Monday, February 6, 2017

యఙ్ఞ వరాహ స్తోత్రం

విదియ నాటి చంద్ర రేఖలా విరాజిల్లుతున్న తన తెల్లని కోరకొనపై ఉన్న భూమి, స్వామిని ఎప్పుడూ ఎడబాయని శ్రీమహాలక్ష్మీ సహితుడైన యఙ్ఞ వరాహ మూర్తిని చూచి బ్రహ్మాది దేవతలిలా కీర్తించారు:  
                                             

దేవ! జితం జితం తే పరమేశ్వర!జిత యఙ్ఞ భావన! శ్రుతి శరీర!
యనుచు గారణ సూకరాకారుడగు నీకు నతి భక్తి మ్రొక్కెదమయ్య వరద!
భవదీయ రోమకూపములందు లీనంబులై యుండు నంబుధు లట్టి యధ్వ
రాత్మకమైన తనరారు నీ రూపంబు గానంగ రాదు దుష్కర్మ పరుల
కట్టి నీకు ప్రణామంబు లాచరింతు మఖిల జగదేక కీర్తి! దయానువర్తి! 
భవ్య చారిత్ర! పంకజ పత్రనేత్ర! చిర శుభాకార! ఇందిరా చిత్తచోర! 
భావం: దేవదేవా! జయం! జయం! పరమేశ్వరా! జయం! జయింపబడనివాడా! నీకు జయం! నీవే యఙ్ఞాధిపతివి, వేదములే రూపముగా కలవాడవు, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అనే కారణమును సాధించుట కొరకు వరాహావతారం ధరించిన నీకు పరమ భక్తితో ప్రణమిల్లుతున్నాము. నీవు సమస్త కోరికలను తీర్చువాడవు. ఈ మహా సముద్రాలన్నీ నీ రోమ కూపాలలో ఇమిడి ఉన్నాయి. అటువంటి నీ యఙ్ఞవరాహ స్వరూపాన్ని అఙ్ఞులు దర్శించలేరు. విశాల విశ్వ విఖ్యాత కీర్తివీ, పరమ కరుణా మూర్తివీ, పరమ పవిత్ర చరిత్రుడవు, పద్మ దళాయత నేత్రుడవు, చిర మంగళాకారుడవు, శ్రీ రమా చిత్త చోరుడవూ అయిన నీకివే మా కైమోడ్పులు.   

త్వక్కున నఖిల వేదములు, రోమంబుల యందును బర్హిస్సు, లక్షులందు 
నాజ్యంబు, పాదంబులందు జాతుర్హోత్ర కలితంబులగు యఙ్ఞ కర్మములును,
స్రుక్కు తుండంబున, స్రువము నాసికను, నిడాపాత్ర ముదర కోటరమునందు,
శ్రవణాస్య బిలముల జమసప్రాశిత్రముల్, గళమున నిష్టిత్రికంబు, జిహ్వ
దగు ప్రవర్గ్యము, నగ్నిహోత్రమును నీదు చర్వణంబును, సభ్యావసథ్యు లుత్త
మాంగ మసువులు చయనములగుగిటీశ! యనుచు నుతియించి రత్తరి యఙ్ఞ విభుని.  
భావం: ఓ స్వామీ! నీ చర్మం నుండి ఋగ్వేద, యజుర్వేద, సామవేదాలూ జనించాయి. నీ రోమకూపాల నుండి యఙ్ఞములకు మూలకారణములైన అగ్నులు ఆవిర్భవించాయి. నీ కనుల నుండి హోమ ద్రవ్యమైన నెయ్యీ, నీ నాలుగు పాదాల నుండి హోత, ఉద్గాత, అధ్వర్యుడు, బ్రహ్మ అనే నలుగురు ఋత్విక్కుల కర్మ సముదాయములైన నాలుగు హోత్రాలతో కూడిన యఙ్ఞ కర్మలు, ముట్టె నుండి స్రుక్కు, ముక్కు రంధ్రముల నుండి స్రువము, ఉదరము నుండి ఇడా పాత్రము, చెవుల చిల్లుల యందు నుండీ చమస పాత్రలు, నోటి యందు బ్రహ్మ, భాగ పాత్రయగు ప్రాశిత్రం అనే పాత్ర, కంఠం నుండి ఇష్టులు అనే మూడు యఙ్ఞాలు, నాలుక నుండి ప్రవర్గ్యం అనే యఙ్ఞమూ పుట్టాయి. నీ చర్వణమే అగ్నిహోత్రం. సభ్యం అంటే హోమరహితాగ్ని, అవసథ్యం అంటే ఔపాసనాగ్నీ నీ శిరస్సు నుంచి జనించాయి. ఇష్టకా! యఙ్ఞములో వాడే ఇటుక చయనాలు నీ ప్రాణ స్వరూపాలు. నీవు యఙ్ఞాధినాథుడవు. యఙ్ఞ వరాహ మూర్తివి! అని అంటూ ఆ యఙ్ఞ వరాహ రూప మహామహుని స్తుతించారు.          

