Thursday, February 2, 2017

కుంతీ దేవి చేసిన శ్రీకృష్ణ స్తుతి

శ్రీకృష్ణుడు ఉత్తరా గర్భస్థ శిశువును బ్రహ్మశిరోనామకాస్త్రం బారి నుండి రక్షించిన అనంతరం ఎంతో సంతోషంతో కుంతీ దేవి ఆ పరమాత్ముని ఇలా విశేషంగా స్తుతిస్తుంది.  

                                         


పురుషుండాధ్యుడు ప్రకృతికి
బరుడవ్యయు డఖిల భూత బహిరంతర్భా
సురుడును లోక నియంతయు
పరమేశ్వరుడైన నీకు ప్రణతులగు హరీ!
భావం: కృష్ణా! నీవు పురాణ(ఆది) పురుషుడవు. సర్వ జగన్నియంతవు. దేవదేవుడవు. ప్రకృతికి అవ్వలివాడవు, అనంతుడవు. సమస్త ప్రాణులలో లోపల, వెలుపల వెలుగుతుండే వాడవు. విశాల విశ్వాన్ని నడిపే పరమేశ్వరుడవైన నీకు నమస్కారాలు. 

తనయులతోడ నే దహ్యమానంబగు జతు గృహంబందును జావకుండ
గురు రాజు వెట్టించు ఘోర విషంబుల మారుత పుత్రుండు మడియకుండ
ధార్తరాష్ట్రుడు సముద్గతి చీర లొలువంగ ద్రౌపది మానంబు దలగకుండ
గాంగేయ కుంభజ కర్ణాది ఘనులచే నా బిడ్డలని లోన నలగకుండ
విరటు పుత్రిక కడుపులో వెలయు చూలు
ద్రోణ నందను శర వహ్ని ద్రుంగకుండ
మరియు రక్షించితివి పెక్కు మార్గములను
నిన్ను నేమని వర్ణింతు నీరజాక్ష? 
భావం:భగ భగ మండుచున్న లక్క ఇంట్లో నా బిడ్డలు, నేను కాలి భస్మమైపోకుండా కాపాడావు. కురురాజు ధుర్యోధనుడు పెట్టించిన ఘోరమైన విషాన్నం తిని చనిపోకుండా వాయుదేవుని పుత్రుడైన భీమసేనుణ్ణి రక్షించావు. దురహంకారంతో త్రుళ్ళి పడుతూ దుశ్శాసనుడు ద్రుపద రాజ పుత్రి కట్టు బట్టలు ఒలుస్తున్న కష్ట సమయంలో నా కోడలు ద్రౌపది అవమానం పాలు కాకుండా అడ్డుకున్నావు. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు మొదలైన యోధాను యోధుల వల్ల పోరాటంలో చేటు వాటిల్లకుండా నా బిడ్డలను ఆదుకున్నావు. మళ్ళీ ఇప్పుడు గురుపుత్రుడు అశ్వత్థామ ప్రయోగించిన శరాగ్ని జ్వాలలలో మ్రగ్గిపోకుండా విరటుని పుత్రిక అయిన ఉత్తర కడుపులోని కసుగందుని రక్షించి ఇన్ని విధాలుగా నన్నూ, నా బిడ్డలనూ కటాక్షించిన పుండరీకాక్షా! నిన్ను యే విధంగా కొనియాడేది!     

బల్లిదుండగు కంసుచేతను బాధనొందుచు నున్న మీ
తల్లి గాచిన భంగి గాచితి ధార్త రాష్ట్రుల చేత నే
దల్లడంబున జిక్కకుండగ దావకీన గుణవ్రజం
బెల్ల సంస్తుతి సేసి చెప్పగ నెంత దాన జగత్పతీ!  
భావం: జగన్నాథా! బలవంతుడైన కంసుని చేత బాధలు పొందుతున్న మీ తల్లి దేవకీదేవిని రక్షించినటుగా, కౌరవులు పెట్టిన కష్టాలకు లోనుగాకుండా నన్ను కాపాడావు. ఆపన్న ప్రసన్నుడవైన నీయొక్క అనంతకోటి గుణాలు అభివర్ణించడానికి నేనెంతదాన్ని?    
       
