Tuesday, January 31, 2017

గోపికా గీతలు

                      భక్తిలో అత్యుత్తమమైన భక్తి అని గోపికా భక్తిని కీర్తిస్తారు మహా భక్తుడైన నారదుల వారు.  అలా ఋషితుల్యులైన ఆ గోపికలు చేసే కృష్ణ స్తుతి భగవానుని పట్ల వారికి గల నిష్కల్మష తారాస్థాయి ప్రేమ భక్తి భావనను తెలియచేస్తుంది. శ్రీ కృష్ణ పరమాత్మ కొంతసేపు గోపికలతో విహరించి తరువాత అకస్మాత్తుగా మాయమైపోతారు. ఆయనను వెదకుతూ గోపికలు విరహంలో స్వామిలో తన్మయులై స్తుతిస్తారు.

                                                     
                 
                         

                 
నీవు జనించిన కతమున 
నో వల్లభ! లక్ష్మి మందనొప్పె నధికమై
నీ వెంటనె ప్రాణములిడి 
నీ వార రరసెద చూపు నీ రూపంబున్.

భావం: నాథా! నీవు పుట్టిన కారణాన గోకులంలో సిరి పెంపు సొంపారుతున్నది, అనగా సంపద అధికమైంది. నీవారందరూ నీయందే ప్రాణములను ఉంచుకుని నీకోసం వెదకుతున్నారు. దయతో నీ రూపం వీరికి చూపు.           

శారదకమలోదరు రుచి
చోరకమగు చూపు వలన సుందర! మిమ్ముం
గోరి వెల యీని దాసుల
ధీరత నొప్పించు టిది వధించుట గాదె.

భావం: ఓ అందగాడా! శరత్కాలమందు వికసించిన తామరలయందలి కాంతిని అణచివేయునట్టి కాంతి గల నీ చూపు వల్ల నిన్ను వలచి జీతబత్తెము లేని దాసురాండ్రమై నిన్ను కొలువ వచ్చిన మమ్ములను కొంచమైన జాలి లేక మమ్ము ధీరుడవై ఇలా బాధించడం నిజంగా చంపడమే కదా!     

విషజలంబు వలన విషధర దానవు
వలన రాల వాన వలన వహ్ని
వలన నున్న వాని వలనను రక్షించి
కుసుమ శరుని బారి గూల్ప దగునె? 

భావం: ఓ కృష్ణా! విషంగ్రక్కు కాళియుని విషం వలన విషపూరితమైన యమునా నదీ జలాల నుండి, సర్ప రూపుడై మమ్ము మ్రింగ వచ్చిన అఘాసురుని వల్ల, ఇంద్రుడు కురిపించిన రాళ్ళ వాన వల్ల, అడవిలో చెలరేగిన కార్చిచ్చు వల్ల, ఇంకను తక్కిన ఎన్నో ఆపదల నుండి చావకుండ మమ్ము కాపాడి ఇప్పుడు పంచబాణుని బారి కప్పగించి చంపడం నీకు న్యాయమా?     

నీవు యశోద బిడ్డడవె? నీరజ నేత్ర! సమస్త జంతు చే
తో విదితాత్మ వీశుండవు తొల్లి విరించి దలంచి లోక ర
క్షా విధ మాచరింపు మని సన్నుతి సేయంగ సత్కులంబునన్
భూవలయంబు గాన నిటు పుట్టితి గాదె మనోహరాకృతిన్.  

భావం: కమలాక్షా! నీవు కేవలం నిఖిల దేహ ధారుల బుద్ధికి సాక్షిభూతుడవైన అంతరాత్మవు. పరమేశ్వరుడివి. పూర్వం బ్రహ్మ లోక సంరక్షణం చేయడానికి ఒక ఏర్పాటు చేయమని నిన్ను స్మరించి నిన్ను ధ్యానించి వేడుకోగా భూమండలాన్ని ఉద్ధరించి రక్షించడానికి ఇలా మనోఙ్ఞ స్వరూపంతో ఈ మంచి వంశంలో ఆవిర్భవించి సమస్త ప్రాణుల హృదయములందు వర్తించునట్టి సర్వ నియామకుడవైన పరబ్రహ్మవు గానీ వాస్తవము విచారించగా నీవు యశోద కొడుకువు కావు.   

చరణ సేవకులకు సంసార భయమును
బాపి శ్రీకరంబు పట్టు గలిగి
కామదాయియైన కర సరోజంబు మా
మస్తకముల నునిచి మనుపు మీశ!

భావం: ఓ స్వామీ! నీ పాదాలను కొలిచే వారికి సంసారం వల్ల కలిగే భయాన్ని పోగొట్టి, మేలు కలుగ చేయుట యందు పట్టుదల కలిగి, కోరిన కోరికలను అన్నింటినీ గ్రహించునట్టిదీ, ఇచ్చునట్టిది అయిన నీ కర కమలాన్ని మా మస్తకంపై ఉంచి మమ్ము కాపాడుము.   

గోవుల వెంట ద్రిమ్మరుచు గొల్చిన వారల పాప సంఘముల్
ద్రోవగ జాలి శ్రీ దనరి దుష్ట భుజంగ ఫణా లతాగ్ర సం
భావితమైన నీ చరణ పద్మము చన్నుల మీద మోపి త
ద్భావజ పుష్పభల్ల భవ బాధ హరింపు వరింపు మాధవా! 

భావం: మాధవా! ఆవుల వెంట సంచరించుచూ, సేవించు వారి పాప సమూహాలను పోగొట్టగలిగీ, సిరిచే ఒప్పునదీ, కౄరుడైన కాళియుడు అనే చెడ్డ పాము యొక్క  పడగలపై నటించేదీ అయిన అతి మృదులమైన నీ పాదాన్ని మా కుచాల మీద మోపి మాకు మన్మథుని కుసుమ శరాల వల్ల ప్రాప్తించిన బాధ పరిహరించు. మమ్ము స్వీకరించు.  

బుధరంజనియును సూక్తయు
మధురయునగు నీదు వాణి మరగించెను నీ 
యధరామృత సంసేవన
విధి సంగజ తాపమెల్ల విడిపింపగదే! 

భావం: పండితులను సంతోషపెట్టునదీ, చక్కని పలుకుబడి కలదియు, తీయనిదీ అయిన నీ పలుకు మమ్ము నీయందు ఆసక్తి గొనునట్లు చేసింది. నీ యధరామృతం త్రాగించి మా మదన తాపమంతా తొలగించు. 

మగువల యెడ నీ క్రౌర్యము
దగునే? నిజ భక్త భీతి దమనుడ వకటా!
తగదు భవద్దాసులకును
నగు మొగముంజూపి కావు నళిన దళాక్షా!

భావం: కమలాక్షా! అయ్యో! ఆడువారి పట్ల ఇంతటి కౄరత్వం అవలంబించుట నీకు తగదు. నీవు భక్తుల భయం పోగొట్టిన వాడవు అయినందున నీకు ఇది తగిన పని కాదు. కనుక నీ దాసులమైన మాకు నీ నగుమోము చూపి మా మనస్తాపమును పోగొట్టి కాపాడుము. 

ఘన లక్ష్మీ యుతమై వినన్ శుభదమై కామాది విధ్వంసియై
సనకాది స్తుతమై నిరంతర తప స్సంతప్త పున్నాగ జీ
వనమై యొప్పెడు నీ కథామృతము ద్రావం గల్గునే భూరి దా
న నిరూఢత్వము లేని వారలకు మా నారీ మనోహారకా!

భావం: రమా మనోరమణా! గొప్ప మోక్ష సంపద కూడుకున్నదియు, శ్రవణ మాత్రమున ఎంతో ఎక్కువైన శుభము లిచ్చునదియు, కామ, క్రోధ,లోభ, మోహ, మద, మాత్సర్యములు అనెడు అరిషడ్వర్గములను నిర్మూలించునట్టిదియు, సనక సనందనాది యోగీశ్వరులచే కొనియాడబడునదియు, ఎడతెగని కాయిక, వాచిక, మానసిక తపముల చేత తపించుచున్న పురుష శ్రేష్ఠులైన తపస్వులకు బ్రతుకు తెరువై యొప్పుచున్న నీ కథాసుధను భక్తితో విను వారికే పేదలకు సైతము విశేష దానము చేయవలెను అను కోరిక కలుగుచుండగా, ఎన్నెన్నో గొప్ప దానములొనర్చి ప్రసిద్ధినందని వారు గ్రోలజాలరు. అనగా సర్వకాల సర్వావస్థలయందు నిన్నే తలచుకొనునట్టి మాకు ప్రాణ దానము చేయుట యందు నీకు తలపు పుట్టకుండుట తగినదేనా? 

నీ నగవులు నీచూడ్కులు

నీ నానా విహరణములు నీ ధ్యానంబుల్
నీ నర్మాలాపంబులు
మానసములు నాటినేడు మగుడవు కృష్ణా! 

భావం: కృష్ణా! నీ యొక్క నవ్వులూ, నీ చూపులూ, పలువిధములైన నీ విహారాలూ, నీ ధ్యానములూ, నీ పరిహాస వచనాలూ  మా హృదయాలలో నాటుకుని నేడు మరపునకు రాక ఉన్నవి. 


ఘోష భూమి వెడలి గోవుల మేపంగ

నీరజాభమైన నీ పదములు
గసవు శిలలు దాకి కడునొచ్చునో యని
కలగు మా మనములు కమలనయన!  

భావం: కమలాక్షా! నీవు గోవులను మేపుటకై మంద నుంచి అడవికి ఆవులతో వెడలిన వేళ కమలములతో సమానమైన నీ అడుగులు, గడ్డి మొలకులు, గులక రాళ్ళు తాకి మిక్కిలి నొచ్చునని, మేము మా మనసులో విచారపడుతుంటాము.   


మాపటి వేళ నీవు వన మధ్యము వెల్వడి వచ్చి గోష్పద

ప్రాపిత ధూళి ధూసరిత భాసిత కుంతలమై సరోరుహో
ద్దీపితమైన నీ మొగము ధీరజనోత్తమ! మాకు వేడ్కతో
జూపి మనంబులన్ మరుని జూపుదు గాదె క్రమక్రమంబునన్.  

భావం: ధీర జనములలో శ్రేష్ఠుడా! నీవు ప్రతి దినము సాయంత్రము బృందావనాంతర అటవీ ప్రాంతం నుంచీ తోలుకుని వచ్చిన ధేనువుల కాలి దుమ్ము సోకి ధూసర వర్ణం పొంది ప్రకాశించెడి ముంగురులు గలదై, పద్మం వలే భాసిల్లే నీ ముఖం మాకు ప్రీతితో కనబరచి మా మనస్సులలో అంతకంతకు మరులు హత్తుకొలుపుతుంటావు కదా!

భక్త కామదంబు బ్రహ్మ సేవిత మిలా
మండనంబు దు:ఖ మర్దనంబు
భద్ర కరమునైన భవదంఘ్రి యుగము మా
యురములందు రమణ! యునుప దగదె?

భావం: ప్రియతమా! భక్తుల అభీష్టములు తీర్చునదీ, బ్రహ్మ చేత సేవింపబడునదీ,పుడమికే అలంకారమైనదీ, దు:ఖములను పోగొట్టునదీ, శుభములొసగి కాపాడునదీ అయిన నీ అడుగుల జంటను మా వక్షముల పైన ఉంచరాదా?    

సురత వర్ధనంబు శోకాపహరణంబు
స్వనిత వంశనాళ సంగతంబు
నన్య రాగ జయమునైన నీ మధురాధ
రామృతమున దాప మార్పు మీశ!

భావం: ప్రభూ! సంభోగ ప్రీతి పెంచునదీ, శోకములను తొలగించునదీ, ఊదబడుచున్న పిల్లనగ్రోవితో కూడుకున్నదై ముద్దులందుకునేదీ, ఇతరములైన అనురాగములన్నింటినీ అతిశయించునదీ అయిన నీ తీయని కెమ్మోవి పానకముచే మా తాపం పోగొట్టుము.   

నీ వడవిం బవల్ దిరుగ నీ కుటిలాలక లాలితాస్య మి
చ్ఛావిధి జూడకున్న నిమిషంబులు మాకు యుగంబులై చనుం
గావున రాత్రులైన నిను గన్నుల నెప్పుడు జూడకుండ ల
క్ష్మీవర! రెప్పలడ్డముగ జేసె నిదేల? విధాత కౄరుడై. 