హవరూపివి! హవనేతవు! 
హవభోక్తవు! నిఖిల హవ ఫలాధారుడవున్!
హవ రక్షకుడవు నగు నీ కవితథముగ 
నుత లొనర్తుమయ్య ముకుందా!
భావం: నీవు యఙ్ఞమే రూపముగా గలవాడవు, యఙ్ఞ కర్తవు, యఙ్ఞ భోక్తవు, యఙ్ఞ ఫల ప్రదాతవు, యఙ్ఞ రక్షకుడవు. సమస్తమూ నీవే. ఓ ముకుందా! నీకు మా హృదయ పూర్వకమైన అభివందనాలు.  

సత్వ గుణమున సద్భక్తి సంభవించు
భక్తియుతముగ చిత్తంబు భవ్య మగును
హృదయ పద్మంబునం దోలి నెరుగబడిన
యట్టి నీకు నమస్కారమయ్య వరద!
భావం: సత్వ గుణం వల్ల మంచి భక్తి ప్రాప్తిస్తుంది. భక్తితో కూడిన మనస్సు పవిత్రం అవుతుంది. అటువంటి భక్తి యుక్తమైన పవిత్ర హృదయ పద్మంతో భావించి సేవింపదగిన వాడవు నీవే. అట్టి ఓ దేవదేవా! నీకు నమస్కారం.        

అరవిందోదర! తావకీన సిత దంష్ట్రాగ్రావలగ్న క్షమా
ధర నద్యబ్ధి నదాటవీయుత సమిద్ధక్ష్మాతలం బొప్పె భా
సుర కాసర జలావతీర్ణ మదవచ్ఛుండాలరాడ్దంత శే
ఖర సంసక్త సపత్ర పంకజము రేఖం బొల్పు దీపింపగన్.
భావం: పద్మనాభా! పర్వతాలతో, నదీనదాలతో, సముద్రాలతో, అరణ్యాలతో నిండిన ఈ భూమండలం నీ వాడియైన తెల్లని కోర చివర ప్రకాశిస్తున్నది. ఆ భూదేవి మనోహరమైన సరోవర జలాలలో దిగిన మద గజేంద్రుని దంతాగ్రాన తగుల్కొని ఉన్న ఆకులతో కూడిన తామర పువ్వు వలే చూడ ముచ్చటగా ఉన్నది.    

చతురామ్నాయ వపుర్విశేష ధర! చంచత్సూకరాకార! నీ
సిత దంష్ట్రాగ్ర విలగ్నమైన ధర రాజిల్లెం గులాద్రీంద్ర రా
జిత శృంగోపరి లగ్న మేఘము గతిం జెల్వారి, విద్వజ్జనాం
చిత హృత్పల్వలలోల! భూరమణ!లక్ష్మీనాథ! దేవోత్తమా!  
భావం: చతుర్వేద స్వరూపమైన శరీరాన్ని ధరించి ఉన్న ఓ యఙ్ఞ వరాహ స్వామీ! కొద్ది కాలం పాటు వరాహ శరీరమును ధరించి ఉన్నవాడా! నీవు ఙ్ఞానవంతుల అంతరంగాలనే నీటి మడుగులలో క్రీడిస్తుండువాడా! భూదేవికి భర్త అయిన వాడా! శ్రీదేవికి మనోహరుడవగు స్వామీ! దేవతలందరికీ అగ్రేసరుడవుగా ఉన్నవాడా! స్వామీ! నీ తెల్లని దంష్ట్రాంచలాన తగులుకొన్న భూమి కొండల చక్రవర్తి యొక్క ప్రకాశించే వెండి శిఖరాగ్రాన విరాజిల్లుతుండే నీలమేఘంలా అందాలు చిందుతూ ఉంది.     