జననము నైశ్వర్యంబును
ధనమును విద్యయును గల మదచ్ఛన్ను లకిం
చన గోచరుడగు నిన్నున్
వినుతింపగ లేరు నిఖిల విబుధ స్తుత్యా!  
భావం: గొప్ప వంశంలో జన్మించామనీ, భోగ భాగ్యాలు ఉన్నాయనీ, ధనం సంపాదించామనీ, విద్యావంతులమనీ మదాంధులైన మానవులు నిఖిల దేవతా సంస్తూయమానుడివైన నిన్ను ప్రస్తుతింపలేరు. నిష్కాములైన భక్తులకు మాత్రమే నీవు గోచరించేవు.    

కోపముతోడ నీవు దధి కుంభము భిన్నము సేయుచున్నచో
గోపిక ద్రాట గట్టిన వికుంచిత సాంజన భాష్పతోయ ధా
రా పరిపూర్ణ వక్త్రము గరంబుల బ్రాముచు వెచ్చ నూర్చుచుం
బాపడవై నటించుట కృపాపర! నామది చోద్యమయ్యెడిన్.  
భావం: దయామయా! చిన్నతనంలో ఒక మాటు నీకు కోపం వచ్చి పెరుగుకుండ బద్దలు కొడుతుండగా మీ అమ్మ యశోద నిన్ను త్రాళ్ళతో గట్టిగా కట్టివేసింది. అప్పుడు నీవు ముఖం చిన్నబుచ్చుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ వెచ్చనూరుస్తూ కంటి నుండి కారిన భాష్ప జలముతో నిండిన ముఖము గలవాడవై చేతులతో ముఖము రుద్దుకుంటూ పసిపాపని లాగా నటించావు. ఆ నీ బాల లీల నాకు ఎంతో వింతగా తోచింది. 

మలయమున చందనము క్రియ 
వెలయగ ధర్మజుని కీర్తి వెలయించుటకై
ఇలపై నభవుడు హరి యదు
కులమున నుదయించె నండ్రు కొంద రనంతా!
భావం: అనంతా! ధర్మ నందనుని యశస్సు నలుదెసలా ప్రసరింప చేయడానికి మలయ పర్వతం మీద చందన వృక్షం చందాన పుట్టుక ఎరుగని పురుషోత్తముడు యదువంశంలో జన్మించాడని కొందరంటారు.    

వసుదేవ దేవకులు తా, వసగతి గత భవమందు ప్రార్థించిన సం
తసమున పుత్రత నొందితి, వసురుల మృతి కంచు, కొంద రండ్రు మహాత్మా!
భావం: పూర్వ జన్మంలో అపూర్వమైన తపస్సు చేసి నిన్ను తమ పుత్రుడు కమ్మని దేవకీ వసుదేవులు ప్రార్థించగా సంతోషంతో నీవు వారికి పుత్రుడవుగా జన్మించావని, జగత్తు యొక్క క్షేమం కోరి రాక్షస సంహారం కోసం ఆ పుణ్య దంపతులకు పుత్రుడవై పుట్టావని కొందరు అంటున్నారు.  

జలరాశి నడుమ మునిగెడు 
కలము క్రియన్ భూరి భార కర్శిత యగు నీ
యిల గావ నజుడు గోరిన
గలిగితి వని కొందరండ్రు గణనాతీతా!
భావం: నట్టనడి సముద్రంలో మునిగిపోయే నావలాగా భరింపరాని బరువుతో కృంగి కూలారుతున్నా భూమండలాన్ని ఉద్ధరించటం కోసం బ్రహ్మ దేవుడు ప్రార్థించగా అవతారం ఎత్తావని మరికొందరు అంటారు.    

మరచి యఙ్ఞాన కామ్య కర్మముల దిరుగు 
వేదనాతురులకు దన్నివృత్తి చేయ 
శ్రవణ చింతన వందనార్చనము లిచ్చు
కొరకు నుదయించితండ్రు నిన్ కొందరభవ!
భావం: పుట్టుక లేనివాడా! ఈ ప్రపంచంలో ఆత్మ స్వరూపం యొక్క అఙ్ఞానము, దాని వలన కామములు, వాటి వలన కర్మములు అనే చక్రంలో తగులుకొని కర్తవ్యం విస్మరించి అఙ్ఞానంతో కొట్టుమిట్టాడుతున్న ఆపన్నుల ఆర్తిని పోగొట్టి వారికి శ్రవణం, చింతనం, వందనం, అర్చనం మొదలైన భక్తి మార్గాలను ప్రసాదించే నిమిత్తం నీవు ప్రభవించావని కొందరి అభిప్రాయం.   