భావం: రమా నాయకా! నీవు పగటిపూట బృందావనారణ్యంలో తిరగడం వల్ల వంపులు తిరిగిన ముంగురులచే అందాలు చిందే నీ వదనం తృప్తి తీరేటట్లు కోరుకున్న విధంగా తిలకించ లేకపోతున్నాము. అందువలన మాకు క్షణాలు యుగాలుగా గడుస్తాయి. పోనీ రాత్రి వేళలందైనా ఎడ తెగకుండా చూద్దాము అని కోరుకుంటే కౄరుడైన బ్రహ్మ దేవుడు కండ్లకు ఈ రెప్పను అడ్డంగా సృష్టించాడు కదా!  

అక్కట! బంధులున్ మగలు నన్నలు దమ్ములుం బుత్రకాదులున్
నెక్కొని రాత్రి బోకుడన నీ మృదు గీత రవంబు వీనులన్
వెక్కసమైన వచ్చితిమి వేగమె మోహము నొంది నాథ! నీ
వెక్కడ బోయితో? యెరుంగ మీ క్రియ నిర్దయుడెందు గల్గునే?

భావం: మనో వల్లభా! చుట్టాలు, భర్తలు, అన్నలు, తమ్ములు, కొడుకులు మొదలైన వారు మమ్ము అడ్డగించి రాత్రి పూట ఇల్లు వదిలి వెళ్ళద్దని చెబుతున్నప్పటికీ వానిని లక్ష్యం చేయక మనోహరమైన నీ పాట సవ్వడి చెవులలో నిండగానే అధికమైన మోహావేశంతో పరుగు పరుగున ఇక్కడికి వచ్చాము. నీవెక్కడికేగినావో ఎరుగము. నీ వంటి దయమాలిన వాడు ఎక్కడైనా ఉంటాడా?    

మదనుడార్వంగ నీవాడు మంతనములు
నవరసాలోకనంబగు నగు మొగంబు
కమల కిరవైన మహిత వక్ష స్థలంబు
మా మనంబుల లోగొని మరపె గృష్ణ!

భావం: ఓ కృష్ణా! ఏకాంతమున మన్మథ ఉద్రేకము కలిగేటట్లుగా నీవు పలికే వలపు లొలకే పలుకులు, నవ రసములకు ఉనికి పట్టైన నీ చూపులు, నీ మనోఙ్ఞమైన చిరునవ్వుతో ఉండే మొగము, లక్ష్మికి వాస స్థానమైన నీ విశాల వక్షస్థలము, కామోద్దీపన కరాలై ఆకర్షించి మమ్ములను మురిపించాయి. 

అరవిందంబుల కంటె కోమలమై యందంబులై యున్న నీ
చరణంబుల్ కఠినంబులై మొనయు మా చన్నుంగవల్ మోవగా
నెరియంబోలు నటంచు బొక్కుదుము నీ ఈ కర్కశారణ్య భూ
పరి సంచారము కృష్ణ! నీ ప్రియలకుం బ్రాణ వ్యథం జేయదే!

భావం: కృష్ణా! తామర పువ్వుల కంటే మెత్తనివై, సుందరములై ఒప్పుతున్న నీ అడుగులు కఠినములైన మా కుచాలపై ఆనించినప్పుడు ఆ ఒత్తిడికి నీ పాదాలు పగిలి కందిపోతాయని తపిస్తాము. అటువంటి పాదాలతో కఠినములైన అరణ్య భూములలో నీవు సలిపే సంచారం నీ ప్రియురాండ్రమైన మాకు ప్రాణాంతకమైనంత తాపమును కలిగిస్తుంది. 

కట్టా! మన్మథు కోలలు 
నెట్టున నోనాట బెగడి నీ పాదంబుల్
పట్టికొనగ వచ్చిన మము
నట్టనడవిని డించి పోవ న్యాయమె? కృష్ణా!

భావం:  అయ్యో! కృష్ణా! ఎంత సంకటం దాపురించింది? మన్మథుని బాణాలు మా హృదయాలలో నాటి నివారింపరానివై మమ్ము పీడించుచుండగా నీ పాదములను ఆశ్రయించి ఆ బాధను పోగొట్టుకొన వచ్చాము. భయపడి నీ కాళ్ళు పట్టుకోవడానికి వచ్చాము. అలాంటి మమ్ము నట్టడవి మధ్యలో ఇట్లే వదిలి పెట్టి వెళ్ళడం నీకు న్యాయమా?  

హృదయేశ్వరా! మా హృదయము
మృదుతరముగ జేసి తొల్లి మిక్కిలి; కడ నీ
హృదయము కఠినము చేసెను 
మదీయ సౌభాగ్య మిట్టి మందము గలదే?   

భావం: ప్రాణేశ్వరా! మా చిత్తాలను, సౌందర్య రూపమైన మా అదృష్టం మిక్కిలి మెత్తనివిగా చేసి, తుదకు నీ మనసును కర్కశం కావించిన మా దురదృష్టాన్ని ఏమనుకోవాలి?    

క్రమ్మి నిశాచరుల్ సురనికాయములన్ వడి దాకి వీక వా
లమ్ముల తెట్టెముల్ వరప నడ్డము వచ్చి జయింతు వండ్రు, ని
న్నమ్మిన ముగ్ధలన్ రహిత నాథల నక్కట! నేడు రెండు మూ
డమ్ముల యేటుకా డెగువ నడ్డము రాదగదే కృపానిధీ!  

భావం: కరుణానిధీ! కృష్ణా! రాక్షసులు పూర్వం ఒక్క పెట్టున చెలరేగి దేవతా సమూహాల నెదిర్చి పట్టుదలతో వారిపై వాడి శరాలు గుప్పిస్తుంటే అడ్డుపడి రాక్షసులను శిక్షిస్తావని కొందరు అంటారు. మరి అట్టివాడవైన నిన్ను నమ్ముకున్న పడతులం మేము. పతులను పరిత్యజించి వచ్చిన వారము. అయ్యో! ఇలాంటి మమ్ములను కేవలం రెండు మూడు బాణాలు గల తుంటరి విలుకాడు వెంటాడగా అడ్డు పడవేమి?     

తియ్య విలుకాడు డీకొని
వ్రయ్యలుగా దూరనేసి వనితల మనముల్
నియ్యాన నింక నయినం
గు య్యాలింపం గదయ్య గోవింద! హరీ!

భావం:  ఓ గోవిందా! ముకుందా! మన్మథుడు మా మీద తలపడి మా మనస్సులు భేదిల్లి బద్దలగునట్లుగా మా గుండెలు దూరేటట్లు శరాలు ప్రయోగించి బాధించాడు. ఆడువారమైన మా మొరను ఆలకించి ఇకనైనా మమ్ము రక్షించరాదా? మేము చెప్పేది అబద్ధం కాదు. 


సూచన: ఈ గీతలలోని భావాలన్నీ భౌతిక పదజాలంగా మాత్రమే చూడడం మహా దోషం. గోపికలు అనగా మహా గొప్ప సాధకులైన యోగులు. వారంతా స్వామి తో తాదాత్మ్యాన్నే కోరుకుంటున్నారు గానీ, తుచ్ఛమైన శారీరక భోగాన్ని కానే కాదు. వారు వెలిబుచ్చిన యే భావము శరీర పరిమితిలో కానే కాదు.   



Sunday, January 29, 2017

రుక్మిణీదేవి కృత శ్రీకృష్ణ స్తుతి

                 ఒక సారి శ్రీకృష్ణుడు రుక్మిణి దేవితో సల్లాపమాడుతూ నేను నీకు సరైన వరుడిని కాను, నీవు తొందరపడి నన్ను  వివాహమాడావు అనగా రుక్మిణీ దేవి మూర్ఛ పడి పోతుంది. స్వామి శైత్యోపచారాలు చేసాక తేరుకుని స్వామి తత్వాన్ని ఇలా స్తుతిస్తుంది తల్లి.

                                                   

                                               
మురహర! దివసాగమ దర,
దరవిందళాక్ష! తలప నది యట్టిదగున్
నిరవధిక విమలతేజో,
వర మూర్తివి, భక్త లోక వత్సల! యెందున్.

భావం: ఓ మురాంతకా! ఉదయాన వికసించుతున్న తామరరేకుల బోలిన నేత్రములతో శోభించువాడా! భక్త లోకమును వాత్సల్యముతో రక్షించు దేవా! నీవు అనంత తేజో మూర్తివి. నీవన్న మాట అన్ని విధముల వాస్తవమే. నేను నీకు తగిన దానను కాను అనుట వాస్తవము.

సంచిత ఙ్ఞాన సుఖ బలైశ్వర్య శక్తు
లాదిగా గల సుగుణంబులమరు నీకు
నేను దగుదునె? సర్వ లోకేశ్వరేశ!
లీలమై సచ్చిదానంద శాలి వనఘ!  

భావం: యే పాపములు లేని వాడవు, సర్వ లోకములకు నియామకుడవు అయిన ఓ స్వామీ! విలాసార్థముగా ఙ్ఞాన శక్తి, బల శక్తి, సుఖ శక్తి, ఐశ్వర్య శక్తి మొదలగు అనంత శక్తులతో కూడిన సకల కళ్యాణ గుణములు కలవాడవై సచ్చిదానంద పరబ్రహ్మవై ఒప్పునట్టి నీకు ప్రకృతి రూపిణినైన నేను తగననుట యదార్థమే!    

రూఢిమై ప్రకృతి పూరుష కాలములకు నీశ్వరుడవై భవదీయ చారు దివ్య
లలిత కళా కౌశలమున నభిరతుడై కడగు నీ రూపమెక్కడ మహాత్మ!
సత్త్వాది గుణ సముచ్చయ యుక్త మూఢాత్మ నైన యేనెక్కడ? అనఘ చరిత!
కోరి నీ మంగళ గుణ భూతి దానంబు సేయంగ బడునని చెందు భీతి
నంబునిధి మధ్య భాగమం దమృత ఫేన
పటల పాండుర నిభ మూర్తి! పన్నగేంద్ర
భోగిశయ్యను బవ్వళింపుచును దనరు
నట్టి యున్నతలీల దివ్యంబు దలప.  

భావం: ఓ మహత్మా! బాగుగా విచారింపగా నీవు మూల ప్రకృతికిని, జీవునికిని, జీవజ్జీవ పరివిభాగ కారణమైన కాలమునకు కర్తవైన నీ సంబంధమై, మనోఙ్ఞమై, అప్రాకృతమై కోమలమై, సచ్చిదానంద నిర్మల పరిపూర్ణమయమై ప్రకాశించునట్టి నీ స్వరూపమెక్కడ? శాంత ఘోర మూఢ వృత్తులు గల త్రిగుణాత్మక ప్రకృతి స్వరూపిణినైన నేనెక్కడ? నీకు, నాకు చాలా తారతమ్యం కలదు. నీవు నీ కళ్యాణ గుణ సంపద భక్తుల చేత అపహరింపబడుననెడి భయము వలనేమో అన్నట్లు సముద్రము మధ్యలో, అమృతము వలెను, నురుగు తెట్టెల వలెను తెల్లగా ప్రకాశించునట్టి సర్ప రాజైన ఆదిశేషుని దేహమును శయ్యగా చేసికొని ఉండునట్టి నీ గాంభీర్య రీతి అప్రాకృతమైనది. నీలీలలు పరమ దివ్యములైనవి కదా!  

వరమునీంద్ర యోగివర సురకోటిచే
వర్ణిత ప్రభావ వైభవంబు
గలిగి యఖిల చేతనులకు విఙ్ఞాన ప్ర
దుండ వగుదు వభవ!దురిత దూర!

భావం: పుట్టుకలు, పాపములు లేనివాడవైన ఓ స్వామీ! శ్రేష్ఠులైన వ్యాస, నారద, సనందాది మునీంద్రుల చేత, యోగివరుల చేత, శుక వామదేవాది బ్రహ్మ నిష్ఠుల చేత, దేవతలచేత వర్ణితమైన ప్రభావం గల నీవు మహిమను వహించి ఎల్లప్రాణులకు అఖిల విఙ్ఞాన దాయకుడవైన వాడవు అగుచున్నావు.  

వితత రాజ్య గరిమ విడిచి కాననముల
నాత్మలందు మీ పదాబ్జ యుగము
వలతి గాగ నిలిపి వాతాంబు పర్ణాశ
నోగ్రనియతు లగుచు నుందు రభవ!

భావం: రాజులు సంతోషంతో నేను, నాది అనే ఆలోచన లేకుండా గొప్ప రాజ్యము యొక్క గౌరవాన్ని మాని అడవులకు పోయి తమ మనస్సులలో నీ పాదాలను స్మరిస్తూ గాలి, నీళ్ళు, ఆకులు ఆహారం చేసుకుని ఉగ్రమైన నియమాలతో ఉంటారు.

