్టుకున్నట్లు సమయంరాగానే పట్టి విషయ లాలసులను హరిస్తావు.
నరవర సంఙ్ఞితమై రథ
కరి సేవితమైన యొడలు కాలగతిన్ భీ
కర మృగ భక్షితమై దు
స్తర విట్క్రిమి భస్మ సంఙ్ఞితంబగు నీశా!
భావం: గోవిందా!'ప్రభువు ' అని పేరు వహించి రథాల మీద, ఏనుగుల మీద ఎక్కి తిరిగిన ఈ శరీరం కాలవశమై భయంకరములైన జంతువులచే భక్షింపబడడం వల్ల, మురిగిపోతే పురుగులతో నిండి, కాలిపోతే బూది అని వ్యవహరించబడుతుంది.
సకల దిశలు గెలిచి సములు వర్ణింపంగ
జారు పీఠమెక్కి సార్వభౌము
డైన సతుల గృహములందు క్రీడా భోగ
వృత్తి నుండు నిన్ను వెదుకలేడు
భావం: అన్ని దిక్కులనూ జయించి సాటివారు కొనియాడగా ఉన్నత పీఠం అధిష్ఠించిన చక్రవర్తి అయినప్పటికీ సుందరీ మణుల మందిరాలలో కామ సుఖాలు అనుభవిస్తాడే గానీ నిన్ను అన్వేషించడు.
మానసంబు గట్టి మహిత భోగంబులు
మాని ఇంద్రియముల మదము లడచి
తపము సేసి ఇంద్రతయ కోరుగాని నీ
యమృత పదము కోరడఙ్ఞుడీశ!
భావం: ఈశ్వరా! ఙ్ఞాన హీనుడగు మనుష్యుడు తెలివిమాలిన వాడై మనస్సును స్వాధీనం చేసుకుని, గొప్ప భోగములను విడనాడి, ఇంద్రియాటోపము అణచి వేసి, తపస్సు చేసి ఇంద్ర పదవిని అభిలషిస్తాడే కానీ నీ అమృత స్థానమును కోరడు.
సంసారియైయున్న జనునకు నీశ్వర! నీకృప యెప్పుడు నెరయ కల్గు
నప్పుడు బంధంబులన్నియు తెగిపోవు, బంధ మోక్షంబైన ప్రాప్తమగును
సత్సంగమంబు, సత్సంగమంబున నీదు భక్తి సిద్ధించు, నీ భక్తి వలన
సన్ముక్తియగు, నాకు సత్సంగమున కంటె మును రాజ్య బంధ నిర్మూలనంబు
కలిగినది దేవ! నీ యనుగ్రహము గాదె?
కృష్ణ! నీ సేవ గాని తక్కినవి వలదు
ముక్తి సంధాయి వగు నిన్ను ముట్ట గొలిచి
ఆత్మ బంధంబు గోరునే ఆర్యుడెందు?
భావం: అచ్యుతా! సంసారమందు పరిభ్రమిస్తున్న పురుషుడికి నీఅనుగ్రహం ఎప్పుడు కలుగుతుందో అప్పుడే ఆ సంసార బంధాలు వదిలిపోతాయి. సంసార నివృత్తి కలిగినప్పుడు సత్పురుషులతో సహవాసం లభిస్తుంది. సత్సంగం చేత నీయందు భక్తి సిద్ధిస్తుంది. నీయందు నెలకొన్న భక్తి వల్ల ముక్తి చేకూరుతుంది. నాకు సత్పురుషోత్తముల సాంగత్యమునకు పూర్వమే రాజ్య పాశ నిర్మూలనం జరిగింది. ఇదంతా నీకృప కృష్ణా! నాకు నీ పాద సేవనంతప్ప తక్కిన వేమియూ వద్దు. ఎవడు విఙ్ఞుడైన వాడో వాడు ముక్తిదాయకుడవైన నిన్ను సేవించి తనకు ప్రతిబంధకాలైన శబ్దాది విషయ భోగాలను వాంఛింపడు. ఎవడు యోగ్యుడో వాడు మోక్షం ఇచ్చువాడైన నిన్ను అనన్య భక్తితో సేవించి మరల సంసార బంధమున చిక్కుకొనుటకు ఇచ్ఛ పడడు.
No comments:
Post a Comment