Thursday, February 2, 2017

కుంతీ దేవి చేసిన శ్రీకృష్ణ స్తుతి

శ్రీకృష్ణుడు ఉత్తరా గర్భస్థ శిశువును బ్రహ్మశిరోనామకాస్త్రం బారి నుండి రక్షించిన అనంతరం ఎంతో సంతోషంతో కుంతీ దేవి ఆ పరమాత్ముని ఇలా విశేషంగా స్తుతిస్తుంది.  

                                         


పురుషుండాధ్యుడు ప్రకృతికి
బరుడవ్యయు డఖిల భూత బహిరంతర్భా
సురుడును లోక నియంతయు
పరమేశ్వరుడైన నీకు ప్రణతులగు హరీ!
భావం: కృష్ణా! నీవు పురాణ(ఆది) పురుషుడవు. సర్వ జగన్నియంతవు. దేవదేవుడవు. ప్రకృతికి అవ్వలివాడవు, అనంతుడవు. సమస్త ప్రాణులలో లోపల, వెలుపల వెలుగుతుండే వాడవు. విశాల విశ్వాన్ని నడిపే పరమేశ్వరుడవైన నీకు నమస్కారాలు. 

తనయులతోడ నే దహ్యమానంబగు జతు గృహంబందును జావకుండ
గురు రాజు వెట్టించు ఘోర విషంబుల మారుత పుత్రుండు మడియకుండ
ధార్తరాష్ట్రుడు సముద్గతి చీర లొలువంగ ద్రౌపది మానంబు దలగకుండ
గాంగేయ కుంభజ కర్ణాది ఘనులచే నా బిడ్డలని లోన నలగకుండ
విరటు పుత్రిక కడుపులో వెలయు చూలు
ద్రోణ నందను శర వహ్ని ద్రుంగకుండ
మరియు రక్షించితివి పెక్కు మార్గములను
నిన్ను నేమని వర్ణింతు నీరజాక్ష? 
భావం:భగ భగ మండుచున్న లక్క ఇంట్లో నా బిడ్డలు, నేను కాలి భస్మమైపోకుండా కాపాడావు. కురురాజు ధుర్యోధనుడు పెట్టించిన ఘోరమైన విషాన్నం తిని చనిపోకుండా వాయుదేవుని పుత్రుడైన భీమసేనుణ్ణి రక్షించావు. దురహంకారంతో త్రుళ్ళి పడుతూ దుశ్శాసనుడు ద్రుపద రాజ పుత్రి కట్టు బట్టలు ఒలుస్తున్న కష్ట సమయంలో నా కోడలు ద్రౌపది అవమానం పాలు కాకుండా అడ్డుకున్నావు. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు మొదలైన యోధాను యోధుల వల్ల పోరాటంలో చేటు వాటిల్లకుండా నా బిడ్డలను ఆదుకున్నావు. మళ్ళీ ఇప్పుడు గురుపుత్రుడు అశ్వత్థామ ప్రయోగించిన శరాగ్ని జ్వాలలలో మ్రగ్గిపోకుండా విరటుని పుత్రిక అయిన ఉత్తర కడుపులోని కసుగందుని రక్షించి ఇన్ని విధాలుగా నన్నూ, నా బిడ్డలనూ కటాక్షించిన పుండరీకాక్షా! నిన్ను యే విధంగా కొనియాడేది!     

బల్లిదుండగు కంసుచేతను బాధనొందుచు నున్న మీ
తల్లి గాచిన భంగి గాచితి ధార్త రాష్ట్రుల చేత నే
దల్లడంబున జిక్కకుండగ దావకీన గుణవ్రజం
బెల్ల సంస్తుతి సేసి చెప్పగ నెంత దాన జగత్పతీ!  
భావం: జగన్నాథా! బలవంతుడైన కంసుని చేత బాధలు పొందుతున్న మీ తల్లి దేవకీదేవిని రక్షించినటుగా, కౌరవులు పెట్టిన కష్టాలకు లోనుగాకుండా నన్ను కాపాడావు. ఆపన్న ప్రసన్నుడవైన నీయొక్క అనంతకోటి గుణాలు అభివర్ణించడానికి నేనెంతదాన్ని?    
       
