పరీక్షిన్మహారాజు శుక మహా మునితో "స్వామీ! వేదములు త్రిగుణ రహితుడైన పరమాత్మను యే విధంగా ప్రతిపాదించును?" అని ప్రశ్నించగా, శుకుడు శృతులలో ప్రతిపాదింపబడిన భగవత్ తత్వాన్ని వివరించినవే ఈ శృతి గీతలు. భగవంతుని నిశ్శ్వాస వలననే పుట్టిన వేదములు ప్రళయ కాలమునందు యోగనిద్రను పొందిన ఆ పరమాత్మను యే విధంగా స్తుతిస్తాయో నారదుడు నారాయణుని అడుగగా, ఆయన పూర్వం సనక సనందనాదుల చర్చలో సనందుడు చెప్పిన తత్వాన్ని నారదునకు చెప్పెను. దానినే ఇప్పుడు శుకుడు పరీక్షిత్తుకు చెప్పదొడగెను.
జయ జయ హరి! దేవ! సకల జంతువులకు ఙ్ఞానప్రదుండవు గాన వారి
వలన దోషంబులు గలిగిన సుగుణ సంతానంబుగా గొని ఙ్ఞాన శక్తి
ముఖ్య షడ్గుణ పరిపూర్ణ జేసి మా యాత్మ విశిష్టుండవగుచు గార్య
కారణాత్మకుడవై కడగి చరించుచు నున్న నీయందు బయోరుహాక్షా!
తివిరి యామ్నాయములుప్రవర్తించు గాన
ప్రకట త్రిగుణాత్మకంబైన ప్రకృతి తోడి
యోగ మింతయు మంపవే! యోగిమాన
సాంబు జాత మధువ్రత! యని నుతించి
భావం:ఓ విష్ణు దేవా! నీకు జయమగు గాక! తామరల వంటి కన్నులు కలవాడవును, యోగీశ్వరుల మనసులనెడు కమలములందు తుమ్మెదల వలె ఆసక్తితో వసించుచున్నట్టి వాడవును, ప్రళయ కాలమున సకల లోకములను నీలో లయింప చేసుకొను వాడవును అయిన ఓ స్వామీ! నీవు సర్వోత్కృష్టుడవు.సకల జీవులకూ ఙ్ఞానాన్ని ప్రసాదించేవాడవు కాబట్టి నీవే ఆ ప్రాణముల వలన కలిగిన దుర్గుణములను కూడా సుగుణములుగానే ఎంచి రక్షించునట్టి వాడవు; సర్వఙ్ఞత్వము, సర్వేశ్వరత్వము, సర్వ నియంతృత్వము, సర్వ స్రష్టత్వము, సర్వాంతర్యామిత్వము, సర్వ భోక్తృత్వము అనెడు ఆరు గుణముల చేతను నిండుకొన్న వాడవై; మాయా సంబంధమగు జీవాత్మలను మీరినవాడవై ఆయా ప్రాణుల్లో ఆత్మ రూపంతో నీవు ఉంటావు. ప్రపంచ స్వరూపుడవు నీవే, ప్రపంచ సృష్టికి కారణములైన అవ్యక్త మహదహంకార పంచ తన్మాత్ర, పంచభూత స్వరూపుడవు నీవే. రజస్తమో గుణాలతో కూడిన కార్య కారణాత్మకుడవై నీవు వర్తిస్తావు. అటువంటి నీలోనే సకల వేదాలూ ప్రవర్తిస్తాయి. నీ స్వరూపమైన మాకు సత్వ రజస్తమో గుణాలతో కూడిన మూల ప్రకృతితో ఉన్న సంబంధాన్ని సంపూర్తిగా ఛేధించు.
పరమ విఙ్ఞాన సంపన్నులైనట్టి యోగీంద్రులు మహిత నిస్తంద్ర లీల
బరిదృశ్యమానమై భాసిల్లు ని మ్మహీ పర్వత ముఖర ప్రపంచమెల్ల
బరగ బ్రహ్మ స్వరూపము గాగ దెలియుదు రెలమి నీవును జగద్విలయ వేళ
నవశిష్టుడవు గాన ననఘ! నీయందు నీ విపుల విశ్వోదయ విలయములగు
ఘట శరా వాదులగు మృద్వికారములు మృ
దాత్మకంబైన యట్లు పద్మాయతాక్ష!