విమల ఙ్ఞాన నిరూఢులైన జనముల్ వీక్షింప మీపాద కం
జ మరంద స్ఫుట దివ్య సౌరభము నాస్వాదించి నిర్వాణ రూ
పము సత్పూరుష వాగుదీరితము శోభా శ్రీనివాసంబు నౌ
మిము సేవింపక మానవాధముని దుర్మేధాత్ము సేవింతునే?  

భావం: పరిశుద్ధమైన ఙ్ఞానముచేత ధృఢ పడినవారై గొప్ప సత్పురుషులైన వారు చూచుచుండగా మీ పాదపద్మ మకరంద మాధుర్య సౌరభాలను ఆస్వాదించుతూ మోక్షస్వరూపులును, సత్పురుషుల చేత సదా స్మరింపబడుచుండువారును, మహా ప్రకాశ సంపద కలిగిన వారును అయిన మీ మూర్తిని సేవించక దుర్మేధాత్ముడైన ఒక మానవాధముడిని నేను సేవింతునా?  

నీరదాగమ మేఘ నిర్యత్పయ: పాన చాతకంబేగునే చౌటి పడెకు?
పరిపక్వ మాకంద ఫలరసంబులు గ్రోలు కీరముల్ చనునె దుత్తూరములకు?
ఘనరవాకర్ణ నోత్కలిక మయూరముల్ గోరునే కఠిన ఝిల్లీరవంబు?
కరి కుంభ పిశిత సద్గ్రాస మోదిత సింహమరుగునే శునక మాంసాభిలాష
ప్రవిమలాకార! భవదీయ పాదపద్మ
యుగ సమాశ్రయ నైపుణ్యోద్యోగ చిత్త
మన్యు చేరునె తనకుపాస్యంబు
గాగ? భక్త మందార! దుర్భర భవ విదూర!  

భావం: సేవకులకు కోరిన కోరికలిచ్చుటయందు కల్పవృక్షము వంటి వాడును, చెడ్డ జన్మముల వలన కలుగు భయమును దూరముగా తొలగించు ఓ శుభాకారా!వర్షాకాలంలో మేఘం నుండి పడుతుండే జల బిందువులను ఆస్వాదించే చాతక పక్షి చవిటి గుంటలోని నీటి కోసం పోవునా? పండిన తియ్య మామిడి పండ్ల రసాన్ని గ్రోలే చిలుకలు ఉమ్మెత్త కాయలను ఆశ్రయిస్తాయా? నీలమేఘ గర్జనాన్ని విని తహతహ పడే నెమళ్ళు ఈల పురుగు ధ్వనిని కోరుకుంటాయా? ఏనుగు కుంభ స్థలంలోని మాంసాన్ని భుజించి తృప్తి చెందే సింహం కుక్క మాంసం కోసం కక్కుర్తి పడుతుందా? నీ పాద పద్మ ద్వయాన్ని కోరి ఆశ్రయించి ఆనందించే హృదయం అల్పులైన ఇతరులను సేవించుటకు కోరదు.   

వాసవ వందిత! పద కమ
లాసన శివ ముఖర దేవతావళికెల్లన్
నీ సమధిక చారిత్ర క
థా సురుచిర గాన మవితథంబై చెల్లున్. 

భావం: దేవేంద్రునిచే నమస్కరింపబడు పాదములు కలవాడా!ఓ దేవాధిదేవా!బ్రహ్మ, శివుడు మొదలైన ముఖ్యమైన దేవతలందరూ ఎప్పుడూ నీ దివ్య చరిత్రలు తెలిపే గాథలనే కమ్మగా ఎడ తెగక గానం చేస్తుండటం జరుగుతుంది.    

ధరణీ నాథులు తమతమ 
పరవనితామందిరముల వసియింపుచు గో
ఖర మార్జాలంబుల గతి
స్థిర బుద్ధులగుదురు నిన్ను తెలియని కతనన్. 

భావం: ఓ స్వామీ! నిఖిలేశ్వరుడైన నిన్ను గుర్తింపలేకపోయినందున రాజులు తమ ప్రేయసీ మందిరాలలో నివసిస్తూ సంసారారణ్యంలో చిక్కి మోహపాశంలో గట్టిగా కట్టబడి పశువులు, గాడిదలు, పిల్లుల వలే స్థిరంగా బంధింపబడిన బుద్ధిని కలిగి ఉంటారు.   

జలజ నాభ! సకల జగదంతరాత్మవై 
నట్టి దేవ! నీ పదారవింద 
యుగళి సానురాగ యుక్తమై నా మది
గలుగునట్లు గాగ దలపు మనఘ!   

భావం: బ్రహ్మ పుట్టినట్టి పద్మము బొడ్డునందు కలవాడవైన వాడవు, విఙ్ఞాన స్వరూపుడవు కనుక నీ అంతట నీవే ప్రకాశించువాడవు, నిరతిశయానంద స్వరూపుడవు కనుక దు:ఖములు లేనివాడవు అయిన ఓ స్వామీ! స్థావర జంగమ రూపమైన ప్రపంచమందు అంతట నిండి ఉన్నట్టి నీ పాదారవింద భక్తి నా మనస్సు నందు ఎల్లప్పుడును నిలుచునట్లు అనుగ్రహింపుము. 

పృథు రజోగుణ ప్రవృద్ధమైనట్టి నీ
దృష్టి చేత నన్ను దేరకొనగ
జూచు టెల్ల పద్మలోచన! నా మీది
ఘన దయార్ద్ర దృష్టిగా దలంతు.

భావం: రాజీవ లోచనా! రాజసంతో విరాజిల్లే నీ దృష్టితో నన్ను తేరుకొనేటట్లు చూడడం నామీద నీకు గల పరమ దయార్ద్ర దృష్టితో చూడడంగానే భావించెదను.  



Tuesday, January 24, 2017

రుక్మిణీ కళ్యాణం

పోతన గారి పుణ్యమా అని తెలుగు వారందరికీ చిరపరిచితమైన రుక్మిణీ కళ్యాణ ఘట్టంలోని కొన్ని మధుర శ్లోకాలు స్మరించి తరించుదామా!    
                                           

యే నీ గుణములు కర్ణేంద్రియంబులు సోక దేహ తాపంబులు తీరిపోవు
నే నీ శుభాకార మీక్షింప కన్నుల కఖిలార్థ లాభంబు కలుగుచుండు
నే నీ చరణ సేవ లే ప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబు పొందగలుగు
నే నీ లసన్నామ మే ప్రొద్దు భక్తితో దడవిన బంధ సంతతులు వాయు
నట్టి నీ యందు నాచిత్త మనవరతము
నచ్చి యున్నది నీ యాన నానలేదు
కరుణ చూడుము కంసారి! ఖల విదారి!
శ్రీయుతాకార! మానినీ చిత్త చోర! 

భావం: కంసాంతకా! ప్రశస్తమైన నీ గుణాలు చెవుల బడితే చాలు, శరీర తాపాలన్నీ శమిస్తాయి. ఓ కళ్యాణ స్వరూపా! మంగళ కరమైన నీ స్వరూపం తిలకిస్తే చాలు నేత్రాలకు నిఖిల ప్రయోజనాలు సిద్ధిస్తాయి. దుష్టులను దునుమాడువాడా! నిరంతరం నీ పాద సేవ చేస్తే చాలు లోకంలో మహోన్నతి నొందవచ్చు. మానవతుల మనసులు హరించువాడా! సంతతమూ నీ దివ్య నామం సంస్మరిస్తే చాలు బంధాలన్నీ పటాపంచలవుతాయి. నీ మహిమ ఎక్కడ? నేనెక్కడ? అని సిగ్గు చెందక నాహృదయం నీయందు లగ్నమయింది. ఇది నిజం. నన్ను కరుణతో కటాక్షించు.      

ధన్యున్ లోకమనోభిరాము గుల విద్యా రూప తారుణ్య సౌ
జన్య శ్రీ బల దాన శౌర్య కరుణా సంశోభుతున్ నిన్ను నే
కన్యల్ గోరరు? కోరదే మును రమాకాంతా లలామంబు రా
జన్యానేకప సింహ! నా వలననే జన్మించెనే మోహముల్? 

భావం: మదపుటేనుగు వలె క్రొవ్వి చరించునట్టి శతృ రాజులకు సింహం వంటివాడవైన ఓ శ్రీ కృష్ణా! నీవు ధన్యుడవు. లోకుల మనస్సులను రంజింపచేసేవాడవు. వంశము, విద్య, చక్కదనము, జవ్వనము, మంచితనము, సంపద, బలము, దానము, పరాక్రమము, కారుణ్యము అనే గుణాలతో మిక్కిలి అలరారుతున్నవాడవైన నిన్ను కోరని కన్యలు ఎవరూ ఉండరు. ఉవిదలలో ఉత్తమురాలైన శ్రీ మహాలక్ష్మి అలనాడు నిన్ను చెట్టబట్టలేదా? ఈ మోహము నాకే పుట్టి నేనే అరుదుగా మోహించితినా? వలపు అనేది నా వల్లనే జన్మించిందా?    

శ్రీయుత మూర్తి! యో పురుష సింహమ! సింహము పాలి సొమ్ము గో
మాయువు గోరు చందమున మత్తుడు చైద్యుడు నీ పదాంబుజ 
ధ్యాయినియైన నన్ను వడి దా గొనిపోయెద నంచు నున్న వా
డా యధమాధముండెరుగ డద్భుతమైన భవత్ప్రతాపమున్

భావం: వక్షస్థలము నందు లక్ష్మీ దేవిని వహించిన ఓ పురుష శ్రేష్ఠుడా! ఓ మంగళ మూర్తీ! పురుషులలో సింహము వంటి వాడవు నీవు. సింహమునకు అర్హమైన సొత్తును నక్క వాంఛించునట్లు నీ చరణ సరోజాలను స్మరించే నన్ను మదోన్మత్తుడైన శిశుపాలుడు  శీఘ్రంగా వచ్చి తీసుకుపోవడానికి యత్నిస్తున్నాడు. అల్పులలో అల్పుడైన ఆ చేది దేశపు రాజు ఆశ్చర్యజనకమైన నీ పరాక్రమం ఎరుగడు సుమా!    

వ్రతముల్ దేవ గురు ద్విజన్మ బుధ సేవల్ దాన ధర్మాదులున్
గత జన్మంబుల నీశ్వరున్ హరి జగత్కల్యాణు గాంక్షించి చే
సితి నేనిన్ వసుదేవ నందనుడు నా చిత్తేశుడౌ గాక ని
ర్జితులై పోదురు గాక సంగరములో జేదీశ ముఖ్యాధముల్   

భావం: పూర్వ జన్మములందు నేను జగన్నాయకుడూ, లోకాలకు శుభాలను కలిగించేవాడూ అయిన గోవిందుడిని పతిగా కోరి నోములు నోచి ఉంటే, దేవతలకూ, గురువులకూ, బ్రాహ్మణులకూ, విద్వాంసులకూ సేవలొనర్చి ఉంటే, దాన ధర్మాది పుణ్య కార్యాలు సలిపి ఉంటే వసుదేవుని కుమారుడైన శ్రీ కృష్ణుడు నాకు ప్రాణేశ్వరుడు అవుతాడు. శిశుపాలుడు మొదలుగా గల నీచులు భండనంలో పరాజితులు అవుతారు.  

ఘనులాత్మీయ తమో నివృత్తి కొరకై గౌరీశు మర్యాద నె
వ్వని పాదాంబుజ తోయమందు మునుగన్ వాంఛింతు రే నట్టి నీ
యనుకంపన్ విలపింపనేని వ్రత చర్యన్ నూరు జన్మంబులన్ 
నిను జింతించుచు ప్రాణముల్ విడిచెదన్ నిక్కంబు ప్రాణేశ్వరా!  

భావం: నాథా! మహాత్ములు తమ అఙ్ఞాన రాహిత్యం కొరకు పార్వతీ పతి అయిన పరమేశ్వరుని వలెనే యే పరమ పురుషుని పాదపద్మాలలో ప్రభవించిన గంగా జలాలలో స్నానం చేసి పుణ్యవంతులు కాగోరుదురో అట్టి తీర్థ పాదుడవైన నీ అనుగ్రహానికి నేను అర్హురాలను కాకపోతే అనగా నీవు నన్ను పరిగ్రహింపని పక్షమున బ్రహ్మచర్య వ్రత నిష్ఠ వహించి నూరు జన్మలకైనా నీవే నా పతి కావాలని నిన్నే ధ్యానిస్తూ నా ప్రాణాలు నీకే అర్పిస్తాను. ఇది నా మనో నిశ్చయం. అందుకే నన్ను ఉపేక్ష చేయక వచ్చి నన్ను తీసుకుని పొమ్ము.        

