Sunday, January 29, 2017

రుక్మిణీదేవి కృత శ్రీకృష్ణ స్తుతి

                 ఒక సారి శ్రీకృష్ణుడు రుక్మిణి దేవితో సల్లాపమాడుతూ నేను నీకు సరైన వరుడిని కాను, నీవు తొందరపడి నన్ను  వివాహమాడావు అనగా రుక్మిణీ దేవి మూర్ఛ పడి పోతుంది. స్వామి శైత్యోపచారాలు చేసాక తేరుకుని స్వామి తత్వాన్ని ఇలా స్తుతిస్తుంది తల్లి.

                                                   

                                               
మురహర! దివసాగమ దర,
దరవిందళాక్ష! తలప నది యట్టిదగున్
నిరవధిక విమలతేజో,
వర మూర్తివి, భక్త లోక వత్సల! యెందున్.

భావం: ఓ మురాంతకా! ఉదయాన వికసించుతున్న తామరరేకుల బోలిన నేత్రములతో శోభించువాడా! భక్త లోకమును వాత్సల్యముతో రక్షించు దేవా! నీవు అనంత తేజో మూర్తివి. నీవన్న మాట అన్ని విధముల వాస్తవమే. నేను నీకు తగిన దానను కాను అనుట వాస్తవము.

సంచిత ఙ్ఞాన సుఖ బలైశ్వర్య శక్తు
లాదిగా గల సుగుణంబులమరు నీకు
నేను దగుదునె? సర్వ లోకేశ్వరేశ!
లీలమై సచ్చిదానంద శాలి వనఘ!  

భావం: యే పాపములు లేని వాడవు, సర్వ లోకములకు నియామకుడవు అయిన ఓ స్వామీ! విలాసార్థముగా ఙ్ఞాన శక్తి, బల శక్తి, సుఖ శక్తి, ఐశ్వర్య శక్తి మొదలగు అనంత శక్తులతో కూడిన సకల కళ్యాణ గుణములు కలవాడవై సచ్చిదానంద పరబ్రహ్మవై ఒప్పునట్టి నీకు ప్రకృతి రూపిణినైన నేను తగననుట యదార్థమే!    

రూఢిమై ప్రకృతి పూరుష కాలములకు నీశ్వరుడవై భవదీయ చారు దివ్య
లలిత కళా కౌశలమున నభిరతుడై కడగు నీ రూపమెక్కడ మహాత్మ!
సత్త్వాది గుణ సముచ్చయ యుక్త మూఢాత్మ నైన యేనెక్కడ? అనఘ చరిత!
కోరి నీ మంగళ గుణ భూతి దానంబు సేయంగ బడునని చెందు భీతి
నంబునిధి మధ్య భాగమం దమృత ఫేన
పటల పాండుర నిభ మూర్తి! పన్నగేంద్ర
భోగిశయ్యను బవ్వళింపుచును దనరు
నట్టి యున్నతలీల దివ్యంబు దలప.  

భావం: ఓ మహత్మా! బాగుగా విచారింపగా నీవు మూల ప్రకృతికిని, జీవునికిని, జీవజ్జీవ పరివిభాగ కారణమైన కాలమునకు కర్తవైన నీ సంబంధమై, మనోఙ్ఞమై, అప్రాకృతమై కోమలమై, సచ్చిదానంద నిర్మల పరిపూర్ణమయమై ప్రకాశించునట్టి నీ స్వరూపమెక్కడ? శాంత ఘోర మూఢ వృత్తులు గల త్రిగుణాత్మక ప్రకృతి స్వరూపిణినైన నేనెక్కడ? నీకు, నాకు చాలా తారతమ్యం కలదు. నీవు నీ కళ్యాణ గుణ సంపద భక్తుల చేత అపహరింపబడుననెడి భయము వలనేమో అన్నట్లు సముద్రము మధ్యలో, అమృతము వలెను, నురుగు తెట్టెల వలెను తెల్లగా ప్రకాశించునట్టి సర్ప రాజైన ఆదిశేషుని దేహమును శయ్యగా చేసికొని ఉండునట్టి నీ గాంభీర్య రీతి అప్రాకృతమైనది. నీలీలలు పరమ దివ్యములైనవి కదా!  