తవిలి కారణ రూపంబు దాల్చి లీల
గడగు నీయందు బుద్ధి వాక్కర్మములను
భావం: ఓ స్వామీ! అంతే కాక అనుభవ జన్య ఙ్ఞానము గల బ్రహ్మవేత్తలైన పరమ యోగీశ్వరులు మిక్కిలి జాగ్రత్త గల కార్యములతో; కానవచ్చుచున్న స్థావర జంగమాత్మకమైన భూమి, పర్వతాలు మొదలైన వాటితో కూడి ఉన్న ఈ ప్రపంచాన్ని బ్రహ్మ స్వరూపంగానే భావిస్తారు. నీవు కూడా ప్రళయ కాలంలో సర్వ ప్రపంచములు లయించునప్పుడు ఒక్కడవే నశింపక మిగిలి ఉంటావు. కుండలూ, మూకుళ్ళూ మొదలైనవన్నీ మట్టితో ఏర్పడి మట్టి కంటే వేరుగా ఉన్నట్లు కనిపించినా మరల మట్టిలోనే కలిసిపోవునట్లు ఈ విశ్వం యొక్క పుట్టుకా, నాశమూ రెండూ నీ వల్లనే జరుగుతాయి. అనగా నీవే జగత్స్వ్రూపుడవై కానబడి మరల ఆ రూపమును నీయందే లయము చేస్తావు. ఓ కమలాక్షా! ఈ సమస్త విశ్వానికి నీవే కారణ భూతుడవు అయినందున బ్రహ్మ రూపము పొందునట్టి నిన్ను మనసు ధ్యానించునట్లును, వాక్కు పొగడునట్లు, శరీరము నీకు సేవ చేయునట్లు అనుగ్రహింపుము.
అలవడ జేయుచు నుందురు బలువై ఇల బెట్టబడిన పదవిన్యాసం
బులు పతన కారణముగా, నలవున సేవించుచును గృతార్థులు నగుచున్.
భావం: యోగీశ్వరులు విఙ్ఞాన సంపన్నులైన వారు ఇతర దేవతారాధన మున్నగునవి జన్మ కారణములని తెలిసికొని వదిలివేసి మనో వాక్కాయ కర్మలను నీయందే లగ్నం చేస్తారు. వారు జన్మం ఎత్తడాన్ని పతనానికి కారణంగా గ్రహించి త్రికరణ శుద్ధిగా సకల దేవతా స్వరూపుడవైన నిన్నే సేవిస్తూ కృతార్థులవుతారు.
లీలం ప్రాకృత పూరుష
కాలాదిక నిఖిలమగు జగంబుల కెల్లన్
మాలిన్య నివారకమగు
నీ లలిత కథా సుధాబ్ధినింగ్రుంకి తగన్
భావం: నీకు వినోదరూపమైన ప్రకృతి యొక్క సంబంధము కలిగి వర్తిల్లునట్టి ప్రాకృత పురుషులకు నిలయమై కాలస్వరూపమైన ఈ ప్రపంచంలో నీ మనోహర కథామృత సముద్రం నిఖిల పాపాలనూ నివారించే సామర్థ్యం కలది.
భరిత నిదాఘ తప్తుడగు పాంథుడు శీతల వారి గ్రుంకి దు
ష్కరమగు తాపమొందొరగు కైవడి సంసరణోగ్రతాపమున్
వెరవున బాయుచుండుదురు నిన్ను భజించు మహాత్మకుల్ జరా
మరణ మనోగుణంబుల క్రమంబున బాయుట సెప్ప నేటికిన్?
