Tuesday, February 7, 2017

దక్షిణా మూర్తి స్తుతి

వీరభద్రునిచే దక్ష యఙ్ఞ వినాశనం చేయబడిన అనంతరం దేవతలంతా కైలాసానికి వెళ్ళి ఆ ఙ్ఞాన స్వరూపుడైన శివావతారాన్ని చూచి స్తుతిస్తారు.

                               

ఉజ్జ్వలంబయి శతయోజనంబుల పొడవొగి పంచ సప్తతి యోజనముల
పరపును గల్గి యేపట్టున దరుగని నీడ శోభిల్ల నిర్ణీతమగుచు 
పర్ణ శాఖా సమాకీర్ణమై మాణిక్యముల బోలగల ఫలముల దనర్చి 
కమనీయ సిద్ధయోగ క్రియామయ మయి అనఘ ముముక్షు జనాశ్రయంబు
భూరి సంసార తాప నివారకంబు
నగుచు తరు రాజమనగ బెంపగ్గలించి
భక్త జనులకు నిచ్చలు ప్రమద మొసగ
వలయు సంపదలందు నా వటము వటము.
భావం: సౌగంధిక వనానికి సమీపంలో దేవతలు ఒక మర్రి చెట్టును చూసారు. ఎంతో ఉజ్జ్వలంగా ఉండి వంద యోజనాలు పొడవు కలిగినది, డెబ్బది ఐదు యోజనాలు విరివి కలిగినది, నీడ సందు లేకుండా అంతటా నిండి ఆకులతో, కొమ్మలతో అలరారుతూ మాణిక్యాలకు సాటి వచ్చే పండ్లతో నిండి ఉన్నది. సిద్ధయోగ క్రియకు ఆలవాలమై; దోష రహితమై, మోక్షం కోరే వారికి ఆశ్రయమై అలరారుతున్నది. సంసార తాపాన్ని తొలగించేది, భక్తులకు ఆనందం కలిగించే ఐశ్వర్యాలకు పుట్టినిల్లు అయిన గొప్ప మాను కలిగినది అయినట్టి మర్రి వృక్షాన్ని వారు దర్శించారు.     

ఇద్ధ సనందాది సిద్ధ సంసేవితు శాంతి విగ్రహుని వాత్సల్య గుణుని 
కమనీయ లోక మంగళ దాయకుని శివు విశ్వబంధుని జగద్వినుత యశుని
గుహ్యక సాధ్య రక్షో యక్ష నాథ కుబేర సేవితుని దుర్వార బలుని
నుదిత విద్యా తపో యోగ యుక్తుని బాలచంద్ర భూషణుని మునీంద్రనుతుని
తాపసాభీష్టకరు భస్మ దండలింగ 
ఘన జటాజినధరుని భక్త ప్రసన్ను
వితత సంధ్యాభ్ర రుచి విడంబిత వినూత్న
రక్తవర్ణు సనాతను బ్రహ్మ మయుని
భావం: ప్రసిద్ధులైన సనందుడు మొదలైన సిద్ధులు సేవించునట్టివాడును, శాంత మూర్తివలె ఉన్నవానిని, వాత్సల్య గుణం కలవానిని, లోకాలకు శుభం కలిగించేవానిని, విశ్వానికి చుట్టమైన వానిని, జగత్తు పొగడే కీర్తి కలవానిని; గుహ్యకులు, సాధ్యులు, రాక్షసులు, యక్షరాజైన కుబేరుడు మున్నగు వారిచేత సేవింపబడేవానిని, ఎదురులేని శక్తి సామర్థ్యాలు కలవానిని, విద్యతో, తపస్సుతో, యోగంతో కూడినవాడు, జటాజూటంలో చంద్రరేఖను అలంకరించుకున్నవాడు, మునీంద్రులు స్తుతించేవాడు, తపోధనుల కోర్కెలను తీర్చేవానిని, విభూతినీ, దండమును, జడలను, గజ చర్మమును ధరించిన వానిని, భక్తులను అనుగ్రహించే వానిని, సంధ్యాకాలంలో మేఘకాంతిని పోలిన నవనవారుణ ప్రభలతో వెలిగే వానిని, శాశ్వతుడు, బ్రహ్మ స్వరూపుడూ అయిన వానిని దేవతలు దర్శించారు.       

