దక్ష యఙ్ఞ వినాశనానంతరం దేవతలంతా శివుని స్తుతించి ప్రసన్నుడైన ఆ దక్షిణామూర్తి అనుగ్రహానికి పాత్రులైనారు. అప్పుడు బ్రహ్మదేవుని చేత ఆఙ్ఞాపింపబడినవాడై దక్షుడు యఙ్ఞాన్ని పరిసమాప్తం చేసాడు. అప్పుడు యఙ్ఞదేవత అయిన విష్ణువు అనుగ్రహించి సాక్షాత్కరించాడు. ఆయన దివ్య భవ్య స్వరూపాన్ని చూచి నిర్ఘాంతపోయిన దేవతలు ఆయనను స్తుతించడానికి అశక్తులై నిశ్చేష్టులై ఉండగా దక్షుడు, అనంతరం మిగిలిన వారందరూ ఆ శ్రీమన్నారాయణుని వేనోళ్ళ స్తుతించారు.
ఋత్విక్కులు ఇలా స్వామిని స్తుతించారు:
వాసుదేవుని శాపవశమున చేసి కర్మానువర్తులము మేమైన కతన
బలసి వేద ప్రతిపాద్య ధర్మోపలక్ష్యంబైనయట్టి మఖంబునందు
దీపింప నింద్రాది దేవతా కలిత రూప వ్యాజమున బొంది పరగు నిన్ను
యఙ్ఞ స్వరూపుండ వని కాని కేవల నిష్కించనుండవు నిర్మలుడవు
నరయ నవవద్య మూర్తివి యైన నీదు
లలిత తత్వ స్వరూపంబు తెలియజాల
మయ్య! మాధవ! గోవింద! హరి! ముకుంద!
చిన్మయాకార! నిత్య లక్ష్మీ విహార!
భావం: స్వామీ! మేము వాసుదేవుని యొక్క శాపం వల్ల యఙ్ఞాది కర్మలయందు ఆసక్తులమైనాము. వేదాలలో ప్రతిపాదింపబడిన ధర్మ లక్షణాలు కలది యఙ్ఞం. ఆ యఙ్ఞంలో ఇంద్రాది దేవతల రూపంతో నీవే సాక్షాత్కరిస్తుంటావు. నీవు యఙ్ఞ సరూపుడవు, నిష్కించనుడవు. నిర్మలుడవు. నిరవద్యుడవు. మాధవా! గోవిందా! హరీ! ముకుందా! నీవు చిన్మయ మూర్తివి, నిత్య సౌభాగ్యశాలివి. నీ యదార్థ స్వరూపాన్ని మేము గ్రహింపలేము.
సభ్యులు ఈ విధంగా పలికారు:
శోక దావాగ్ని శిఖా కులితంబు పృథు క్లేశ ఘన దుర్గ దుర్గమంబు
దండధర కౄర కుండలి శ్లిష్టంబు, పాప కర్మ వ్యాఘ్ర పరివృతంబు
గురు సుఖ దు:ఖ కాకోల పూరిత గర్తమగుచు ననాశ్రయమైనయట్టి
సంసార మార్గ సంచారులై మృగతృష్ణికల బోలు విషయ సంఘము నహ మ్మ
మేతి హేతుక దేహ నికేతనములు
నయి మహా భారవహులైనయట్టి మూఢ
జనము లేనాట మీ పదాబ్జములు గాన
జాలు వారలు? భక్త ప్రసన్న! దేవ!
భావం: భక్తులను అనుగ్రహించే దేవదేవా! సంసార మార్గం శోకమనే కారుచిచ్చు మంటలచే చీకాకైనది. కష్టాలు అనే గొప్ప కోటలతో దాటరానిది. యముడనే కౄర సర్పంతో కూడింది. పాపపు పనులు చేసే దుర్జనులు అనే పెద్ద పులులతో నిండినది. అంతులేని సుఖదు:ఖాలనే కాలకూట విషంతో నిండినగుంట వంటిది. ఎటువంటి ఆశ్రయము లభ్యం కానట్టిది, దిక్కులేనిది. అటువంటి సంసార మార్గంలో సంచరిస్తూ ఎండమావుల వంటి ఇంద్రియ వాంఛలలో పడి కొట్టుమిట్టాడుతూ నేను-నాది అనే భావాలకు కారణమయిన దేహం గేహం వంటి గొప్ప బరువును మోస్తూ ఉండే పరమ మూర్ఖులైన మానవులు నీ పాద పద్మాలను ఎప్పుడూ చూడలేరు.