భావం: లోకమునందు బుద్ధిమంతులగు వారు తీవ్రమైన ఎండచేత బాధపడే బాటసారి చన్నీళ్ళ స్నానం చేసి తన పరితాపాన్ని పోగొట్టుకునే విధంగా, నిన్ను పూజించే మహాత్ములు సంసారమనే అధికమైన భయమును కలుగచేయునట్టి దుర్భర తాపాన్ని నిన్ను ఉపాసించటం అనే జలమును మునుగుట అనెడి ఉపాయము చేత నేర్పుతో తొలగించుకుంటారు. అట్లుండగా ఎల్లప్పుడు నిన్ను సేవించునట్టి పుణ్యాత్ములు ఇక ముసలితనము, మరణము అనే వాటిని క్రమంగా పోగొట్టుకొంటారన్న మాట ప్రత్యేకంగా చెప్పటం దేనికి?
అనయంబు దేహి నిత్యానిత్య సద్విలక్షణమున పంచకోశ వ్యవస్థ
నభివృద్ధి బొరయుచు నందులోపల నున్న ప్రాణాన్న బుద్ధి విఙ్ఞాన మయము
లను చతుష్కోశంబు లవ్వల వెలుగొందు నానందమయు డీవు గాన దేవ!
సురుచిర స్వప్రకాశుండవు నీ పరిగ్రహము కల్గుటం జేసి కాదె ప్రకృతి
మహదహంకార పంచతన్మాత్ర గగన
పవన తేజోంబు భూ భూత పంచకాది
కలిత తత్వముల్ బ్రహ్మాండ కార్య కరణ
మందు నెపుడు సమర్థంబు లగుట జూడ.
భావం: దుర్లభమైన మనుష్య దేహమును ధరించిన ప్రాణులు శాశ్వతము, అశాశ్వతము అనే ఈ రెండు లక్షణాల కంటే విలక్షణమైన పరబ్రహ్మ స్వరూపము చేతను; అన్న, ప్రాణ, మనో, ఙ్ఞాన, ఆనంద మయాలనే పంచకోశాల వల్ల వ్యష్టి, సమిష్టి దేహమును ధరించియును అబివృద్ధి పొందుతూ ఉంటాయి. ఈ పంచకోశాలలో చివరిదైన ఆనందమయ కోశమే స్వరూపంగా వెలుగునట్టి శుద్ధ స్వరూపము చేత నీవు స్వయం ప్రకాశుడవై వెలుగొందుతుంటావు. నీ అధీనంలో ఉన్నందువల్లనే కదా ఈ ప్రకృతీ, మహత్తు, అహంకారము; పంచతన్మాత్రలైన శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు; పంచభూతాలైన భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం మొదలైన పంచ మహా భూతాలు అను వానికి చేతనత్వము కలుగచేసి, వాని చేత బ్రహ్మాండమును పుట్టించి, అందు ప్రవేశించి వెలుగుతూ, ఈ సమస్త సృష్టి స్థితి లయ కార్యాలను సర్వ సమర్థంగా నిర్వహిస్తున్నావు.
కోరి శరీరులు భవదను
సారంబున నిహపరైక సౌఖ్యంబుల బెం
పారగ నందుచు నుందురు
ధీరజనోత్తములనంగ దివిజారి హరా!
భావం: ఓ రాక్షసులను నాశనము చేయునట్టి హరీ! నిన్ను అనన్య భక్తితో శ్రవణ మనన నిధి ధ్యాసలచేత భజిస్తూ బ్రహ్మ వేత్తలలో శ్రేష్ఠులై ఇహ పరలోక సౌఖ్యాలను కొరత లేక పొంది ధీరులని పేరెన్నిక గంటారు.
నిన్ను ననుసరింప నేరని కుజనులు
పవన పూర్ణ చర్మ భస్త్రి సమితి
యోజ జేయుచుందు రుచ్ఛ్వసనంబులు
బలసి యాత్మ దేహ భజను లగుచు
భావం: నీ తత్వం తెలిసి నిన్ను శ్రవణ మనన నిధి ధ్యాసముల చేత ఆరాధింపలేని బద్ధ జీవులు జీవాత్మ పరమాత్మలకు బేధం కల్పించి గాలితో నిండిన తోలు తిత్తి లాంటి చక్కగా ఉబ్బిన దేహం కలవారై శరీరం మీద మమకారంతో ఉచ్ఛ్వాశ నిశ్వాసాలు నింపుకుంటూ ఈ దేహాన్నే ఆత్మ అనే భావంతో భజిస్తూ ఉంటారు.
