పీతాంబరధరుడూ, చతుర్భుజుడూ, పురాణపురుషుడు, పరమేశ్వరుడు అయిన గోవిందుని యందు ఏకాగ్ర బుద్ధిని సంధానించి పరమానందభరితుడై స్వభావ సిద్ధాలైన సంసారబంధాలను పరిహరించే ఉద్దేశంతో మందాకినీ నందనుడైన భీష్ముడు సమస్త దోషాలనూ పరాస్తం చేసి నిష్కామ భావంతో, నిర్మల ధ్యానంతో ఇలా స్తుతించారు.
త్రిజగన్మోహన నీలకాంతి తనువుద్దీపింప ప్రాభాత నీ
రజ బంధు ప్రభమైన చేలము పయిన్ రంజిల్ల నీలాలక
వ్రజ సంయుక్త ముఖారవింద మతి సేవ్యంబై విజృంభింప మా
విజయుం చేరెడు వన్నెలాడు మది నావేశించు నెల్లప్పుడున్.
భావం: ముల్లోకాలను మోహింపచేసే నీలవర్ణ కాంతులతో నిగనిగలాడే దేహంతో, వెలుగులు వెదజల్లుతూ బాలభాను ప్రభలు ప్రకాశించే బంగారు వస్త్రం పైన రంజిల్లుతుండగా, నల్లని ముంగురులతో, ముద్దులు మూటగట్టే ముఖారవిందం మిక్కిలిగా సేవింపవలసిందిగా ఉండగా, అనురాగాలు చిందిస్తూ మా అర్జునుడిని సమీపించే అందగాడు నా అంతరంగంలో నిరంతరం ఉండిపోవలెను.
హయరింఖాముఖ ధూళి ధూసర పరిన్యస్తాలకోపేతమై
రయజాత శ్రమ తోయ బిందు యుతమై రాజిల్లు నెమ్మోముతో
జయముం పార్థున కిచ్చు వేడ్కనని నాశస్త్రాహుతింజాల నొ
చ్చియు పోరించు మహానుభావు మదిలో జింతింతు నశ్రాంతమున్
భావం: యుద్ధములో గుర్రాల గిట్టలు రేగగొట్టిన దుమ్ము కొట్టుకుని రంగు చెడి దూసర వర్ణమునకు మారిన చెదిరిన ముంగురులతోను, గమన వేగం వల్ల కందళించిన ఘర్మ బిందువులతోను కూడి ముచ్చటగా ప్రకాశించే ముఖం కలవాడై, కిరీటిని గెలిపించాలనే కుతూహలంతో నా శరాఘాతాలకు బాగా బాధ పడుతూ కూడా అర్జునుడిని ప్రోత్సహించి యుద్ధం చేయించిన మహానుభావుడిని మనసులో ఎల్లప్పుడూ ధ్యానించెదను.
నరు మాటల్ విని, నవ్వుతో నుభయ సేనా మధ్యమ క్షోణిలో
పరు లీక్షింప రథంబు నిల్పి పర భూపాలావళిం జూపుచుం
పర భూపాయువులెల్ల జూపులన శుంభత్కేళి వంచించు, నీ
పరమేశుడు వెలుంగు చుండెడును హృత్పద్మాసనాసీనుడై.
భావం: యుద్ధరంగంలో అర్జునుడు పల్కిన మాటలు విని, ఆకర్ణించి చిరునవ్వు నవ్వుతూ విరోధులైన కౌరవ సైన్యం చూస్తుండగా తమ రథమును పాండవ, కౌరవ సైన్యాల మధ్య ప్రదేశంలో నిలిపి పేరు పేరునా వైరి పక్షంలోని వీరులను చేయెత్తి చూపిస్తూ, తన చూపులతోనే ఆ భూపతుల ఆయువులన్నీ అవలీలగా ఆకర్షించే లోకేశ్వరుడు శ్రీకృష్ణుడు నా హృదయ పద్మంలో పద్మాసనంపైన ప్రకాశించుతున్నాడు.
తనవారి చంపజాలక, వెనుకకు బో నిచ్చగించు విజయుని శంకన్
ఘన యోగవిద్య బాపిన, ముని వంద్యుని పాద భక్తి మొనయున్ నాకున్.
భావం: రణరంగంలో తన బంధుమితృల ప్రాణాలు తీయడానికి ఇష్ట పడక వెనుకంజ వేస్తున్న ధనంజయుని సందేహాలను గీతోపదేశం అనే ఆత్మ విద్య చేత పోగొట్టిన మునిజన వంద్యుడైన ముకుందుని పాద భక్తి నాలో ఎక్కువ అగుగాక!
కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగంబెల్ల గప్పికొనగ
నురికిన నోర్వక యుదరంబులోనున్న జగముల వ్రేగున జగతి గదల
చక్రంబు చేపట్టి చనుదెంచు రయమున పైనున్న పచ్చని పటము జార
నమ్మితి నాలావు నగుబాటు సేయక మన్నింపు మని క్రీడి మరల దిగువ
కరికి లంఘించి సింహంబు కర్ణి మెరసి
నేడు భీష్ముని జంపుదు నిన్ను గాతు
విడువుమర్జున యనుచు మద్విశిఖ వృష్టి
దెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు.
భావం: ఆ నాడు యుద్ధభూమిలో కుప్పించి నా పైకి ఎగిరినప్పుడు తను ధరించిన కుండలాల కాంతులు గగన మండలం నిండా వ్యాపించగా, ముందుకు దూకినప్పుడు ఆయన ఉదరములోని మూడు లోకాల బరువు భరించలేక భూమి కంపించిపోగా, చేతిలో చక్రాన్ని ధరించి అరుదెంచే వేగానికి పైనున్న బంగారు చేలం జారిపోతుండగా, నమ్ముకున్న నన్ను నలుగురిలో నవ్వుల పాలు చేయవద్దని మాటి మాటికీ కిరీటి వెనక్కి లాగుతున్నా లెక్కచేయకుండా " అర్జునా! నన్ను వదులు. ఈనాడు భీష్ముని రూపుమాపి నిన్ను కాపాడుతాను" అంటూ ఏనుగుపైకి లంఘించే సింహం వలే నాపైకి దూకే గోపాల దేవుడే నాకు రక్ష.
తనకున్ భృత్యుడు వీనిం గాచుట మహాధర్మంబు వొమ్మంచు న
ర్జున సారథ్యము పూని పగ్గములచే జోద్యంబుగా బట్టుచున్
మునికోలన్ వడిబూని ఘోటకములన్ మోదించి తాడించుచున్
జనులన్ మోహము నొందచేయు పరమోత్సాహుం ప్రశంసించెదన్.
భావం: "ఇతడు ( అర్జునుడు) నా నమ్మిన సేవకుడు, ఇతడిని కాపాడడం నా కర్తవ్యం!" అంటూ అర్జున సారథ్యాన్ని అంగీకరంచి నొగల నడుమ కూర్చుండి ఒక చేతిలో వయ్యారంగా పగ్గాలు పట్టుకుని, మరొక చేతిలో కొరడా ధరించి, పరమోత్సాహంగా అశ్వాలను అదిలిస్తూ చూసే వాళ్ళను ఆశ్చర్య చకితులను చేస్తున్న పార్థ సారథిని ప్రశంసిస్తున్నాను.
పలుకుల నగవుల నడవుల
నలుకల నవలోకనముల నాభీరవధూ
కులములు మనముల తాలిమి
కొలుకులు వదలించు ఘనుని గొలిచెద మదిలోన్.
భావం: మాటలతో, మందహాసాలతో, ప్రవర్తనలతో, ప్రణయకోపాలతో, వాల్చూపులతో, వ్రజ ధూమణుల వలపులు దోచుకునే వాసుదేవుని మనస్సులో మరీ మరీ సేవిస్తాను.
మునులు నృపులు జూడ మును ధర్మజుని సభా
మందిరమున యాగమంటపమున
చిత్ర మహిమలతోడ జెలువొందు
జగదాది దేవుడమరు నాదు దృష్టియందు.
భావం: ఇంతకు ముందు ధర్మ నందనుని సభా మందిరంలోని యఙ్ఞ మంటపంలో మునీంద్రులు, నరేంద్రులు చూస్తూ ఉండగా చిత్ర విచిత్ర మహిమలతో చెలువొందే జగన్నాథుడు నా చూపుల్లో రూపుదిద్దుకుంటున్నాడు.
ఒక సూర్యుండు సమస్త జీవులకు దా నొక్కొక్కడై తోచు పో
లిక నే దేవుడు సర్వకాలము మహాలీలన్ నిజోత్పన్న జ
న్య కదంబంబుల హృత్సరోరుహములన్ నానా విధానూన రూ
పకుడై యొప్పుచునుండు నట్టి హరి నే ప్రార్థింతు శుద్ధుండనై.
భావం: ఒకే ఒక సూర్యుడు సకల జీవరాశులలో ఒక్కొక్కరికి ఒక్కొక్కడుగా అనేక ప్రకారములుగా కనిపించే విధంగా తాను సృష్టించిన నానా విధ ప్రాణి సమూహాల హృదయ కమలాలలో నానా విధములైన రూపాలతో సర్వ కాల సర్వావస్థల యందు తన లీలా విలాసంతో తనరారే భగవంతుడిని పవిత్ర హృదయంతో ప్రార్థిస్తున్నాను.
No comments:
Post a Comment