సమదిక స్థావర జంగమాత్మకమైన వసుమతీ చక్ర మవక్ర లీల 
నుద్ధరింపుము; కరుణోపేత చిత్తుండవగుచు నస్మన్మాత యయ్యె ధరణి;
మాతయౌటెట్లని మది దలంచెదవేని చర్చింప మాకు విశ్వమున కీవు
జనకుండవగుట యుష్మత్పత్ని భూదేవియగుట మాకును దల్లి యయ్యె;నిపుడు 
ధరకు నీతోడ గూడ వందనమొనర్తు
మరణి యందును యాఙ్ఞికుడగ్ని నిలువు 
కరణి మీ తేజ మీ ధరాకాంతయందు
నిలుప ధరణి పవిత్రయై నెగడు గాన. 
భావం: కరుణారసం నిండిన హృదయం కలవాడవై,స్థావర జంగమాత్మకమై,ప్రాణులకు నివాస స్థానంగా ఈ భూమండలాన్ని సముద్ర జలాల్లో మునిగి పోకుండా ఉద్ధరించు. నీకు భార్యయైన ఈ భూమి మాకు తల్లి ఎలాగంటావేమో! మాకు, ఈ లోకానికీ నీవు తండ్రివి, నీవు భరించుటచే భూదేవి నీ భార్య అయింది. అందుకని ఆమె మాకు తల్లియే అవుతుంది. నీతోపాటూ ఈ భూమికీ  నమస్కారం చేసి సేవిస్తాము. యఙ్ఞకర్త అరణి యందు అగ్నిని నిల్పిన విధంగా నీవు నీ తేజస్సును(ప్రాణులను ధరించే శక్తి) భూమియందు నిల్పడం వల్ల ఈ ధరిత్రి పవిత్రమై ఒప్పుతూ ఉంది.          

తలప రసాతలాంతర గత క్షితి గ్రమ్మర నిల్పినట్టి నీ
కలితన మెన్న విస్మయము గాదు; సమస్త జగత్తు లోలిమై
గలుగగ చేయుటద్భుతము గాక, మహోన్నతి నీ వొనర్చు పెం
పలరిన కార్యముల్ నడప నన్యులకుం దరమే రమేశ్వరా?
భావం: లక్ష్మీ వల్లభా! వాస్తవం ఆలోచిస్తే సమస్త లోకాలను క్రమానుసారంగా సృష్టించడమన్నది అత్యద్భుతమైన విషయం. అటువంటి నీ శక్తి ముందు పాతాళంలో ఉన్న భూమిని యథా స్థితికి తెచ్చి నిల్పిన ఈ నీ సామర్థ్యం ఏమంత ఆశ్చర్యాన్ని కలిగించేదిగా లేదు. ఇటువంటి మహాకార్యాలు నిర్వహించటానికి నీవే సమర్థుడవు. ఇతరులకు ఈ కృత్యాలు అసాధ్యాలు.  

సకల జగన్నియామక విచక్షణ లీల దనర్చునట్టి నం
దకధర!తావక స్ఫురదుదారత మంత్ర సమర్థుడైన యా
ఙ్ఞికుడరణిన్ హుతాశనుని నిల్పిన కైవడి మన్నివాస మౌ
టకు దలపోసి యీ క్షితి దృఢంబుగ నిల్పితివయ్య ఈశ్వరా! 
భావం: నందకము అనే ఖడ్గాన్ని ధరించిన ముకుందా! నీవు నేర్పుతో సకల లోకాలనూ ఒక నియమ బద్ధంగా ఏర్పాటు చేసిన నేర్పరివి. మంత్ర సిద్ధుడైన యాఙ్ఞికుడు అరణి యందు అగ్నిని నిల్పినట్లు నీవు మాపై మహత్తర దయపూని మేము నిలబడి మనుగడ సాగించడానికి ఈ భూమిని ఈ విధంగా సుస్థిరంగా నిలబెట్టావు. ఎంతటి ఔదార్యం ప్రకటించావు స్వామీ! 