దేవ! కొందరు సూక్ష్మ దృక్కులైనట్టి మహాత్మకు లుదరస్థుడైన వహ్ని
గా మది దలతురు కైకొని మరికొంద రారుణులను పేర నమరు ఋషులు
లీల సుషుమ్న నాడీ మార్గ గతుడవై హృత్ప్రదేశమున జరించుచున్న
రుచి దహరాకాశ రూపిగా భావింతు రట్టి హృత్పద్మంబునందు వెడలి
వితత మూర్ధన్య నాడికా గతుల నోలి
బ్రహ్మ రంధ్రంబు ప్రాపించి పరమ పురుష!
సుమహితానందమయ పరంజ్యోతి రూపి
వైన నిను బొంది మరి పుట్ట రవని యందు
భావం: దేవదేవా! స్వయంప్రకాశుడవును, బ్రహ్మ విష్ణు రుద్ర మహేశ్వర సదాశివులనెడు పంచకర్తలను పంచకృత్యములందు నియమించు వాడవును, పురుషోత్తముడవు అయిన ఓ భగవంతుడా! వేదాంత శాస్త్రములందు చెప్పబడిన సంప్రదాయములైన ఉపాసనా మార్గములను అనుభవ జన్య ఙ్ఞానముల చేత ఎరిగిన సూక్ష్మ దర్శనులైన మహితాత్ములు నిన్ను నాభి స్థానమందలి మణిపూరక చక్రమున ఉండునట్టి జఠరాగ్ని స్వరూపునిగా భావిస్తారు. మరికొందరు అరుణులనబడే ఋషీశ్వరులు వినోదంగా సుషుమ్నా నాడీ మార్గంలో సంచరిస్తూ హృదయ ప్రదేశంలో గల అనాహత చక్రంలో పరమాకాశంలో సంచరించే సూక్ష్మాకార రూపంకలవాణ్ణిగా నిన్ను గ్రహిస్తారు. మరికొందరు బ్రహ్మ నిష్ఠులు ఆ విధమైన హృదయ పద్మం నుంచి వెలువడి ముక్కు రంధ్రముల యందలి మూర్ధన్య నాడి, అనగా ఇడా పింగళ మార్గము ద్వారా బ్రహ్మ రంధ్రం చేరుకుని సహస్రారమును పొంది ఆనందమయ పరంజ్యోతి స్వరూపుడవై వెలుగు నిన్ను చేరి నీయందు ఐక్యమై మునులు ముక్తులౌతారు. మళ్ళీ వారికి జన్మమంటూ ఉండదు.
అనఘ!దుర్గమమైన ఆత్మ తత్వంబు ప్రవర్తించు కొరకు దివ్యంబులైన
యంచిత రామకృష్ణాద్యవతారముల్ భజియించియున్న నీ భవ్య చరిత
మను సుధాంభోనిధి నవగాహనము సేసి విశ్రాంత చిత్తులై వెలయుచుండి
మోక్షంబు బుద్ధినపేక్షింప నొల్లరు మరియు గొందరు భవచ్చరణ పంక
జముల దగిలి పుణ్యతములైన హంసల
వడువు నొంది భాగవత జనముల
నొనరు వారు ప్రకట యోగిజన ప్రాప్య
మైన ముక్తిగోర రాత్మలందు.
భావం: పాపములు లేనివాడవైన ఓ స్వామీ! పొందశక్యము కానిదైన ఆత్మ తత్వమును ప్రవర్తిల్ల చేయుట కొరకు ప్రకృతి సంబంధములు కాని రామావతారము, కృష్ణావతారము మొదలగు అవతారములెత్తి వర్తించునట్టి నీ చరిత్రము పాల సముద్రము వలె స్వచ్ఛమును, మేర కానరానిదియు అయి ఉండగా అట్టి చరిత్రములను వినుట, పఠించుట, విచారించుట మొదలగు క్రియల యందు మునిగి తేలుచు నెమ్మది పొందిన మనసు గలవారు అగుచూ కొందరు మోక్షమును అపేక్షించక మెలగుచుందురు. మరికొందరు నీ పాద పద్మములను ఆరాధించుట యందు ఆసక్తి గలవారై మిక్కిలి పుణ్యాత్ములైన పరమహంసల వలె భగవంతుడవైన నిన్ను సేవించుచూ శుద్ధులగుదురు. అట్టి వారు ప్రసిద్ధములైన యోగముల వలన సిద్ధినొందిన యోగులకు పొంద తగినదైన మోక్షమును మనసులలో తలంపుకైన తలంపరు.