ప్రాణేశ! నీ మంజు భాషలు వినలేని కర్ణ రంధ్రంబుల కలిమి యేల?
పురుష రత్నమ! నీవు భోగింపగా లేని తనులతవలని సౌందర్యమేల?
భువనమోహన! నిన్ను బొడగానగా లేని చక్షురింద్రియముల సత్త్వమేల?
దయిత! నీ యధరామృతం బానగా లేని జిహ్వకు ఫల రస సిద్ధియేల?
నీరజాతనయన! నీ వన మాలికా
గంధమబ్బలేని ఘ్రాణమేల?
ధన్య చరిత! నీకు దాస్యంబు సేయని 
జన్మమేల? యెన్ని జన్మములకు 

భావం: ఓ ప్రాణ నాయకా! ఇంపులైన నీ వాక్కులు విననోచని చెవుల వల్ల ప్రయోజనం శూన్యం. పురుషోత్తమా! నీవు అనుభవింపని సుందర సుకుమార శరీర లావణ్యం ఎందుకూ కొరగాదు. జగన్మోహన మూర్తీ! లోకమునను మోహము పుట్టించ జాలిన నిన్ను సందర్శింప నోచని కనుల కలిమి దండుగ. జీవితేశ్వరా! నీ అధర సుధారసం ఆస్వాదింపని నాలుకకు ఫల రసముల ప్రాప్తి ఎందుకు? కమలాక్షా! నీవు ధరించు వనమాలికా సౌరభం ఆఘ్రాణించని ఈ నాసిక ఏల? ధన్య చరిత్రా! నీ పాద పరిచర్యకు ఉపకరించని ఈ జన్మ ఎన్ని జన్మలెత్తినా ఏమి లాభం? అనగా త్వక్చక్షుశ్రోత్ర జిహ్వాఘ్రాణములను ఙ్ఞానేంద్రియములు కలిగినందుకు ఆయా ఇంద్రియముల వలన సుఖములు నీ వల్లనే అనుభవిస్తూ నీ సేవ చేస్తూ ఉండేదే జన్మ గానీ అట్టివి కాని జన్మములు ఎన్ని ఎత్తినను వ్యర్థమే.     

నమ్మితి నా మనంబున సనాతనులైన ఉమా మహేశులన్
మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు గదమ్మ! మేటి పె
ద్దమ్మ దయాంబురాశివి గదమ్మ హరింబతి సేయుమమ్మ నిన్
నమ్మిన వారికెన్నడును నాశము లేదు గదమ్మ ఈశ్వరీ! 


భావం: అమ్మా! గౌరీ! శాశ్వతులూ, ఆది దంపతులు అయిన పార్వతీ పరమేశ్వరులైన మిమ్ము మదిలో నమ్ముకుని ఉన్నాను. మేలుకోరి నేను మిమ్ములను భక్తితో కొలుస్తున్నాను. తల్లులలోకెల్లా ప్రధానురాలైన నీవు పెద్ద తల్లివి, దయకు సముద్రము వంటి దానవు. తల్లీ! లోకములో నిన్ను నమ్ముకున్న వారికి ఎన్నటికీ చెరపు అనేది లేదు. శ్రీ కృష్ణుని నాకు భర్త అగునట్లుగా చేయుము.  





Tuesday, January 17, 2017

ముచికుందుడు చేసిన శ్రీకృష్ణ స్తోత్రం

శ్రీకృష్ణ పరమాత్మను సంహరించాలని తరుముతూ కాలయవనుడు ఒక గుహలోకి ప్రవేశిస్తాడు. ఆ గుహ పూర్తి అంధకారంగా ఉంటుంది. ఎవరో ఒక వ్యక్తి ఉన్నట్లు తెలిసి అతడే శ్రీకృష్ణుడనుకొని కాలయవనుడు కాలితో తన్నుతాడు. ఆ మహా తపస్వి కన్నులు తెరచి చూచేసరికి కాలయవనుడు భస్మమైపోతాడు. అతడే ముచికుందుడు. దేవతల వరంతో దీర్ఘ నిద్రలో ఉన్న ఆయన నారాయణుడైన శ్రీకృష్ణుని చూచి సంభ్రమంతో స్తోత్రం చేస్తారు.    

                                                  

నీ మాయ జిక్కి పురుష,
స్త్రీ మూర్తిక జనము నిన్ను సేవింపదు; వి
త్తామయ గృహగతమై సుఖ
తామసమై కామవంచితంబై ఈశా! 

భావం: సర్వేశ్వరా! స్త్రీ పురుష రూపమైన ఈ లోకంలోని జన సమూహము నీ మాయ చేత మోహితులై ధన సంపాదన రూపమైన వ్యాధిని, సంసార రూపమైన గృహమును పొంది, ఆహార, నిద్ర, భయము, సంగము, పువ్వుల గంధము మొదలైన వాని వల్ల అనుభవములను అల్ప సుఖములనే చీకటిలో మునిగి నిన్ను భజింప నేరక ఉన్నారు.    

పూని యనేక జన్మముల బొంది తుదిం తన పుణ్య కర్మ సం
తానము పేర్మి గర్మ వసుధా స్థలి బుట్టి ప్రపూర్ణ దేహుడై 
మానవుడై గృహేచ్ఛబడు మందుడజంబు తృణాభిలాషయై
కానక పోయి నూతబడు కైవడి నీ పద భక్తి హీనుడై  

భావం: ఓ స్వామీ! గొర్రె చక్కగా పెరిగిన గడ్డిని చూసి అపేక్షపడి దాని వలన హానిని తెలుసుకొన లేక తినబోయి నూతిలో పడునట్లు, పలు జన్మములెత్తి యెత్తి నీపాదాములందు భక్తి లేక చచ్చి చచ్చి తుదకు పుణ్య కార్యముల ఫలంగా కర్మ క్షేత్రమైన ధరాతలంలో పూర్ణ దేహంతో అవయవ హీనత లేని దుర్లభమైన మనుష్య జన్మమెత్తి పుట్టి కూడా మూఢత వల్ల నీ పద భక్తి లేని వాడై నిన్నెరుగక గేహాదులందలి వాంఛకు వశుడై, నిద్రా భయ సంగమాలయందు ఆశ కలవాడు అగుచున్నాడు.    

తరుణీ పుత్ర ధనాదుల,
మరగి మహా రాజ్య విభవ మద మత్తుడనై
నరతను లుబ్ధుడనగు నా
కరయంగ బహుకాల మీశ! యారడి బోయెన్  

భావం: పరమేశ్వరా! ఆలు, బిడ్డలు, ధనము మున్నగు వాటి యందు అపేక్షను ఉంచి వానితో గాఢానుబంధము గలవాడనై మహారాజ్య సంపత్తి చేత మదించిన మనసు కలవాడనై, మనుష్య శరీరమునందు గల అత్యాశను వహించి యున్న నాకు వ్యర్థముగా చాలా కాలం గడిచిపోయింది.         
ఘట కుడ్య సన్నిభంబగు 
చటుల కళేబరము జొచ్చి జనపతి నంచుం
బటు చతురంగంబులతో 
నిటు నటు తిరుగుదును నిన్ను నెరుగక ఈశా!  

భావం: కుండ, గోడ నానాటికీ క్షీణించిపోవునవి. అదేవిధంగా జడమైన, చంచలమైన ఈ దేహంలో ప్రవేశించి నేను రాజును అనే అభిమానం చేత చతురంగ బలములైన రథ, గజ, తురగ పదాతులతో విర్ర వీగుతూ, నీ స్వరూపమును విచారించి తెలుసుకోవలెనన్న చింత లేక భూమియందు అటు నిటు క్రుమ్మరుచు కాలము వ్యర్థముగా గడిపితిని.  

వివిధ కామ భోగ విషయ లాలసు మత్తు
నప్రమత్త వృత్తి నంతకుండ
వైన నీవు వేళ యరసి త్రుంతువు సర్ప
మొదిగి మూషికంబు నొడియునట్లు 

భావం: పలు విధములైన మనోరథములు, శబ్దాది విషయములందు ఆశ వహించి యేమరి యుండగా నీవు మాత్రం యేమరపాటు చెందక యమ ధర్మ రాజ స్వరూపుడవై పాము కనిపెట్టి యుండి తటాలున ఎలుకను ఒడిసి పట్టుకున్నట్లు సమయంరాగానే పట్టి విషయ లాలసులను హరిస్తావు.     

నరవర సంఙ్ఞితమై రథ
కరి సేవితమైన యొడలు కాలగతిన్ భీ
కర మృగ భక్షితమై దు
స్తర విట్క్రిమి భస్మ సంఙ్ఞితంబగు నీశా!

భావం: గోవిందా!'ప్రభువు ' అని పేరు వహించి రథాల మీద, ఏనుగుల మీద ఎక్కి తిరిగిన ఈ శరీరం కాలవశమై భయంకరములైన జంతువులచే భక్షింపబడడం వల్ల, మురిగిపోతే పురుగులతో నిండి, కాలిపోతే బూది అని వ్యవహరించబడుతుంది.      

  సకల దిశలు గెలిచి సములు వర్ణింపంగ
జారు పీఠమెక్కి సార్వభౌము
డైన సతుల గృహములందు క్రీడా భోగ 
వృత్తి నుండు నిన్ను వెదుకలేడు

భావం: అన్ని దిక్కులనూ జయించి సాటివారు కొనియాడగా ఉన్నత పీఠం అధిష్ఠించిన చక్రవర్తి అయినప్పటికీ సుందరీ మణుల మందిరాలలో కామ సుఖాలు అనుభవిస్తాడే గానీ నిన్ను అన్వేషించడు.   

మానసంబు గట్టి మహిత భోగంబులు
మాని ఇంద్రియముల మదము లడచి
తపము సేసి ఇంద్రతయ కోరుగాని నీ
యమృత పదము కోరడఙ్ఞుడీశ!   

భావం: ఈశ్వరా! ఙ్ఞాన హీనుడగు మనుష్యుడు తెలివిమాలిన వాడై మనస్సును స్వాధీనం చేసుకుని, గొప్ప భోగములను విడనాడి, ఇంద్రియాటోపము అణచి వేసి, తపస్సు చేసి ఇంద్ర పదవిని అభిలషిస్తాడే కానీ నీ అమృత స్థానమును కోరడు.  

సంసారియైయున్న జనునకు నీశ్వర! నీకృప యెప్పుడు నెరయ కల్గు 
నప్పుడు బంధంబులన్నియు తెగిపోవు, బంధ మోక్షంబైన ప్రాప్తమగును 
సత్సంగమంబు, సత్సంగమంబున నీదు భక్తి సిద్ధించు, నీ భక్తి వలన 
సన్ముక్తియగు, నాకు సత్సంగమున కంటె మును రాజ్య బంధ నిర్మూలనంబు 
కలిగినది దేవ! నీ యనుగ్రహము గాదె?
కృష్ణ! నీ సేవ గాని తక్కినవి వలదు
ముక్తి సంధాయి వగు నిన్ను ముట్ట గొలిచి
ఆత్మ బంధంబు గోరునే ఆర్యుడెందు?

భావం: అచ్యుతా! సంసారమందు పరిభ్రమిస్తున్న పురుషుడికి నీఅనుగ్రహం ఎప్పుడు కలుగుతుందో అప్పుడే ఆ సంసార బంధాలు వదిలిపోతాయి. సంసార నివృత్తి కలిగినప్పుడు సత్పురుషులతో సహవాసం లభిస్తుంది. సత్సంగం చేత నీయందు భక్తి సిద్ధిస్తుంది. నీయందు నెలకొన్న భక్తి వల్ల ముక్తి చేకూరుతుంది. నాకు సత్పురుషోత్తముల సాంగత్యమునకు పూర్వమే రాజ్య పాశ నిర్మూలనం జరిగింది. ఇదంతా నీకృప కృష్ణా! నాకు నీ పాద సేవనంతప్ప తక్కిన వేమియూ వద్దు. ఎవడు విఙ్ఞుడైన వాడో వాడు ముక్తిదాయకుడవైన నిన్ను సేవించి తనకు ప్రతిబంధకాలైన శబ్దాది విషయ భోగాలను వాంఛింపడు. ఎవడు యోగ్యుడో వాడు మోక్షం ఇచ్చువాడైన నిన్ను అనన్య భక్తితో సేవించి మరల సంసార బంధమున చిక్కుకొనుటకు ఇచ్ఛ పడడు.   