సలలిత వేదశాస్త్రమయ సౌకర మూర్తిదనర్చుచున్ రసా
తలముననుండి వెల్వడు నుదారత మేను విదుర్ప దత్సటో
చ్చలితములైన బిందువుల సాధు తపోజన సత్యలోక వా
సులమగు మేము దోగి పరిశుద్ధి వహించితిమయ్య మాధవా! 
భావం: ఓ మాధవా! వేదశాస్త్ర స్వరూపమైన ఆదివరాహ మూర్తివైన నీవు ఆహ్లాదంతో పాతాళం నుండీ బయటకి వస్తూ సముద్ర జలాలతో తడిసిన నీ శరీరాన్ని విదిలించగా ఆ సమయంలో నీ మెడమీది జూలు నుండి నీటి చుక్కలు నలుదెసలా ఎగిరిపడ్డాయి. పరమ పవిత్రాలైన ఆ జల బిందువులలో తడిసి దేవలోకంలో, తపోలోకంలో, జనలోకంలో, సత్యలోకంలో నివసించే మేమంతా ఎంతగానో పరిశుద్ధులం అయినాము స్వామీ!      

విశ్వభవస్థితి ప్రళయ వేళలందు వికార సత్వమున్
విశ్వము నీవ ఈ నిఖిల విశ్వము లోలి సృజింతు విందిరా
ధీశ్వర! యీశ! కేశవ! త్రయీమయ! దివ్య శరీర! దేవ! నీ
శాశ్వత లీల లిట్టి వని సన్నుతి సేయగ మాకు శక్యమే?  
భావం: ఓ లక్ష్మీ వల్లభా! ప్రళయ సమయమునందు ఈ ప్రపంచాన్ని సృష్టించేదీ, రక్షించేదీ, లయం చేసేదీ నీవే! సమస్తమూ నీవై ఈ సమస్త లోకాలనూ మళ్ళీ మళ్ళీ సృష్టిస్తున్నావు. ఈశ్వరా! కేశవా! వేదమయా! దివ్యస్వరూపా! దేవదేవా! శాశ్వతుడవైన అంతులేని నీ వింత లీలలు ఇంతటివి- ఇటువంటివి అని వర్ణించడానికి మాకు చేతకానట్టిది.     

పంకజోదర నీ వపార కర్ముండవు భవదీయ కర్మాబ్ధిపార మేద
నెరిగెద నని మది నిచ్చగించిన వాడు పరికింపగా మతిభ్రష్టు గాక
విఙ్ఞానియే? చూడ విశ్వంబు నీ యోగ మాయాపయోనిధి మగ్నమౌట
దెలిసియు దమ బుద్ధి దెలియని మూఢుల నే మన నఖిలలోకేశ్వరేశ!
దాసజనకోటి కతి సౌఖ్యదాయకములు
వితత కరుణా సుధా తరంగితములైన 
నీ కటాక్షేక్షణములచే నెరయ మమ్ము 
జూచి సుఖులను జేయవే సుభగ చరిత!  
భావం: దామోదరా! లోక కళ్యాణార్థం నీవు చేసే కార్యాలు అనంతాలు. "కర్మలు అనే మహాసముద్రం వంటి వాటి అంతు తెలుసుకుంటాను" అని నిశ్చయించుకునేవాడు మతిభ్రష్టుడూ, అఙ్ఞానీ అవుతాడే గానీ విఙ్ఞాని కాడు. ఈ సమస్త ప్రపంచం నీ యోగమాయా సముద్రంలో విలీనం అయిఉన్నదన్న విషయం తెలుసుకున్నవాడై నీ ప్రభావాన్ని తెలియని ఆ మందబుద్ధులను ఏమనాలి? అఖిలలోకాధీశ్వరా! నీ చరణ దాసులకు సర్వదా సమధిక సౌఖ్యాన్ని కలిగించేవీ, అపారమైన కరుణ అనే అమృత తరంగాలు పొంగి పొరలేవీ అయిన నీ కడగంటి చూపులతో మమ్ములను చక్కగా చూచుచూ, సుచరిత్రా! మాకు సుఖ సంతోషాలను అనుగ్రహించు.       




  

No comments:

Post a Comment