వరమునీంద్ర యోగివర సురకోటిచే
వర్ణిత ప్రభావ వైభవంబు
గలిగి యఖిల చేతనులకు విఙ్ఞాన ప్ర
దుండ వగుదు వభవ!దురిత దూర!

భావం: పుట్టుకలు, పాపములు లేనివాడవైన ఓ స్వామీ! శ్రేష్ఠులైన వ్యాస, నారద, సనందాది మునీంద్రుల చేత, యోగివరుల చేత, శుక వామదేవాది బ్రహ్మ నిష్ఠుల చేత, దేవతలచేత వర్ణితమైన ప్రభావం గల నీవు మహిమను వహించి ఎల్లప్రాణులకు అఖిల విఙ్ఞాన దాయకుడవైన వాడవు అగుచున్నావు.  

వితత రాజ్య గరిమ విడిచి కాననముల
నాత్మలందు మీ పదాబ్జ యుగము
వలతి గాగ నిలిపి వాతాంబు పర్ణాశ
నోగ్రనియతు లగుచు నుందు రభవ!

భావం: రాజులు సంతోషంతో నేను, నాది అనే ఆలోచన లేకుండా గొప్ప రాజ్యము యొక్క గౌరవాన్ని మాని అడవులకు పోయి తమ మనస్సులలో నీ పాదాలను స్మరిస్తూ గాలి, నీళ్ళు, ఆకులు ఆహారం చేసుకుని ఉగ్రమైన నియమాలతో ఉంటారు.

విమల ఙ్ఞాన నిరూఢులైన జనముల్ వీక్షింప మీపాద కం
జ మరంద స్ఫుట దివ్య సౌరభము నాస్వాదించి నిర్వాణ రూ
పము సత్పూరుష వాగుదీరితము శోభా శ్రీనివాసంబు నౌ
మిము సేవింపక మానవాధముని దుర్మేధాత్ము సేవింతునే?  

భావం: పరిశుద్ధమైన ఙ్ఞానముచేత ధృఢ పడినవారై గొప్ప సత్పురుషులైన వారు చూచుచుండగా మీ పాదపద్మ మకరంద మాధుర్య సౌరభాలను ఆస్వాదించుతూ మోక్షస్వరూపులును, సత్పురుషుల చేత సదా స్మరింపబడుచుండువారును, మహా ప్రకాశ సంపద కలిగిన వారును అయిన మీ మూర్తిని సేవించక దుర్మేధాత్ముడైన ఒక మానవాధముడిని నేను సేవింతునా?  

నీరదాగమ మేఘ నిర్యత్పయ: పాన చాతకంబేగునే చౌటి పడెకు?
పరిపక్వ మాకంద ఫలరసంబులు గ్రోలు కీరముల్ చనునె దుత్తూరములకు?
ఘనరవాకర్ణ నోత్కలిక మయూరముల్ గోరునే కఠిన ఝిల్లీరవంబు?
కరి కుంభ పిశిత సద్గ్రాస మోదిత సింహమరుగునే శునక మాంసాభిలాష
ప్రవిమలాకార! భవదీయ పాదపద్మ
యుగ సమాశ్రయ నైపుణ్యోద్యోగ చిత్త
మన్యు చేరునె తనకుపాస్యంబు
గాగ? భక్త మందార! దుర్భర భవ విదూర!  