Monday, January 16, 2017

మత్స్యావతార స్వరూప స్తుతి

వేదోద్ధరణకై శ్రీ మహా విష్ణువు మత్స్యావతారం స్వీకరించినప్పుడు ప్రళయ సముద్ర జలాలు భూలోకాన్ని ముంచి వేయబోయాయి.అప్పుడు శ్రీహరి ప్రేరణతో ఒక నావ అక్కడకు వచ్చింది. సత్యవ్రతుడు దానిపై పెక్కు ఓషధుల విత్తనాలను అమర్చాడు. మహా మీనంగా ప్రత్యక్షమైన విష్ణువును చూసి సంతోషించి సత్యవ్రతుడు ఋషులతో పాటు ఆయనను ఇలా స్తుతించాడు.  
                                                 
తమలో బుట్టు నవిద్య గప్పిగొనుడుం దన్మూల సంసార వి
భ్రములై కొందరు దేలుచుం గలగుచున్ బల్వెంటలన్ దైవ యో
గమునం దే పరమేశు గొల్చి ఘనులై కైవల్య సంప్రాప్తులై
ప్రమదంబందుదు రట్టి నీవు కరుణం బాలింపు మ మ్మీశ్వరా!

భావం: ఓ భగవంతుడా! తమలో ఆవరించి ఉన్న అఙ్ఞానం వల్ల కొందరు సంసారంలో పడి చిక్కుకుని మోసపోయి కలత పడతారు. కోరికలను వెన్నంటుతారు. అటువంటి వారు అదృష్టం వల్ల పరమత్ముడవైన నిన్ను సేవించి మోక్షాన్ని పొంది సంతోష పడతారు. ఆ విధంగా అందరినీ ఆదరించే నీవు మమ్ములను కాపాడు.    

కన్నులు గల్గు వాడు మరి కానని వానికి ద్రోవ జూపగా
జన్న తెరంగు మూఢునకు సన్మతి దా గురుడౌట సూర్యుడే
కన్నులు గాగ భూతముల గాంచుచు నుండు రమేశ! మాకు ను
ద్యన్నయ మూర్తివై గురువవై యల సద్గతి జాడ జూపవే!

భావం: ఓ లక్ష్మీపతీ! సూర్యుడే కన్నులుగా నీవు ప్రాణులను చూస్తుంటావు. ఙ్ఞానం లేని వారికీ, దుర్బుద్ధి కలవానికీ తండ్రివి నీవే. కాబట్టి కనులున్న వాడు కనులు లేని వానికి దారి చూపించిన విధంగా మమ్ములను ఉద్ధరించు. గురుడవై మాకు మంచి దారి చూపించు.  

ఇంగలము తోడి సంగతి,
బంగారము వన్నె కలుగు భంగిని ద్వత్సే 
వాంగీకృతుల యఘంబులు,
భంగంబుల బొందు ముక్తి ప్రాప్తించు హరీ! 

భావం: ఓ స్వామీ! అగ్నితో చేరడం వల్ల బంగారానికి మెరుగు కలిగిన విధంగా నిన్ను పూజించే భక్తుల పాపాలు నాశనమై మోక్షం లభించుతుంది. 

హృదయేశ! నీ ప్రసన్నత,
పదివేలవ పాలి లేశ భాగము కతనం
ద్రిదశేంద్రత్వము కలదట! 
తుది నిను మెప్పింప నేది దొరకదు శ్రీశా!

భావం: ఓ లక్ష్మీ రమణా! పరమత్మా! నీ అనుగ్రహంలో పదివేలవ వంతులో ఒక లేశ భాగం వల్ల దేవేంద్ర పదవి కలుగుతుంది. ఇక నీకు మెప్పు కలిగిస్తే లభించని భాగ్యమేముంటుంది?  

పెరవాడు గురుడటంచును
కొరగాని పదంబు సూప కుజనుండగు నీ
నెర త్రోవ నడవ నేర్చిన 
నరమర లేనట్టి పదమునందు దయాబ్ధీ!  

భావం: ఓ దయా సముద్రుడా! పనికిమాలిన వానిని గొప్ప వాడనుకొని దరి చేరే వాడు చెడిపోతాడు. నిన్ను నమ్ముకుని మంచి మార్గంలో నడవగలిగిన వారు సందేహం లేకుండా నీ సంరక్షణ పొందుతారు.    

చెలివై చుట్టమవై మనస్థితుడవై చిన్మూర్తివై యాత్మవై
వలనై కోర్కుల పంటవై విభుడవై వర్తిల్లు నిన్నొల్లకే
పలు వెంటంబడి లోక మక్కట! వృథా బద్ధాశమై పోయెడిన్
నిలువన్ నేర్చునె హేమరాశి గనియున్ నిర్భాగ్యుడంభశ్శయా! 

భావం: నీటియందు శయనించు వాడవైన నారాయణా! నీవు స్నేహితుడుగా బంధువుగా ఙ్ఞాన స్వరూపుడుగా శాశ్వతునిగా మానవుల మనస్సులలోనే మసలుతావు. ఆత్మవై అండగా ఉంటావు. ప్రభువై కోరికలు పండిస్తావు. ప్రభునిగా రక్షించి వర్తించువాడవైన నిన్ను ఆదరించకుండా లోకం పెక్కింటిపై పేరాసతో పరుగులు పెడుతుంది. అదృష్ట హీనుడు బంగారు రాశి లభించినా దక్కించుకోలేడు కదా!     

Thursday, January 12, 2017

వామన మూర్తి విశ్వరూప వర్ణన

బలి చక్రవర్తి వద్దకు చిన్ని వటువుగా వెళ్ళిన విష్ణువు మూడడుగుల భూమినిమ్మని కోరగా పరవశుడైన బలి మేరలేని ఔదార్యంతో దానమిస్తాడు. అప్పుడు స్వామి బ్రహ్మాండాలన్నీ విస్తరించిన వర్ణన పోతన గారు వాక్కులో అమృతాన్ని కురిపించారా అన్నట్లు దర్శింప చేస్తారు.  
                                   


ఇంతింతై, వటుడింతయై, మరియు దానింతై, నభో వీథిపై
నంతై, తోయద మండలాగ్రమున కల్లంతై, ప్రభారాశిపై
నంతై, చంద్రుని కంతయై, ధ్రువునిపై నంతై, మహర్వాటి పై 
నంతై, సత్య పదోన్నతుం డగుచు బ్రహ్మాండాంత సంవర్థియై 

భావం: కొద్ది కొద్దిగా ఎదిగినాడు స్వామి. ఇంత వాడు అంత వాడైనాడు, అంత వాడు మరింత వాడైనాడు. క్రమ క్రమంగా పెరిగిపోతున్నాడు. వరుసగా ఆకాశం కంటె, మేఘ మండలం కంటె, వెలుగుల రాశి కంతె పైకి పెరిగాడు. చంద్రుని వరకూ, ధృవ తార వరకూ, మహర్లోకం వరకూ, ఆ పైన సత్య లోకం వరకూ పెరుగుతూ బ్రహ్మాండమంతా నిండి పోయాడు. 

 రవి బింబం బుపమింప బాత్రమగు ఛత్రంబై, శిరో రత్నమై
శ్రవణాలంకృతియై గళాభరణమై సౌవర్ణ కేయూరమై
ఛవిమత్కంకణమై కటి స్థలి నుదంచ ద్ఘంటయై నూపుర
ప్రవరంబై పద పీఠమై వటుడు దా బ్రహ్మాండమున్ నిండుచోన్ 

భావం: వామనుడు బ్రహ్మాండమంతా నిండిపోతున్న ఆ సమయంలో సూర్య బింబం క్రమ క్రమంగా అతనికి గొడుగుగా పోల్చడానికి వీలైంది. తర్వాత శిరోమణిగా, తర్వాత మకర కుండలంగా, తర్వాత కంఠాభరణంగా, ఆ తర్వాత బంగారు భుజ కీర్తిగా, అటు తర్వాత కాంతులీనే కంకణంగా, అనంతరం మొలలోని గంటగా, ఆ పైన మేలైన కాలి అందెగా, చివరకు పాదపీఠంగా ప్రకాశించింది.   

ఒక పదంబు క్రింద నుర్వి పద్మము నంటి
కొన్న పంకలవము కొమరు దాల్చె
నొకటి మీద దమ్మి కొదిగిన తేటినా 
వెలసె మిన్ను నృప! త్రివిక్రమమున

భావం: రాజా! ఈ విశ్వరూపంలో ఒక పాదం క్రింద ఉన్న భూమండలం పద్మానికి అంటుకున్న చిన్న బురద ముద్ద వలె ఒప్పింది. ఇంకొక పాదం మీద ఉన్న ఆకాశం పద్మం మీద వ్రాలిన తుమ్మెద వలె ప్రకాశించింది.     

జగములెల్ల దాటి చనిన త్రివిక్రము,
చరణ నఖర చంద్ర చంద్రికలను
బొనుగు పడియె సత్యమున బ్రహ్మ తేజంబు,
దివసకరుని రుచుల దివియ వోలె

భావం: అన్ని లోకాలకూ దాటిపోయిన త్రివిక్రమ దేవుని యొక్క చంద్రుని వంటి కాలిగోళ్ళ కాంతికి లోకంలోని బ్రహ్మ తేజస్సు సూర్యుని ముందు దివిటీ వలె వెల వెల పోయింది. 

తన పుట్టిల్లిదె పొమ్మటంచు నజుడుం దన్నాభి పంకేరుహం 
బు నిరీక్షించి, నటించి యున్నత పదంబుం జూచి తత్పాద సే
చనముంజేసె కమండలూదకములం జల్లించి, తత్తోయముల్
విను వీథిం బ్రవహించె దేవనది నా విశ్వాత్ము కీర్తి ప్రభన్.   

భావం: మహా విష్ణువు బొడ్డు తామరను చూసి "నా జన్మ స్థానం ఇదే సుమా" అని అనుకుంటూ బ్రహ్మదేవుడు సంతోషించినాడు. తన కమండల జలంతో స్వామి పాదాన్ని కడిగాడు. ఆ జల ధారలు భగవంతుని కీర్తి కాంతితో నిండి ఆకాశంలో దేవ నదిగా ప్రవహించాయి. 










అంబరీష గుణ వర్ణన

విష్ణు భక్తుల్లో శ్రేష్ఠుడైన అంబరీషుని గుణ గణాలను వర్ణించే ఈ పద్యాలు సాధకులందరికీ కూడా మార్గ నిర్దేశం చేస్తాయి.
                                     

చిత్తంబు మధురిపు శ్రీ పాదములయంద; పలుకులు హరి గుణ పఠనమంద;
కరములు విష్ణు మందిర మార్జనములంద; శ్రవములు హరి కథా శ్రవణమంద;
చూపులు గోవింద రూప వీక్షణమంద; శిరము కేశవ నమస్కృతుల యంద;
పదము లీశ్వర గేహ పరి సర్పణమంద; కామంబు చక్రి కైంకర్యమంద;
సంగ మచ్యుత జనతనుసంగమంద,
ఘ్రాణ మసురారి భక్తాంఘ్రి కమలములంద
రసన తులసి దళములంద, రతులు పుణ్య 
సంగతుల యంద యా రాజ చంద్రమునకు   

భావం: ఆ రాజ చంద్రుని మనస్సు శ్రీహరి పాదాల మీదే, మాటలు హరి గుణ సంకీర్తనమందే, చేతులు విష్ణు మందిరాలను శుభ్ర పరచడమందే, చెవులు హరి కథలను వినడమందే, చూపులు గోవిందుని రూపాన్ని తనివి తీరా చూడడం మీదే, శిరమును శ్రీహరి చెంత నమస్కరించడమందే, పాదాలు విష్ణు దేవుని ఆలయాలను చుట్టి రావడమందే, కోరిక హరి సేవయందే, చెలిమి విష్ణు భక్తుల యందే, ఘ్రాణము భక్త జనుల పాద కమలములందు, నాలుక పవిత్ర తులసీ దళములందు, కోరికలు పుణ్య విషయాల యందే నిమగ్నమై ఉండేవి. వాస్తవమునకు అతడు స్వీయేంద్రియ భోగమునకు దేనిని కోరలేదు. అతడు సర్వేంద్రియాలను భగవత్సంబంధమైన కార్యక్రమములలో నిల్పి భక్తి యోగంలోనే దేహాన్ని నెలకొనేటట్లు చేసాడు.      