కొందరు నీ శరీరము లకుంఠిత భక్తి భవద్వశంబులై
చెందగ నీ పదాబ్జములు సేరి భజించుచు దత్సుఖాత్ములై
యుందురు కొందరీ తనువు లోలి ధరించి భవత్పదాబ్జముల్
పొందుగ గొల్వలేక నిల బుట్టుచు జచ్చుచు నుందు రవ్యయా!
భావం: ఎప్పుడును నాశము పొందక శాశ్వతమై ఉండునట్టి స్వామీ! కొందరు పొందరానిదైన మానవ దేహమును పొందిన మాత్రముననే ఆ దేహమును నీకు అధీనము చేసి సమస్త ప్రాణులకు అధీశ్వరుడవు నీవేయని తెలుసుకొని మిక్కుటమైన భక్తితో నీ చరణారవిందాలను సదా సేవిస్తూ పరమానందం చెందుతూ అందువలన కలిగిన సుఖాలను అనుభవిస్తూ ఉంటారు. మరికొందరు నీ పాద పద్మాలను భజింపలేక ఈ లోకంలో పుడుతూ చస్తూ ఉంటారు.
యమ నియమాది యోగ మహితాత్మకులైన మునీంద్రులున్ విరో
ధమున దలంచు చైద్య వసుధావర ముఖ్య నృపుల్ ఫణీంద్ర భో
గము లన నొప్పు బాహువులు కల్గిన నిన్ను భజించు గోపికల్
క్రమమును నేమునున్ సరియ కామె భవత్కృప కంబుజోదరా!
భావం: ఓ స్వామీ! యమ నియమములు మొదలైన యోగములు అభ్యసించి వాని వలన సిద్ధి పొందిన మునీశ్వరులును, శత్రు భావంతో నిన్ను తలపోసే శిశుపాలుడూ మొదలైన దుష్ట రాజన్యులూ, ఆలింగనాదుల చేత నిన్ను భక్తితో ఆరాధించే గోపికా స్త్రీలూ, ఎల్లప్పుడూ స్తుతి చేయునట్టి మేమూ నీ కృపకు సమానంగా పాతృలమవడంలో సందేహం లేదు. అనగా నీకు శతృవులు, మిత్రులు, సేవకులు అనువారు అందరునూ సమానమే గానీ హెచ్చు తగ్గులు చూపవు.
అరవిందాక్ష! భవత్స్వరూపమిల బ్రత్యక్షంబునం గాన నె
వ్వరికిం బోలదు శాస్త్రగోచరుండవై వర్తింతు వీ సృష్టి ముం
దర సద్రూపుండ వైన నీ వలననే ధాత్య్రాద్య మర్తుల్ జనిం
చిరి ని న్నంతకు మున్నెరుంగ గలమే చింతింపనే మచ్యుతా!
భావం: ఓ స్వామీ! నీ అసలైన స్వరూపమును వేదాంత శాస్త్రముల వలన తెలుసుకొన వలసిన వారమే కానీ ప్రత్యక్షంగా చూడటం ఎవరికీ సాధ్యం కాదు. నీవు శాస్త్ర గోచరుడవు. ఈ ప్రపంచ సృష్టికి పూర్వం నీవు ఎప్పుడును చెడని దివ్య స్వరూపము కలవాడవై వెలుగొందుతున్న పరమాత్మ స్వరూపుడవై ఉండి నీ వల్లనే బ్రహ్మాది దేవతలు ప్రభవించారు. నీవు ఏ రూపంలో ఉంటివో తెలుసుకొనుటకు మేము చాలము. అటువంటి నీ సచ్చిదానంద స్వరూపాన్ని మేము తెలుసుకోగలమా?