పరమశివుడు ఈ విధంగా స్తుతించాడు:
వరద! నిరీహ యోగిజన వర్గ సుపూజిత!నీ పదాబ్జముల్
నిరతము నంతరంగమున నిల్పి సమగ్ర భవత్పరిగ్రహ
స్ఫురణ దనర్చు నన్ను నతిమూఢులు సంతతము న్నమంగళా
చరణుడటంచు బల్క నది సమ్మతి నే గణియింప నచ్యుతా!
భావం: వరదా! పరమ యోగి సమూహ పూజితుడవైన అచ్యుతా! యోగులు నిన్ను పూజిస్తారు. నీ పాద పద్మాలు కామపురుషులకు సర్వ పురుషార్థములను ఇచ్చునట్టివి. వానిని నిత్యమూ మనస్సులో నిలుపుకొని నీ సంపూర్ణ దయను పొందిన నన్ను చూచి బుద్ధి హీనులు నిరతము అమంగళ మూర్తి అని నిందిస్తారు. అయినా ఆ నిందను నేను లెక్క చేయను.
భృగుడు ఇలా వేడుకున్నాడు:
అరవిందోదర! తావకీన ఘన మాయా మోహిత స్వాంతులై
పరమంబైన భవన్మహామహిమముం బాటించి కానంగ నో
పరు బ్రహ్మాది శరీరు లఙ్ఞులై యో పద్మాక్ష! భకార్తి సం
హరణాలోకన! నన్నుం గావదగు నిత్యానంద సంధాయివై.
భావం: ఓ పద్మనాభా! దుస్తరమైన నీ మాయకు చిక్కి తత్వ ఙ్ఞానము ఆచ్ఛాదితము అగుట వల్ల బ్రహ్మ మొదలైన శరీర ధారులు కూడా నీ మహా మహిమను గ్రహింపలేరు. చూపులచేతనే నీవు భక్తుల ఆపదలను తొలగింపగల పద్మాక్షుడవు. నాకు నిత్యానందాన్ని ప్రసాదించి నన్ను కాపాడు.
బ్రహ్మ దేవుడు ఇలా స్తుతించాడు:
తవిలి పదార్తభేద గ్రాహకములైన చక్షురింద్రియముల సరవి జూడ
గలుగు నీ రూపంబు గడగి మాయామయంబగు; నసద్వ్యతిరిక్త మగుచు మరియు
ఙ్ఞానార్థ కారణ సత్వాది గుణముల కాశ్రయ భూతమై యలరుచున్న
నిరుపమాకారంబు నీకు విలక్షణమై యుండుననుచు నే నాత్మ దలతు
నిర్వికార! నిరంజన! నిష్కళంక!
నిరతిశయ! నిష్క్రియారంభ! నిర్మలాత్మ!
విశ్వ సంబోధ్య! నిరవద్య! వేదవేద్య!
ప్రవిమలానంద! సంసారభయ విదూర!
భావం: ఎదురుగా ఉన్న పదార్థాలను మాత్రమే గ్రహించే శక్తిగా నేత్రాది ఇంద్రియముల ద్వారా పురుషుడు నీ మాయామయ రూపాన్ని మాత్రమే చూడగలడు. మానవుడు చూసేదంతా నీ స్వరూపం కాదు. సంపూర్ణమైన ఙ్ఞానార్థాలకూ, సత్వం మొదలైన గుణాలకూ నెలవై అసత్తుల కంటే వేరై సాటిలేనిదై విలక్షణమైన నీ రూపాన్ని జీవులు చూడలేరు. అసద్వస్తువులే మాయామయమైనవి. నీవు దానికంటే భిన్నుడవని సత్పురుషుల అభిప్రాయం. నీవు నిర్వికారుడవు, నిరంజనుడవు, నిష్కళంకుడవు, సర్వేశ్వరుడవు, క్రియారహితుడవు, విమలాత్ముడవు, విశ్వ విధాతవు, నిరవద్యుడవు, వేదవేద్యుడవు, ఆనంద స్వరూపుడవు, భవ బంధాలను పటాపంచలు చేసే వాడివి.
No comments:
Post a Comment