ఘన వైభవంబునం గల్మష దూరుడై యఙ్ఞేశు నీశు నబ్జాక్షు గూర్చి 
మొనసి వశిష్ఠాది ముని వల్లభుల తోడ దగిలి సరస్వతీ తటము నందు
మేధతో బహు వాది మేధంబులొనరించె గణుతింపరాని దక్షిణలు వెట్టి 
సమ లోష్ట హేముడై సర్వ కర్మంబులు హరి పరంబులు గాగ నవని యేలె
విష్ణు భక్తులందు విష్ణువు నందుగ
లంక మెడల మనసు లంకె పెట్టి
విహిత రాజ్య వృత్తి విడువని వాడునై
యతడు రాచ తపసి యనగ నొప్పె


భావం: గొప్ప వైభవంతో పుణ్యాత్ముడై అంబరీషుడు విద్యుక్త ధర్మ పాలనము నందు తన సమస్త రాచ కర్మ ఫలమును పరమ భోక్త, ఇంద్రియానుభూతికి పరమైన వాడు, దేవదేవుడగు విష్ణువునకు అర్పించి భగవన్నిష్ఠులైన వశిష్ఠుడు మొదలైన ఋషులతో కూడి యఙ్ఞేశుడైన శ్రీహరిని గూర్చి సరస్వతీ నదీ తీరంలో లెక్కించరాని దక్షిణలు పెట్టి మహదైశ్వర్యములోను, యుక్తమగు సామగ్రిలోను ఎన్నో అశ్వమేథ యాగాలు చేసాడు. బంగారాన్నీ, మట్టి పెళ్ళనూ సమానంగా చూసే అతడు సర్వ కర్మలను హరి పరం చేసి భూమిని పరిపాలించాడు. విష్ణు భక్తుల పట్ల, శ్రీహరి పట్ల మనసు లంకె పెట్టి తనకు విధించబడ్డ రాజ్య పాలన వదలక భూమండల చక్రవర్తియైన అంబరీషుడు ఈ విధంగా భక్తి యోగమున నెలకొనిన వాడై రాజర్షిగా విరాజిల్లాడు.  

హరియని సంభావించును, హరి యని
దర్శించు, నంటు; నాఘ్రాణించున్;
హరి యని రుచి గొన దలచును,
హరిహరి!ఘను నంబరీషు నలవియె పొగడన్?

భావం:ఆ భగవంతుని భక్తుడైన అంబరిషుడు 'హరీ' అని తలచేవాడు, 'హరి' అని చూసేవాడు, 'హరి' అని తాకేవాడు, 'హరి' అని వాసన చూసేవాడు, 'హరి' అంటూ రుచి చూసేవాడు. అహా! గొప్పవాడైన ఆ అంబరీషుడిని కొనియాడ సాధ్యమా!         

క్షీర సాగర మథనం

         దేవ దానవులు అమృతో త్పాదనం కోసం క్షీర సాగర మథనం చేస్తుండగా అగ్ని జ్వాలల కోలాహలంతో హాలాహలం పుట్టి అందరినీ భయ భ్రాంతులను చేసింది. దానిని అడ్డగించే మహనీయులెవరూ కానక చివరకు తమకు ఆ మహేశ్వరుడొక్కడే గతి యని తలంచి బ్రహ్మాది దేవతలంతా కైలాసానికి వెళ్ళి తమ కష్టాన్ని మొర పెట్టుకుని ఆయన వైభవాన్ని ఇలా స్తుతించారు: 
                                             

భూతాత్మ! భూతేశ! భూత భావన రూప! దేవ! మహాదేవ! దేవ వంద్య!
ఈ లోకములకెల్ల ఈశ్వరుండవు నీవు బంధ మోక్షములకు ప్రభుడ వీవ
యార్త శరణ్యుండ వగు గురుండవు నిన్ను గోరి భజింతురు కుశల మతులు
సకల సృష్టి స్థితి సంహార కర్తవై బ్రహ్మ విష్ణు శివాఖ్య బరగు దీవు
పరమ గుహ్యమైన బ్రహ్మంబు సద సత్త
మంబు నీవ, శక్తి మయుడ వీవ
శబ్ద యోని వీవ జగదంతరాత్మవు నీవ
ప్రాణ మరయ నిఖిలమునకు  

భావం: ఓ పరమేశ్వరా! నీవు పంచ భూతాలకూ ఆత్మయైన వాడవు. భూత నాథుడవు. జీవులకు కారణ రూపమైన దేవుడవు. దేవ దేవా! మహా దేవా! దేవ వంద్యా! అన్ని లోకాలనూ పాలించే వాడవు నీవు. లోకంలోని బంధ మోక్షాలకు కారణమైన ప్రభుడవు నీవు. దు:ఖించే వారిని చేరదీసే తండ్రివి నీవు. వారికి మోక్షాన్ని ఇచ్చేవాడవు నీవే. బుద్ధిమంతులు ప్రీతితో నిన్ను పూజిస్తారు. సమస్తమైన సృష్టికీ, స్థితికీ, నాశనానికీ కర్తవు నీవే. బ్రహ్మ, విష్ణువు, శివుడు అనే పేర్లతో ప్రకాశించే వాడవు నీవు. భావింపరాని పరమాత్మవు నీవే. ప్రకృతి పురుష స్వరూపుడవు నీవే. శక్తి యుక్తుడవు నీవే. శబ్దానికి జన్మ స్థానం నీవే. లోకాలకు అంతరాత్మవు నీవే. సమస్తానికీ ప్రాణం నీవే   
 

నీ యంద సంభవించును
నీ యంద వసించి యుండు నిఖిల జగములున్
నీయందు లయము బొందును
నీ యుదరము సర్వ భూత నిలయము రుద్రా!


భావం: పరమేశ్వరా! అన్ని లోకాలూ నీలోనే పుడతాయి. నీలోనే వసిస్తాయి. నీలోనే లయమవుతాయి. అన్ని ప్రాణులకూ నీ ఉదరం ఆలవాలం.  


అగ్ని ముఖంబు,పరాపరాత్మక మాత్మ, కాలంబు గతి, రత్న గర్భ పదము,
శ్వనంబు నీ యూర్పు, రసన జలేశుండు, దిశలు కర్ణంబులు, దివము నాభి,
సూర్యుండు కన్నులు, శుక్లంబు సలిలంబు, జఠరంబు జలధులు, చదలు శిరము,
సర్వౌషధులు రోమచయములు, శల్యంబు లద్రులు, మానస మమృతకరుండు
ఛందములు ధాతువులు ధర్మ సమితి హృదయ
మాస్య పంచక ముపనిష దాహ్వయంబు
నయిన నీరూపు పర తత్వమై శివాఖ్య
మై స్వయంజ్యోతియై  యొప్పు నాద్యమగుచు.


భావం: అగ్ని నీ ముఖం, జీవాత్మ-పరమాత్మల కలయిక నీ యాత్మ, కాలం నీ నడక, భూమి నీ పాదం, వాయువు నీ శ్వాస, వరుణుడు నీ నాలుక, దిక్కులు నీ చెవులు, స్వర్గం నీ నాభి, సూర్యుడు నీ కన్నులు, నీరు నీ వీర్యం, సముద్రాలు నీ గర్భం, ఆకాశం నీ శిరస్సు, సమస్త ఓషధులూ నీ రోమ సమూహాలు, పర్వతాలు నీ ఎముకలు, చంద్రుడు నీ మనస్సు, వేదాలు నీ ధాతువులు, ధర్మ శాస్త్రాలు నీ హృదయం, ఉపనిషత్తులు నీ పంచ ముఖాలు, నీ రూపం పరతత్వం, నీవు స్వయం ప్రకాశుడవు. శివ స్వరూపుడైన పరం జ్యోతివి నీవు. సర్వమునకూ నీవే ఆద్యుడవు.   
 

కొందరు కలడందురు నిను;
కొందరు లేడందురతడు గుణి కాడనుచుం
గొందరు; కలడని లేడని,
కొందల మందుదురు నిన్ను గూర్చి మహేశా!


భావం: ఓ మహా ప్రభూ! శివా! కొందరు నీవున్నావని అంటారు, కొందరు నీవు లేవంటారు, మరి కొందరు నీవు గుణాతీతుడవంటారు, ఇంకా కొందరు నీవు ఉన్నావో లేవో అనే సందేహంతో బాధలు పడుతుంటారు. 

తలప ప్రాణేంద్రియ ద్రవ్య గుణ స్వభావుడవు, కాల క్రతువులును నీవ;
సత్యంబు ధర్మ మక్షరము ఋతంబును, నీవు ముఖ్యుండవు నిఖిలమునకు
ఛందోమయుండవు సత్వ రజ స్తమ, శ్చక్షుండవై యందు సర్వ రూప
కామ పురాధ్వర కాల గతాది భూత ద్రోహ భయము చోద్యంబు గాదు
లీల లోచన వహ్ని స్ఫులింగ శిఖల,
నంతకాదుల గాల్చిన యట్టి నీకు
రాజ ఖండావతంస! పురాణ పురుష!
దీన రక్షక! కరుణాత్మ! దేవ దేవ!


భావం: ఓ దయామయా! దేవ దేవా! పురాణ పురుషా! చంద్ర కళా కిరీటా! దీన రక్షకా! ఆలోచిస్తే ప్రాణమూ, ఇంద్రియాలూ, ద్రవ్య గుణాలూ నీకు స్వభావ సిద్ధాలు. కాలమూ యఙ్ఞాలూ నీవే. సత్యమూ, ధర్మమూ, ఓంకారమూ, మోక్షమూ నీవే. అన్నింటికీ ఆధారం నీవే. వేద రూపుడవు నీవే. సత్వము, రజస్సు, తమస్సు నీ నేత్రాలు. అన్ని రూపాలలోను నీవు ఉన్నావు. నుదుటి కంటి మంటలతో యమాదులను అవలీలగా నీవు కాల్చి వేసావు. అటువంటి నీకు మన్మథుడూ, త్రిపురాసురులూ, దక్ష యఙ్ఞము, కాలకూట విషము మొదలైన వాటి నుండి హాని కలుగుతుందనే సంకోచం ఏ మాత్రం లేదు.   



మూడు మూర్తులకు మూడు లోకములకు
మూడు కాలములకు మూలమగుచు
బేధమగుచు తుది నబేధమై యొప్పారు
బ్రహ్మ మనగ నీవ ఫాల నయన 


భావం: ఓ శంకరా! బ్రహ్మ, విష్ణు, ఈశ్వరులనే మూడు మూర్తులకూ, స్వర్గ పాతాళ భూములనే మూడు లోకాలకూ, భూత భవిష్యత్ వర్తమానాలనే మూడు కాలాలకూ నీవే మూలం. మొదట బేధంతో కనిపించినా చివరికి అబేధ స్వరూపంతో ఒప్పుతున్న పరబ్రహ్మం నీవే.   

సద సత్తత్వ చరాచర
సదనంబగు నిన్ను బొగడ జలజ భవాదుల్
పెదవులు కదలుప వెరతురు
వదలక నిను పొగడ నెంత వారము దేవా!


భావం: ఓ స్వామీ! సదసద్రూపమైన ఈ చరాచార ప్రపంచానికి మూలాధారం అయిన నిన్ను బ్రహ్మాదులు కూడా ప్రస్తుతించడానికి భయపడి పెదవులు కదిలించలేరు. అటువంటి నిన్ను స్తుతించడానికి మేము ఎంత వారము?



బాహు శక్తి సురాసురుల్ చని పాలవెల్లి మథింప హా
లాహలంబు జనించె నేరి కలంఘ్య మై భువనంబు గో
లాహలంబుగ జేసి చిచ్చును లాగముం గొని ప్రాణి సం
దోహమున్ బ్రతికింపవే? దయ దొంగిలింపగ నీశ్వరా!


భావం: ఓ పరమేశ్వరా! దేవతలూ, రాక్షసులూ తమ భుజ బలంతో పాల సముద్రాన్ని చిలకగా హాలాహల విషం పుట్టి ఎవరికీ లొంగకుండా లోకాలను కోలాహలం చేస్తున్నది. ఎవరూ దానిని ఎదిరించలేక పోతున్నారు.అది లోకానికి ఎంతో క్షోభ కలిగిస్తు ఉన్నది. ఆ విష జ్వాలను అవలీలగా పరిగ్రహించు. దయతో ప్రాణికోటిపై నీ కరుణ పడునట్లు వారిని కరుణించు. 



లంపటము నివారింపను
సంపద కృప సేయ జయము సంపాదింపం
జంపెడి వారి వధింపను
సొంపారగ నీక చెల్లు సోమార్థ ధరా!


భావం: ఓ చంద్ర శేఖరా! ఆపదను తొలగించడానికీ, ఆనందాన్ని చేకూర్చడానికీ, జయాన్ని సంపాదించడానికీ, కౄరులను హత మార్చడానికీ నీకే సాధ్యమవుతుంది. 