అంచిత వామపాదాంభోరుహము దక్షిణోరు తలంబున నొయ్య నునిచి 
సవ్య జానువు మీద సవ్య బాహువు సాచి వలపలి ముంజేత సలలితాక్ష 
మాలిక ధరియించి మహనీయ తర్క ముద్రాయుక్తుడగుచు చిత్తంబులోన 
నవ్యయంబయిన బ్రహ్మానంద కలిత సమాధి నిష్టుడు వీత మత్సరుండు
యోగ పట్టాభిరాముడై యుచిత వృత్తి
రోష సంగతి బాసి కూర్చున్న జముని
యనువునను దర్భ రచిత బ్రుస్యాసనమున
నున్న ముని ముఖ్యు నంచిత యోగ నిరతు 
భావం: కుడి తొడపై ఎడమ కాలు మోపి, ఎడమ మోకాలిపై ఎడమ చేయి చాచి కూర్చున్న వానిని, కుడిముంజేతిలో జపమాల ధరించి ఉన్న వానిని, మహనీయమైన ధ్యాన ముద్ర ధరించి బ్రహ్మానందంతో నిండిన మనస్సు కలవాడై సమాధి నిష్ఠలో ఉన్న వానిని, యోగ పట్టంతో ఒప్పుతున్న అనురాగ మూర్తివలే ఉన్న వానిని, కోపం విడిచిపెట్టి కూర్చున్న యముని వలె దర్భాసనం మీద కూర్చున్న వానిని, యోగనిమగ్నుడై ఉన్నవానిని, ఆఢ్యుని, అభవుడైనవానిని, అహిభూషణుని, ఆర్తజన పోషణుని-కరుణా సముద్రుని రుద్రుని దేవతలంతా చూసారు.  

అప్పుడు బ్రహ్మ శివునితో ఇలా పలికారు:

జగములకు నెల్ల యోనిబీజంబులైన
శక్తి శివ కారణుండవై జగతి నిర్వి
కార బ్రహ్మంబ వగు నిన్ను గడగి "విశ్వ
నాథు" గా నెరిగెద నామనమున నభవ!
భావం: ఓ మహేశ్వరా! లోకాలకన్నింటికీ ఉత్పత్తి స్థానం అయిన శక్తివి నీవే. జగత్తులకన్నింటికీ బీజమైన శివుడవు నీవే. నీవు నిర్వికార పరబ్రహ్మవు. నిన్ను విశ్వనాథునిగా మనస్సులో తెలుసుకున్నాను. 

సమత నది గాక తావకాంశంబులైన
శక్తి శివ రూపముల క్రీడ సలుపు దూర్ణ
నాభి గతి విశ్వ జనన వినాశ వృద్ధి 
హేతుభూతుండ వగుచుందు వీశ! రుద్ర!
భావం: ఓ రుద్రా! ఈశ్వరా! నీవు నీ సమాంశములైన శివ శక్తి స్వరూపాలతో క్రీడిస్తావు. సాలెపురుగు వలే విశ్వ సృష్టికి, వృద్ధికీ, వినాశనానికీ నీవే హేతువు అవుతుంటావు. 

అనఘ! లోకంబులయందు వర్ణాశ్రమ సేతువులనగ ప్రఖ్యాతినొంది
బలిసి మహాజన పరిగృహీతంబులై యఖిల ధర్మార్థ దాయకములై
వేదంబులును మరి వృద్ధినొందించుట కొరకునై నీవు దక్షుని నిమిత్త
మాత్రుని చేసి య మ్మఖము గావించితి వటుగాన శుభమూర్తివైన నీవు 
గడగి జనముల మంగళ కర్ములైన
వారి ముక్తి, నమంగళాచారులైన
వారి నరకంబు, నొందింతు భూరి మహిమ, 
భక్త జన పోష రాజిత ఫణి విభూష!
భావం: ఓ భక్త జన పోషణా! పన్నగ రాజి భూషణా! లోకాలలో వర్ణాశ్రమాచారాలను వేదాలు నిర్ణయిస్తాయి. గొప్ప వారి చేత వేదాలు గౌరవింపబడతాయి. సర్వ ధర్మార్థాలనూ ప్రసాదించునట్టి వేదాలను వృద్ధి చేయటం కోసం నీవు దక్షుణ్ణి నిమిత్త మాత్రునిగా చేసి ఆ యఙ్ఞం చేయించావు. నీవు మంగళ స్వరూపుడవు. నీ మహిమ చేత శుభ కర్మలు చేసే వారికి ముక్తిని, అశుభ కర్మలు చేసేవారికి నరకాన్ని కలిగిస్తావు.    
   

  

2 comments:

  1. T-Bone Bone Treatment for Bone Trauma
    T-Bone Bone 2019 ford edge titanium for sale Treatment for titanium bike Bone Trauma · T-Bone Bone Treatment ford titanium for Bone Trauma · Bone Surgery For Bone Trauma · Bone edc titanium Surgery For Bone urban titanium metallic Trauma.

    ReplyDelete