జననము నైశ్వర్యంబును
ధనమును విద్యయును గల మదచ్ఛన్ను లకిం
చన గోచరుడగు నిన్నున్
వినుతింపగ లేరు నిఖిల విబుధ స్తుత్యా!  
భావం: గొప్ప వంశంలో జన్మించామనీ, భోగ భాగ్యాలు ఉన్నాయనీ, ధనం సంపాదించామనీ, విద్యావంతులమనీ మదాంధులైన మానవులు నిఖిల దేవతా సంస్తూయమానుడివైన నిన్ను ప్రస్తుతింపలేరు. నిష్కాములైన భక్తులకు మాత్రమే నీవు గోచరించేవు.    

కోపముతోడ నీవు దధి కుంభము భిన్నము సేయుచున్నచో
గోపిక ద్రాట గట్టిన వికుంచిత సాంజన భాష్పతోయ ధా
రా పరిపూర్ణ వక్త్రము గరంబుల బ్రాముచు వెచ్చ నూర్చుచుం
బాపడవై నటించుట కృపాపర! నామది చోద్యమయ్యెడిన్.  
భావం: దయామయా! చిన్నతనంలో ఒక మాటు నీకు కోపం వచ్చి పెరుగుకుండ బద్దలు కొడుతుండగా మీ అమ్మ యశోద నిన్ను త్రాళ్ళతో గట్టిగా కట్టివేసింది. అప్పుడు నీవు ముఖం చిన్నబుచ్చుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ వెచ్చనూరుస్తూ కంటి నుండి కారిన భాష్ప జలముతో నిండిన ముఖము గలవాడవై చేతులతో ముఖము రుద్దుకుంటూ పసిపాపని లాగా నటించావు. ఆ నీ బాల లీల నాకు ఎంతో వింతగా తోచింది. 

మలయమున చందనము క్రియ 
వెలయగ ధర్మజుని కీర్తి వెలయించుటకై
ఇలపై నభవుడు హరి యదు
కులమున నుదయించె నండ్రు కొంద రనంతా!
భావం: అనంతా! ధర్మ నందనుని యశస్సు నలుదెసలా ప్రసరింప చేయడానికి మలయ పర్వతం మీద చందన వృక్షం చందాన పుట్టుక ఎరుగని పురుషోత్తముడు యదువంశంలో జన్మించాడని కొందరంటారు.    

వసుదేవ దేవకులు తా, వసగతి గత భవమందు ప్రార్థించిన సం
తసమున పుత్రత నొందితి, వసురుల మృతి కంచు, కొంద రండ్రు మహాత్మా!
భావం: పూర్వ జన్మంలో అపూర్వమైన తపస్సు చేసి నిన్ను తమ పుత్రుడు కమ్మని దేవకీ వసుదేవులు ప్రార్థించగా సంతోషంతో నీవు వారికి పుత్రుడవుగా జన్మించావని, జగత్తు యొక్క క్షేమం కోరి రాక్షస సంహారం కోసం ఆ పుణ్య దంపతులకు పుత్రుడవై పుట్టావని కొందరు అంటున్నారు.  

జలరాశి నడుమ మునిగెడు 
కలము క్రియన్ భూరి భార కర్శిత యగు నీ
యిల గావ నజుడు గోరిన
గలిగితి వని కొందరండ్రు గణనాతీతా!
భావం: నట్టనడి సముద్రంలో మునిగిపోయే నావలాగా భరింపరాని బరువుతో కృంగి కూలారుతున్నా భూమండలాన్ని ఉద్ధరించటం కోసం బ్రహ్మ దేవుడు ప్రార్థించగా అవతారం ఎత్తావని మరికొందరు అంటారు.    