భావం: సేవకులకు కోరిన కోరికలిచ్చుటయందు కల్పవృక్షము వంటి వాడును, చెడ్డ జన్మముల వలన కలుగు భయమును దూరముగా తొలగించు ఓ శుభాకారా!వర్షాకాలంలో మేఘం నుండి పడుతుండే జల బిందువులను ఆస్వాదించే చాతక పక్షి చవిటి గుంటలోని నీటి కోసం పోవునా? పండిన తియ్య మామిడి పండ్ల రసాన్ని గ్రోలే చిలుకలు ఉమ్మెత్త కాయలను ఆశ్రయిస్తాయా? నీలమేఘ గర్జనాన్ని విని తహతహ పడే నెమళ్ళు ఈల పురుగు ధ్వనిని కోరుకుంటాయా? ఏనుగు కుంభ స్థలంలోని మాంసాన్ని భుజించి తృప్తి చెందే సింహం కుక్క మాంసం కోసం కక్కుర్తి పడుతుందా? నీ పాద పద్మ ద్వయాన్ని కోరి ఆశ్రయించి ఆనందించే హృదయం అల్పులైన ఇతరులను సేవించుటకు కోరదు.   

వాసవ వందిత! పద కమ
లాసన శివ ముఖర దేవతావళికెల్లన్
నీ సమధిక చారిత్ర క
థా సురుచిర గాన మవితథంబై చెల్లున్. 

భావం: దేవేంద్రునిచే నమస్కరింపబడు పాదములు కలవాడా!ఓ దేవాధిదేవా!బ్రహ్మ, శివుడు మొదలైన ముఖ్యమైన దేవతలందరూ ఎప్పుడూ నీ దివ్య చరిత్రలు తెలిపే గాథలనే కమ్మగా ఎడ తెగక గానం చేస్తుండటం జరుగుతుంది.    

ధరణీ నాథులు తమతమ 
పరవనితామందిరముల వసియింపుచు గో
ఖర మార్జాలంబుల గతి
స్థిర బుద్ధులగుదురు నిన్ను తెలియని కతనన్. 

భావం: ఓ స్వామీ! నిఖిలేశ్వరుడైన నిన్ను గుర్తింపలేకపోయినందున రాజులు తమ ప్రేయసీ మందిరాలలో నివసిస్తూ సంసారారణ్యంలో చిక్కి మోహపాశంలో గట్టిగా కట్టబడి పశువులు, గాడిదలు, పిల్లుల వలే స్థిరంగా బంధింపబడిన బుద్ధిని కలిగి ఉంటారు.   

జలజ నాభ! సకల జగదంతరాత్మవై 
నట్టి దేవ! నీ పదారవింద 
యుగళి సానురాగ యుక్తమై నా మది
గలుగునట్లు గాగ దలపు మనఘ!   

భావం: బ్రహ్మ పుట్టినట్టి పద్మము బొడ్డునందు కలవాడవైన వాడవు, విఙ్ఞాన స్వరూపుడవు కనుక నీ అంతట నీవే ప్రకాశించువాడవు, నిరతిశయానంద స్వరూపుడవు కనుక దు:ఖములు లేనివాడవు అయిన ఓ స్వామీ! స్థావర జంగమ రూపమైన ప్రపంచమందు అంతట నిండి ఉన్నట్టి నీ పాదారవింద భక్తి నా మనస్సు నందు ఎల్లప్పుడును నిలుచునట్లు అనుగ్రహింపుము. 

పృథు రజోగుణ ప్రవృద్ధమైనట్టి నీ
దృష్టి చేత నన్ను దేరకొనగ
జూచు టెల్ల పద్మలోచన! నా మీది
ఘన దయార్ద్ర దృష్టిగా దలంతు.

భావం: రాజీవ లోచనా! రాజసంతో విరాజిల్లే నీ దృష్టితో నన్ను తేరుకొనేటట్లు చూడడం నామీద నీకు గల పరమ దయార్ద్ర దృష్టితో చూడడంగానే భావించెదను.  



2 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. మాన్యా నమస్కారం. . . మీ బ్లాగు . మీ సంస్కారం చాలా బాగున్నాయండి. శుభాభినందనలు . శుబాశీస్సులు
    నేను http://telugubhagavatam.org/ చెందిన వాడినండి.

    ReplyDelete