వనజాతాక్ష! భవత్పదాబ్జ యుగ సేవాసక్తులైనట్టి య
జ్జనముల్ మృత్యు శిరంబు దన్ని ఘన సంసారాంబుధిన్ దాటి పా
వనులై లోకములుం బవిత్రములుగా వర్తించుచున్ నిత్య శో
భనమై యొప్పెడి ముక్తి బొందుదురు శుంభద్వైభవోపేతులై
భావం: దేవా! నీ పాద కమలములను మిక్కిలి ఆసక్తితో కొలుచుట యందు నిరంతర నిమగ్నులైన వారు మృత్యువును జయించి, సంసారము అనే దరిలేని మహా సముద్రాన్ని అలక్ష్యంగా దాటి తరించి, లోకంలోని ప్రాణులను అన్నింటినీ పరిశుద్ధులు అగునట్లు మెలగుచు, జనన మరణ పరంపరలకు గురి కాక పవిత్రులై, లోకాలను పవిత్రం చేస్తూ ముక్తికి యోగ్యులై ప్రకాశిస్తారు.
మిము సద్భక్తి భజింప నొల్ల కిల దుర్మేధం ప్రవర్తించు నీ
చ మతివ్రాతము నేర్పునం బసుల బాశ శ్రేణి బంధించు చం
దమునం బెక్కగు నామ రూపముల చేతన్ వారి బంధించి దు
ర్గమ సంసార పయోధి ద్రోతువు దళత్కంజాత పత్రేక్షణా!
భావం: పూచిన తామర రేకుల వంటి కన్నులు గల శ్రీ కృష్ణా! ఎవరు నిను భక్తితో సేవించకుండా దుర్మదాంధులై భూమి యందు చరింతురో అట్టి నీచ బుద్ధి గల పామరులను పశువులను దామెన త్రాటితో వరుసగా కట్టి వేయునట్లు నానా విధ నామ రూప బేధముల చేత బంధించి సంసారము అనెడి సముద్రము నందు పడదోస్తావు.
మది దలపోయగ జల బు
ద్బుదములు ధర బుట్టి పొలియు పోలిక గల ఈ
త్రిదశాది దేహములలో
వదలక వర్తించు నాత్మ వర్గము నోలిన్.
భావం: జాగ్రత్తగా మనసులో ఆలోచించి చూడగా నీళ్ళలో బుడగలు పుట్టి నశించిపోయే విధంగా ఆత్మ సమూహం దేవతాదుల దేహాల్లో ప్రవర్తిస్తూ ఉంటుంది. అటువంటి శరీరాల్లో అంతరాత్మవై నీవు వర్తిస్తావు.
ప్రళయ వేళ నీవు భరియింతు వంతకు
గారణంబ వగుట కమలనాభ!
భక్త పారిజాత! భవ భూరి తిమిర ది
నేశ! దుష్ట దైత్య నాశ! కృష్ణ!
భావం: బొడ్డునందు బ్రహ్మకు జన్మ స్థానమైన తామర కలవాడవును, భక్తులకు కల్ప వృక్షము వలె కోరిన కోరికల నిచ్చు వాడవును, పుట్టుకలు అనే మేర లేని చీకటిని పోగొట్టుట యందు సూర్యుడవగు వాడవును, చెడ్డవారైన రాక్షాసులనెల్లను నశింప చేయు వాడవును అయిన ఓ స్వామీ! నీళ్ళలో పుట్టి అణగిపోవు బుడగల వలె భూమియందు పుట్టుచు నశించుచుండునట్టి ఎల్ల దేహ ధారుల సమూహమును సృష్టి స్థితి లయ హేతుభూతుడవైన నీవు ప్రళయ సమయంలో వాటిని నీలో లీనం చేసుకుంటావు.
అనఘ! జితేంద్రియ స్ఫురణులయ్యును జంచలమైన మానసం
బను తురగంబు బోధ మహితాత్మ వివేకపు నూలి త్రాట న
ల్లన గుదియంగ బట్టను దలంచుచు ముక్తి కుపాయ లాభ మే
యనువును లేమికిన్ వగల నందెడు నాత్మలువో తలంపగన్.