మరచి యఙ్ఞాన కామ్య కర్మముల దిరుగు 
వేదనాతురులకు దన్నివృత్తి చేయ 
శ్రవణ చింతన వందనార్చనము లిచ్చు
కొరకు నుదయించితండ్రు నిన్ కొందరభవ!
భావం: పుట్టుక లేనివాడా! ఈ ప్రపంచంలో ఆత్మ స్వరూపం యొక్క అఙ్ఞానము, దాని వలన కామములు, వాటి వలన కర్మములు అనే చక్రంలో తగులుకొని కర్తవ్యం విస్మరించి అఙ్ఞానంతో కొట్టుమిట్టాడుతున్న ఆపన్నుల ఆర్తిని పోగొట్టి వారికి శ్రవణం, చింతనం, వందనం, అర్చనం మొదలైన భక్తి మార్గాలను ప్రసాదించే నిమిత్తం నీవు ప్రభవించావని కొందరి అభిప్రాయం.   

నిను చింతించుచు పాడుచుం పొగడుచున్ నీ దివ్య చారిత్రముల్
వినుచుం చూతురు గాక లోకులితరాన్వేషంబులం జూతురే
ఘన దుర్జన్మ పరంపరా హరణ దక్షంబై మహాయోగి వా
గ్వినుతంబైన భవత్పదాబ్జ యుగమున్ విశ్వేశ! విశ్వంభరా! 
భావం: ఓ విశ్వేశ్వరా! విశ్వంభరా! ఎల్లప్పుడూ నిన్నే ధ్యానిస్తూ, నీ లీలలే గానం చేస్తూ, నిన్నే ప్రశంసిస్తూ, నీ పవిత్ర చరిత్రలే ఆకర్ణిస్తూ ఉండే వారు మాత్రమే దురంతాలైన జన్మ పరంపరలను అంతం చేసేవీ, పరమ యోగులు పవిత్ర వాక్కులతో ప్రస్తుతించేవీ అయిన నీ పాదపద్మాలను దర్శించగలుగుతారు. అంతే కానీ ఇతర ప్రయత్నాలేవీ వారికి ఫలితాన్ని ఇచ్చేవి కావు.    

యాదవులందు పాండు సుతులందు నధీశ్వర! నాకు మోహ వి
చ్ఛేదము సేయుమయ్య ఘన సింధువు చేరెడి గంగ భంగి నీ
పాద సరోజ చింతనముపై అనిశంబు మదీయ బుద్ధి న
త్యాదర వృత్తితో గదియు నట్లు చేయగదయ్య ఈశ్వరా! 
భావం: ఓ జగన్నాయకా! నామ రూపాత్మకమగు జగత్తుకు అధిష్ఠానమైనవాడా! ఆత్మీయులైన యాదవుల మీదా, పాండవుల మీదా నాకున్న అనురాగ బంధాన్ని త్రెంపివెయ్యి. నిరంతరము మహా సముద్రంలో కలిసే గంగా తరంగిణిలాగా నా బుద్ధి గొప్ప ఆదరంతో సర్వదా అవిచ్ఛిన్నంగా నీ చరణ సరోజ సంస్మరణంలోనే సంలగ్నమయ్యేటట్లు చేయి.    

శ్రీకృష్ణా!యదుభూషణా! నరసఖా! శృంగార రత్నాకరా!
లోకద్రోహి నరేంద్ర వంశ దహనా! లోకేశ్వరా! దేవతా
నీక బ్రాహ్మణ గోగణార్తి హరణా! నిర్వాణ సంధాయకా! 
నీకున్ మ్రొక్కెద ద్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధీ!
భావం: శ్రీ కృష్ణా! యదువంశమునకు ఆభరణము వంటివాడా! విజయమునకు సఖుడవైన వాడా! శృంగార రస రత్నాకరా! జగత్కంటకులైన రాజుల వంశాలను దహించి వేసే జగదీశ్వరా! ఆపన్నులైన అమరులనూ, అవనీ సురులనూ, ఆవుల మందలకు కలిగిన బాధలను పోగొట్టి కాపాడే స్వామీ! మోక్షాన్ని ప్రసాదించే ప్రభూ! పరిపూర్ణ కరుణా పయోనిధివై నా భవ బంధాలు ఖండించు, నీకు నమస్కరిస్తున్నాను.  




No comments:

Post a Comment