నీకంటె నొండెరుంగము
నీకంటెం బరులు గావ నేరరు జగముల్
నీకంటె నొడయడెవ్వడు
లోకంబుల కెల్ల నిఖిల లోక స్తుత్యా!


భావం: అన్ని లోకాల చేతనూ పొగడ బడుతున్న స్వామీ! నీవే మాకు దిక్కు. నిన్ను తప్ప మరెవ్వరినీ ఆశ్రయింపము.నీవు తప్ప ఇంకెవరూ లోకాలను కాపాడ లేరు. అన్ని లోకాలలోనూ నీ కంటే గొప్పవాడు వేరు ఎవ్వడు లేడు.  


Wednesday, January 11, 2017

గజేంద్ర మోక్షం

                 చిర పరిచితమైన గజేంద్ర మోక్ష ఘట్టంలో విశ్వేశ్వరుని తత్వాన్ని ఆస్వాదిద్దాం.
                                           
జగంలో తిరిగే మన జీవితాలనే ఆ గజం సంకేతిస్తూ మన పనుపున లోకేశ్వరుణ్ణి ప్రార్థించడం మనకు మార్గ దర్శకం.

ఎవ్వని చే జనించు జగ, మెవ్వని లోపల నుండు లీనమై,
ఎవ్వని యందు డిందు, పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం
బెవ్వ డనాది మధ్యలయు డెవ్వడు సర్వము దానయైన వా
డెవ్వాడు వాని నాత్మ భవు నీశ్వరునే శరణంబు వేడెదన్  

భావం: ఈ లోకం ఎవని వల్ల పుడుతున్నదో, ఎవని లోపల భాగంలో కలదో, వానిలో కలిసి ఉంటుందో, ఎవని లోపల సర్వ ప్రపంచం లయం చెందుతుందో, ఈ లోకాలన్నింటికీ పరమాత్ముడు అయిన వాడు ఎవరో, ఈ విశ్వానికి మూల కారణం ఏ పరమాత్మయో, ఎవడు పుట్టడము, గిట్టడము, పెరగడం లేని వాడుగా ఉన్నాడో, ఎవడు అన్నింటికీ మూల కారణం తానే అయి ఉంటాడో- అటువంటి ప్రభువైన సర్వ శక్తువంతుడైన భగవంతుని నేను శరణు కోరుతున్నాను.  

ఒక పరి జగముల వెలినిడి
యొకపరి లోపలికి గొనుచు నుభయము తానై
సకలార్థ సాక్షియగు న
య్యకలంకుని నాత్మ మూలు నర్థి దలంతున్


భావం: ఒక సారి సర్వ లోకాలనూ సృష్టి చేసి, ఇంకొక సారి అన్ని లోకాలను తనలో చేర్చుకుంటూ, ఆ లోకాల సృష్టి లయాలు రెండింటికీ తానే కారణమై, అన్ని విషయాలనూ సాక్షి వలే అవలోకిస్తూ ఆత్మలకు ఆత్మయైన ఎట్టి కళంకము లేని వాడైన ఆ పరమాత్ముని ప్రాణమునందలి ఆసక్తితో రక్షించవలసిందిగా ధ్యానం చేస్తాను.   

లోకంబులు లోకేశులు
లోకస్థులు తెగిన తుది నలోకంబగు పెం
జీకటి  కవ్వల నెవ్వం
డేకాకృతి వెలుగు నతని నే సేవింతున్


భావం: సకల లోకాలూ, ఆ లోకాలనన్నింటినీ పాలించే వారూ, ఆ లోకాలలో నివసించి ఉండేవారూ అందరూ నశించిన అనంతరం అనగా సకల లోకాల లయము ఆ పరమేశ్వరుని చేత జరిగిన తరువాత ఏర్పడే సర్వ శూన్యంలో పుట్టే ఆ కారు చీకట్లకు అవతల అఖండమైన రూపంతో ప్రకాశించే ఒకే ఒక పరమేశ్వరుని నేను భావించి సేవిస్తాను. 

నర్తకుని భంగి పెక్కగు
మూర్తులతో నెవ్వడాడు? మునులు దివిజులుం
గీర్తింప నేర రెవ్వని
వర్తన మొరు లెరుగ రట్టి వాని నుతింతున్


భావం: నాట్యం చేసేటప్పుడు నర్తకుని లాగా అనేక రూపాలను మార్చుకుంటూ నాట్యం చేస్తుండే విధంగా ఎవరు స్వరూపాలను ధరించి ప్రపంచాన్ని ఆడిస్తాడో, ఋషులూ, దేవతలూ ఎవనిని కీర్తింపలేరో, ఎవని నడవడికలు ఇతరులకు అగోచరంగా ఉంటాయో-అటువంటి దేవ దేవుడిని నేను సంస్తుతిస్తాను.     

ముక్త సంగులైన మునులు దిదృక్షులు,
సర్వ భూత హితులు సాధుచిత్తు
లసదృశ వ్రతాఢ్యులై కొల్తు రెవ్వని
దివ్య పదము వాడు దిక్కు నాకు

భావం: ప్రపంచంతో సంబంధాలను వదిలి వేసిన మునులూ, భగవంతుడిని చూడాలని కోరేవారూ, అన్ని ప్రాణులకూ మేలు కోరేవారూ, మంచి మనసు కలవారూ, సాటిలేని వ్రతాలు ఆచరించుతూ ఎవని పాదాలను సేవిస్తారో అటువంటి దేవుడే నాకు ఆధారంగా నిలుస్తాడు.   

యోగాగ్ని దగ్ధ కర్ములు
యోగీశ్వరులే మహాత్ము నొండెరుగక స
ద్యోగ విభాసిత మనముల
బాగుగ వీక్షింతు రట్టి పరము భజింతున్


భావం: యోగీంద్రులు యోగమనే అగ్నితో తమ పూర్వ కర్మలను కాల్చివేసి, ఇతరమేమి తలచకుండా ప్రకాశించే తమ మనసుల్లో నిత్యము ప్రకాశించుచుండు ఏ మహాదేవుని ఎంతో గొప్పగా చూస్తుంటారో అటువంటి సర్వానికీ అతీతమైనట్టి ప్రభువును నేను సేవిస్తాను.     

స్త్రీ నపుంసక పురుష మూర్తియును గాక 
తిర్య గమర నరాధి మూర్తియును గాక
కర్మ గుణ బేధ సద సత్ప్రకాశి గాక
వెనుక నన్నియు తానగు విభు తలంతు


భావం: ఆయన స్త్రీ, పురుషుడూ, నపుంసకుడూ, నర సుర జంతు స్వరూపుడూ కాకుండా గుణ బేధాలకు, కర్మకు అతీతంగా ఉంటాడు. ఉండడమూ, లేకపోవడమూ అనే వాటిని బయలు పరచకుండా ఉంటాడు. ఏదీ కాకుండానే అన్నీ తానే అవుతాడు. అటువంటి ప్రభువును నేను ధ్యానం చేస్తాను.  

కలడందురు దీనుల యెడ
కలడందురు పరమ యోగి గణముల పాలం
గలడందురన్ని దిశలను
కలడు కలండనెడు వాడు కలడో లేడో


భావం: దేవుడు ఆర్తులైన వారి వెంట దయా మూర్తియై ఉంటాడంటారు. ఉత్తములైన యోగుల చెంత వారిని కాచి రక్షించడానికి ఉంటాడంటారు. అన్ని దిక్కులలోను ఆయనే ఉంటాడని అంటారు. ఉన్నాడు, ఉన్నాడు అని చెప్పుకొనబడేవాడు అయినటువంటి దేవుడు మరి ఉన్నాడో లేడో!    

కలుగడే నా పాలి కలిమి సందేహింప కలిమి లేములు లేక కలుగువాడు
నాకడ్డపడ రాడె నలిన సాధువులచే బడిన సాధుల కడ్డ పడెడు వాడు
చూడడే నా పాటు జూపుల చూడక చూచువారల కృప చూచువాడు
లీలతో నా మొరాలింపడే మొరగుల మొరలెరుంగుచు దన్ను మొరగువాడు
అఖిల రూపముల్ దన రూపమైన వాడు
నాది మధ్యాంతములు లేక యడరు వాడు
భక్త జనముల దీనుల పాలి వాడు
వినడె చూడడె తలపడె వేగరాడె  


భావం: నా విషయంలో భగవంతుని ఉనికి అనుమానించడమెందుకు? అతడు ఐశ్వర్యము, పేదరికమూ అనేవి చూడకుండా అందరికీ అండగా ఉండే వాడు అయిన పుణ్య మూర్తి. కలిమి లేములకు అతీతమైన వాడు నాపట్ల కూడా ఉండే ఉంటాడు. అతడు దుర్జనుల చేత చిక్కుకున్న సజ్జనులకు సాయ పడతాడు. కాబట్టి ఆయనే ఈ మొసలి అనే దుర్జనుని చేతి నుంచి తొలగించి నాకు కూడా సాయ పడతాడు. అతడు బయటి చూపులు వదలి తననే చూచే వారిని దయతో చూస్తాడు. అట్టి వారిని కృపతో చూచే వాడు నా కష్టాన్ని చూస్తాడు. అతడు దీనుల మొరలు తెలుసుకుని తన్ను తానే మరచిపోయే వాడైన దీన రక్షకుడు. నా మొరను విని ఆలకించకుండా ఉండడు. అన్ని రూపాలూ ఆయన రూపాలే. ఆయనకు మొదలూ, నడుమా, తుదా లేవు. అతడే భక్తులకూ, దిక్కు లేని వారికీ ఆధారమైన వాడు. అందువల్ల అటువంటి దొర నా మొర వినడా? నా బాధ చూడడా? నన్ను దయ తలచడా? నా వద్దకు తొందరగా రాడా?      

విశ్వ కరు విశ్వ దూరుని
విశ్వాత్మకు విశ్వవేద్యు విశ్వు నవిశ్వున్
శాశ్వతు నజు బ్రహ్మ ప్రభు
నీశ్వరునిం పరమ పురుషు నే భజియింతున్


భావం: లోకాన్ని సృష్టి చేసి, లోకానికి దూరంగా ఉంటూ, లోకానికి అంతరాత్మయై లోకానికి బాగా తెలుసుకోతగిన వాడై, లోకమే తానై, లోకాతీతుడై, శాశ్వతమైన వాడై, పరబ్రహ్మ స్వరూపుడై, పుట్టుక లేకుండా ఎల్లప్పుడూ ఉంటూ, ముక్తికి నాయకుడై, లోకాన్ని నడిపిస్తున్న పరమాత్ముని  నేను ఆరాధిస్తాను. 

ఓ కమలాప్త! యో వరద! యో ప్రతిపక్ష విపక్ష దూర! కు
య్యో! కవి యోగి వంద్య సుగుణోత్తమ! యో శరణాగతామరా
నోకహ! యో మునీశ్వర మనోహర! యో విమల ప్రభావ! రా
వే! కరుణింపవే! తలపవే! శరణార్థిని నన్ను గావవే! 


భావం: ఓ కమలాక్షుడా! ఓ వరదుడా! శతృవులపైన కూడా వైరం లేనివాడా! నా మొర వినవా! కవుల చేత, యోగుల చేత నమస్కారాలు అందుకునే వాడా! ఉత్తమ గుణాలు కలవాడా! శరణు వేడిన వారికి కల్ప వృక్షం వంటి వాడా! మునీంద్రులకు ప్రియమైన వాడా! నిర్మలమైన మహిమ కల దేవా! రావా! కనికరింపవా! కరుణించి శరణు కోరుతున్న నన్ను కాపాడవా! నన్ను ఒక్క సారైన తలచుకొన రాదా!      




కాళియ మర్దనం

              కాళియుడు అనే విష సర్పపు పడగలను రంగస్థలంగా చేసుకుని బాలకృష్ణుడు ఉల్లాసంగా నాట్యం చేసాడు. ఆ తాండవ కృష్ణుని దారుణమైన కాలి తాపులకు పడగలన్నీ చితికిపోయి చచ్చిన వాని వలె పడి ఉన్న కాళియుని చూచిన అతని భార్యలు దు:ఖముతో శ్రీకృష్ణునికి సాష్టాంగ నమస్కారం చేసి ఇలా స్తుతించారు:
                                                  
కౄరాత్ముల దండింపగ
ధారుణిపై నవతరించి తనరెడి నీకీ
కౄరాత్ముని దండించుట
కౄరత్వము కాదు సాధు గుణము గుణాఢ్యా!


భావం: సర్వ సద్గుణ సంపన్నుడవైన గోపాల కృష్ణా! లోకము నందలి కౄరులను దండించడానికి భూమిపై అవతరించిన మహానుభావుడవు నీవు. కౄరుడైన ఈ కాళియుని శిక్షించడం నీకు వీరత్వమే గానీ దుష్ట స్వభావమని భావించకూడదు. 