భావం: పాపములు ఏమియు లేని ఓ దేవా! ఇంద్రియ జయము నొందునట్టి సామర్థ్యము గల వారుగా ఉండియు, చలించునట్టి స్వభావము గల మనస్సు అనెడి గుర్రమును, బ్రహ్మ ఙ్ఞానము అనెడు నూలు తాడు చేత మెల్లగా బిగబట్టుటకు యత్నించుచు ఆ మనస్సు స్వాధీనము కానందున మోక్షము నొందుటకు మార్గము ఏదియు కనబడక నీ పాదారవింద భజన లేని జీవులు విచారము పొందుదురు.
గురు పద పంకజాతములు గొల్వని వారలువో మహాబ్ధి ని
స్తరణకు గర్ణ ధార రహితంబగు నావము సంగ్రహించు బే
హరి గతి భూరి దుస్తర భవాంబుధిలోన మునుంగుచుందురు రం
బురుహదళాక్ష! నీవు పరిపూర్ణుడవై తనరారంగా నొగిన్.
భావం: తామర రేకులను పోలిన కన్నులు గల స్వామీ! గురు పాద పద్మాలను సేవించని పామరులు పెద్ద సముద్రము దాటుటకు ఓడ వాడు లేని ఓడ యందు కూర్చుండి, బేరమాడబోవు వర్తకుని వలే జనన మరణ పరంపరలనే మేర లేనిదియు, దాటరానిదియు అయిన సంసార సముద్రంలో మునిగి పోతారు. అంతటను నిండుకొని ఎల్లప్పుడును వెలుగునట్టి నిన్ను చేరలేరు.
పుత్ర దార గృహ క్షేత్ర భూరి విషయ
ఘన సుఖాసక్తుడగుచు నే మనుజుడేని
నర్థి జరియించు వాడు భవాబ్ధి లోన
జెంది యెన్నాళ్ళకును దరి జేర లేడు.
భావం: యే మనుష్యుడు నిరంతరం బిడ్డలు, భార్య, ఇల్లు, మడిచేను అనువాని యందు ఆసక్తి కలవాడై, విశేషమైన విషయ సుఖములు పొందగోరునో అటువంటి మానవుడు ఈ సంసార సాగరం నుంచి ఎన్నటికీ గట్టెక్కలేడు.
జగతిపై బహు తీర్థ సదనంబు లనగల్గి పుణ్యాను వర్తన స్ఫురితులగుచు
బాటించి నీ యందు బద్ధ మత్సరములు లేక భక్తామరానోకహంబ
వగు భవత్పాదాబ్జ యుగళంబు సేవించి భవ పాశముల నెల్ల బారదోలి
సమ మతులై యదృచ్ఛాలాభ తుష మేరు సమముగా గైకొని సాధులగుచు
బాద తీర్థంబు గల మహా భాగవత జ
నోత్తమోత్తము లైనట్టి యోగి వరుల
వారకెప్పుడు సేవించు వాడు వొందు
బ్రవిమలానందమయ మోక్షపదము.
భావం: ఈ భూలోకమునందు పుణ్య నదులను, పుణ్య క్షేత్రములను పొందుటకు సాధనాలైన సత్కార్యాలను తరు పూర్వ పుణ్య విశేషము వలన నడపునట్టి వివేకులు నీయందు విరోధ బుద్ధి లేక, భక్తుల పాలిట కల్పవృక్షమైన నీ పాద కమలములను కొల్చి, జన్మ బంధములను తొలగించుకుని, శతృవులు, మిత్రులు అను బేధ బుద్ధి లేక ఎల్ల వారి యెడల సమముగా వర్తించుచు తనంతట దొరికిన అల్ప వస్తువునైనను మేరు పర్వతముతో సమానముగా నెంచుచు సాధువులై, పరిశుద్ధులైన భగవద్భక్తుల పాద తీర్థములను కోరి అట్టి యోగీశ్వరులను సేవించి వర్తించును. అట్టి పుణ్యాత్ముడు నిర్మలమైన ఆనందమును కలుగ చేయునట్టి మోక్ష స్థానమును పొందును.
No comments:
Post a Comment