Tuesday, January 10, 2017

హరి-హర రూప వర్ణన

    పోతన మహ భాగవతులు, అద్వైత ఙ్ఞాని. ఆ భక్తి ముప్పిరిగొని ఆటలడుకొంటున్న బాల హరిరూపంలో హరునికి సామ్యాన్ని చూపిన ఆ భాగవతోత్తముని చరణాలకు ప్రణమిల్లుతూ....
                                                     

తనువున నంటిన ధరణీ పరాగంబు పూసిన నెరిభూతి పూత గాగ
ముందర వెలుగొందు ముక్తా లలామంబు తొగల సంగడిగాని తునుక గాగ 
ఫాల భాగంబుపై బరగు కావిరి బొట్టు కాముని గెల్చిన కన్ను గాగ 
కంఠ మాలిక లోని ఘన లీల రత్నంబు కమనీయమగు మెడ కప్పు గాగ
హారవల్లు లురగ హార వల్లులుగా
బాల లీల ప్రౌఢ బాలకుండు 
శివుని పగిది నొప్పె శివునికి తనకును 
వేరు లేమి తెల్ప వెలయునట్లు

భావం: ఆట పాటల సమయాలలో వాని దేహానికి అంటిన దుమ్ము విభూతి పూత వలే కనిపించేది. ఉంగరాల జుట్టును పైకి మడిచి ముత్యాల పేరుతో యశోద వేసిన ముడి శివుని తలపై ఉండే చంద్రవంక లాగా కనబడుతున్నది. నుదుట నిలువుగా పెట్టిన ఎర్రని తిలకం మన్మథుని గెలిచిన శివుని ఫాల నేత్రం వలె కనబడసాగింది. మెడలో వేసిన రత్నాల హారం మధ్యలో నాయక మణిగా ఉన్న పెద్ద నీలమణి శివుని కంఠంలో హాలాహలపు నల్లని మచ్చలాగా కనబడుతున్నది. మెడలోని హారాలు శివుని మెడలోని సర్ప హారాలుగా కనబడుతున్నాయి. ఎదగకుండానే పెద్దవాడైన విష్ణువు బాలకృష్ణుని అవతారంలో శివుడూ తానూ ఒకటే సుమా బేధం లేదు అని తెల్పుచూ పరమ శివుని వలె కనిపించే వాడు.    

No comments:

Post a Comment