పగ వారి సుతుల యందును
పగ ఇంచుక లేక సమత బరగెడి నీకుం
బగ గలదె? ఖలుల నడచుట
జగద వనము కొరకు గాదె జగదాధారా!

భావం: జగత్తులకు అన్నింటికీ ఆధారమైన ప్రభూ! నీకు పగ వారైన హిరణ్య కశిపుడు మొదలైన వారి కొడుకుల యందు కూడా కొంచమైనను పగ లేదు. సమానత్వమే చూపుతావు. అట్టి నీకు మాయందు శతృత్వం ఎందుకుంటుంది? నీవు దుష్టులను శిక్షించడం అనేది లోకాలను రక్షించడానికే. అందుకే ఈ దుష్టుడైన మా భర్తను శిక్షించావు.  

ఎట్టి తపంబు సేసెనొకొ? ఎట్టి సుకర్మములాచరించెనో?
ఎట్టి నిజంబు పల్కెనొకొ? ఈ ఫణి పూర్వ భవంబునందు ము
న్నెట్టి మహానుభావులకు నెన్నడు జేరువ గాని నీవు నే
డిట్టి వినోద లీల తలకెక్కి నటించెద వీ ఫణీంద్రుపై 

భావం: ఇంతకు ముందు ఎంతో మహిమ గల పుణ్య పురుషులకు కూడా సన్నిహితుడవు కాని నీవు, వేడుకతో తన తలల మీదకు ఎక్కి నాట్యం చేయడానికి ఈ కాళియుడు అనే సర్పం పూర్వ జన్మంలో ఎటువంటి తపస్సు చేసాడో, ఎటువంటి ధర్మ కార్యాలు చేసాడో, ఎలాంటి సత్య వాక్యాలను పలికాడో? అలా కాని పక్షంలో నీ పాద పద్మాలను తలకు సోకునంతటి భాగ్యము అతనికి కలుగదు కదా! అది ఎంతటి భాగ్యమో!    

బహుకాలంబు తపంబు సేసి వ్రతముల్ పాటించి కామించి నీ
మహనీయోజ్జ్వల పాదరేణు కణ సంస్పర్శాధికారంబు శ్రీ
మహిళా రత్నము దొల్లి కాంచె నిదె నేమం బేమియున్ లేక యీ
యహి నీ పాద యుగాహతిం బడసె నేడత్యద్భుతంబీశ్వరా!

భావం: పూర్వం స్త్రీలందరిలోనూ ఉత్తమురాలైన లక్ష్మీ దేవి ఎంతో కాలం తపస్సు చేసి, పట్టుదలతో వ్రతాలు చేసి గొప్ప తేజస్సుతో వెలుగొందే నీ పాదధూళిలో ఒక్క కణాన్ని తాకే అర్హత సంపాదించుకుంది. అటువంటిది ఈ పాము ఏ తపస్సు చేయకుండానే నీ పాదాల పవిత్ర స్పర్శకు నోచుకున్నది. ఇది ఎంతటి అద్భుతం!    

                       ఆ సమయంలో కాళియుడు చేసిన స్తుతి సరిగ్గా మనకు కూడా సరిపోయే విధంగా ఉండడం విశేషం.

మలకలు మా ప్రచారములు, మా ముఖముల్ విష వహ్ని ఘోరముల్,
ఖలులము, రోష జాతులము, గర్వుల, మేమొక మంచివారమే?
నళిన దళాక్ష! ప్రాణులకు నైజ గుణంబులు మాన నేర్చునే?
వెలయవె? మా వికారములు వింతలె? మే లొనరించితీశ్వరా!


భావం: తామర రేకుల వంటి కన్నులు గల ఓ స్వామీ! కృష్ణా! సర్వేశ్వరా! మా నడతలు వంకర టింకర అయినవి. మా ముఖాలు విషాగ్నులతో ఘోరమైనవి. దుర్మార్గులము, రోషము కల్గిన జాతి వారము, రోషంలోనే పుట్టిన వారము, పొగరుబోతులము. మేమూ ఒక మంచివాళ్ళమేనా? ఈ సృష్టిలోనున్న ప్రాణులందరికీ తమ సహజమైన గుణాలు అలాగే ఉంటాయి గానీ లేకుండా పోవు. మా వికృత చేష్టలన్నీ సృష్టికర్తవైన నీకు వింతలు కాదు కదా! అయినా ఈనాడు నాకు చాలా ఉపకారం చేసావు.     

బ్రహ్మ కృత విష్ణు స్తుతి

             ఒక సారి బ్రహ్మ దేవుడు శ్రీ కృష్ణుని బాల్య లీలలలకు, ఆతని రాక్షస సంహారగాధలకు అబ్బుర పడి ఆ చిన్ని కృష్ణుని మరింత పరీక్షించ దలచి ఆయన లేగలనూ, గోప బాలురనూ మాయం చేసేస్తారు. అప్పుడు కృష్ణుడే వారందరి రూపాలనూ తాను ధరించి  వారి వారి ఇళ్ళకు చేరుకుంటాడు. అలా సృష్టికి ప్రతిసృష్టి చేసి తన ఉనికితో అందరికీ మరింత ఆనందం కలుగ చేస్తాడు ఆ సర్వాంతర్యామి. ఒక సంవత్సరం గడిచింది. తన మూఢత్వంతో తానే విష్ణు మాయకు వశుడయ్యానని గ్రహించిన బ్రహ్మ నాల్గు ముఖాలతోనూ స్వామిని ఇలా స్తుతించారు: 
                                            
శంపాలతిక తోడి జలదంబు కైవడి మెరుగు టొల్లియ తోడి మేనివాని
కమనీయ మృదులాన్న కబళ వేత్ర విషాణ వేణు చిహ్నంబులు వెలయువాని
గుంజా వినిర్మిత కుండలంబుల వాని శిఖిపింఛ వేష్టిత శిరము వాని
వన పుష్ప మాలికా వ్రాత కంఠము వాని నలిన కోమల చరణముల వాని
గరుణ గడలు కొనిన కడగంటి వాని గో
పాలబాలు భంగి బరగు వాని
నగు మొగంబు వాని నను గన్న తండ్రిని
నిను భజింతు మ్రొక్కి నీరజాక్ష!   


భావం: మెరుపు తీగతో కూడిన మేఘం వలె శరీరం బంగారు రంగు పట్టు పచ్చడపు ఉత్తరీయంతో కూడిన నల్లని దేహంతో ప్రకాశిస్తున్నది. చేతిలో ఉన్న చలిది ముద్ద మృదువుగా, అందంగా ఉండగా, వెదురు కర్ర, కొమ్ము బూర, మురళి మొదలైన వాటితో ప్రకాశిస్తూ ఉన్న వానిని, గురిగింజలతో చేయబడిన కుండలాలు, శిరస్సుపై చుట్టుకొనబడిన నెమలి పింఛం, అడవి పువ్వుల మాలికతో అలంకరించబడిన కంఠం, తామర పువ్వుల వలె సున్నితములై ఎంతో అందంగా ఉన్న పాదాలు, దయా రసం పొంగి పారుతూ చూస్తున్న కడకంటి చూపును, గోపాల బాలుని రూపాన్ని బ్రహ్మ స్తుతిస్తూ ఉంటే ఆయనను చూసి నవ్వుతున్న బాలకృష్ణుని ముఖం చాలా రమణీయంగా ఉంది. కమల దళాల వంటి కన్నులు గల నన్ను కన్న తండ్రివైన శ్రీహరీ ! ఇప్పుడు నిన్ను గుర్తించాను. నీకు మ్రొక్కి నిన్ను సేవించుకుంటున్నాను.      

నను మన్నించి భవజ్జనంబులకు నానందము నిండించు నీ
తను రూపంబిదె నా మనంబున కచింత్యంబయ్యె, నీ యుల్లస
ద్ఘన విశ్వాకృతి నెవ్వడోపు? నెరుగం గైవల్యమై యొప్పు నా
త్మ నివేద్యంబగు నీదు వైభవము చందం బెట్టిదో ఈశ్వరా!


భావం: ఈశ్వరా! నన్ను అనుగ్రహించు. నీ జనులకు అందరకూ ఆనందం నిండించే నీ ఈ చిన్న రూపమే నా మనస్సుకు ఊహించడానికి సాధ్యం కాకపోయింది. నీవు ఉల్లాసంతో ధరించిన మహా విశ్వ రూపాన్ని తెలుసుకోవడానికి సమర్థులు ఎవ్వరూ లేరు.  నీ రూపం నీ రూపమే. నాలో "నేను" గా నున్న నీకు మాత్రమే తెలియదగిన నీ వైభవం ఎంత విశేషమైనదో ఎవరికిని తెలియదు.     

విఙ్ఞాన విధము లెరుగక
తద్ ఙ్ఞులు నీవార్త చెప్ప తను వాఙ్ఞనముల్
యఙ్ఞేశ! నీకు నిచ్చిన
యఙ్ఞులు నిను బట్టి గెలుతు రజితుడవైనన్


భావం: యఙ్ఞ కర్తవై ఒప్పునట్టి ఓ స్వామీ! నీవు అఙ్ఞానుల చేత తెలియుటకు అలవి కాని వాడివైనా, విఙ్ఞానము గల మహనీయులు నీ స్వరూపము ఇట్టిది, అట్టిది అని బోధించగా, విని, మనోవాక్కాయములను నీకు సమర్పించి వర్తించే మూఢులు, నీవు తెలుసుకొనలేని వాడవైనా కూడా నిన్ను తెలుసుకొని బ్రహ్మానంద సముద్రంలో ఓలలాడుతుంటారు. 

శ్రేయములు గురియు భక్తిని
జేయక కేవలము బోధ సిద్ధికి దపముం
జేయుట విఫలము, పొల్లున
నాయము సేకురునె తలప నధికంబైనన్


భావం: భక్తి అనేది సర్వ శుభాలనూ వర్షిస్తుంది. అటువంటి శక్తిని వదిలి పెట్టి కేవలం ఙ్ఞానం కోసం తపస్సు చెయ్యడం వ్యర్థం. ఎంత ఎక్కువగా కూడబెట్టినా బియ్యం పైన ఉండే ఊక వలన ఏమి ఆదాయం వస్తుంది?  

జల చర మృగ భూసుర నర,
కులముల జన్మించితీవు కుజనుల జెరుపం
జెలిమిని సుజనుల మనుపను
దలపోయగ రాదు నీవిధంబులనంతా!


భావం: ఆది, అంతం లేని ఓ మహానుభావా! నీవు దుర్మార్గులను శిక్షించాడానికీ, సజ్జనులను ప్రేమతో రక్షించడానికీ జల చరములుగా (మత్స్యావతారము), మృగములుగా (వరాహావతారము), బ్రాహ్మణులుగా (వామన, పరశు రామ), సాధారణ మానవులుగా (శ్రీ రామ కృష్ణావతారములను) ఎన్నో అవతారాలు ఎత్తావు. నీ మార్గాలు బహు విధాలుగా ఉంటాయి. వాటిని ఈ విధాలుగా ఉంటాయని ఊహించడం సాధ్యం కాదు. నీ వలెనే నీ మార్గాలు కూడా అనంతాలే.    

ఏలా బ్రహ్మ పదంబు? వేదములకున్ వీక్షింపగా రాని ని
న్నీ లోకంబున నీ వనాంతరమునం దీ మందలో గృష్న యం
చాలాపాది సమస్త భావములు నీ యందే సమర్పించు నీ
వ్రేలం దొక్కని పాదరేణువులు పై వేస్టించినం చాలదే? 


భావం: ఈ భూలోకంలో, ఈ అడవిలో, ఈ గొల్ల వారి ఇండ్లలో సంచరించేవాడవు, వేదముల చేత కూడా ఇలాంటి వాడు అని విశదంగా తెలుసుకోవడానికి అలవి కాని వాడివి అయిన నిన్ను కృష్ణా! రా అని నీతో ముచ్చట్లు ఆడటం,నిన్ను చూడటం, నీ మాటలు వినడం మొదలైన పనులకు కారణాలైన పదహారు ఇంద్రియాలకూ రాజైన మనస్సును అనన్య భక్తితో నీయందే చేర్చిన ఈ గోపకులలో ఒక్కని కాలి దుమ్ము నలుసులు మీద సోకేటట్లు మెలిగినా చాలును. అంతకంటే బ్రహ్మ అనే ఒక అధికార స్థానము పొంది ఉండుట యేలా? అది హెచ్చు విషయమే కాదు.