నిను చింతించుచు పాడుచుం పొగడుచున్ నీ దివ్య చారిత్రముల్
వినుచుం చూతురు గాక లోకులితరాన్వేషంబులం జూతురే
ఘన దుర్జన్మ పరంపరా హరణ దక్షంబై మహాయోగి వా
గ్వినుతంబైన భవత్పదాబ్జ యుగమున్ విశ్వేశ! విశ్వంభరా! 
భావం: ఓ విశ్వేశ్వరా! విశ్వంభరా! ఎల్లప్పుడూ నిన్నే ధ్యానిస్తూ, నీ లీలలే గానం చేస్తూ, నిన్నే ప్రశంసిస్తూ, నీ పవిత్ర చరిత్రలే ఆకర్ణిస్తూ ఉండే వారు మాత్రమే దురంతాలైన జన్మ పరంపరలను అంతం చేసేవీ, పరమ యోగులు పవిత్ర వాక్కులతో ప్రస్తుతించేవీ అయిన నీ పాదపద్మాలను దర్శించగలుగుతారు. అంతే కానీ ఇతర ప్రయత్నాలేవీ వారికి ఫలితాన్ని ఇచ్చేవి కావు.    

యాదవులందు పాండు సుతులందు నధీశ్వర! నాకు మోహ వి
చ్ఛేదము సేయుమయ్య ఘన సింధువు చేరెడి గంగ భంగి నీ
పాద సరోజ చింతనముపై అనిశంబు మదీయ బుద్ధి న
త్యాదర వృత్తితో గదియు నట్లు చేయగదయ్య ఈశ్వరా! 
భావం: ఓ జగన్నాయకా! నామ రూపాత్మకమగు జగత్తుకు అధిష్ఠానమైనవాడా! ఆత్మీయులైన యాదవుల మీదా, పాండవుల మీదా నాకున్న అనురాగ బంధాన్ని త్రెంపివెయ్యి. నిరంతరము మహా సముద్రంలో కలిసే గంగా తరంగిణిలాగా నా బుద్ధి గొప్ప ఆదరంతో సర్వదా అవిచ్ఛిన్నంగా నీ చరణ సరోజ సంస్మరణంలోనే సంలగ్నమయ్యేటట్లు చేయి.    

శ్రీకృష్ణా!యదుభూషణా! నరసఖా! శృంగార రత్నాకరా!
లోకద్రోహి నరేంద్ర వంశ దహనా! లోకేశ్వరా! దేవతా
నీక బ్రాహ్మణ గోగణార్తి హరణా! నిర్వాణ సంధాయకా! 
నీకున్ మ్రొక్కెద ద్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధీ!
భావం: శ్రీ కృష్ణా! యదువంశమునకు ఆభరణము వంటివాడా! విజయమునకు సఖుడవైన వాడా! శృంగార రస రత్నాకరా! జగత్కంటకులైన రాజుల వంశాలను దహించి వేసే జగదీశ్వరా! ఆపన్నులైన అమరులనూ, అవనీ సురులనూ, ఆవుల మందలకు కలిగిన బాధలను పోగొట్టి కాపాడే స్వామీ! మోక్షాన్ని ప్రసాదించే ప్రభూ! పరిపూర్ణ కరుణా పయోనిధివై నా భవ బంధాలు ఖండించు, నీకు నమస్కరిస్తున్నాను.  




Wednesday, February 1, 2017

శృతి గీతలు

 పరీక్షిన్మహారాజు శుక మహా మునితో "స్వామీ! వేదములు త్రిగుణ రహితుడైన పరమాత్మను యే విధంగా ప్రతిపాదించును?" అని ప్రశ్నించగా, శుకుడు శృతులలో ప్రతిపాదింపబడిన భగవత్ తత్వాన్ని వివరించినవే ఈ శృతి గీతలు.  భగవంతుని నిశ్శ్వాస వలననే పుట్టిన వేదములు ప్రళయ కాలమునందు యోగనిద్రను పొందిన ఆ పరమాత్మను యే విధంగా స్తుతిస్తాయో నారదుడు నారాయణుని అడుగగా, ఆయన పూర్వం సనక సనందనాదుల చర్చలో సనందుడు చెప్పిన తత్వాన్ని నారదునకు చెప్పెను. దానినే  ఇప్పుడు శుకుడు పరీక్షిత్తుకు చెప్పదొడగెను.  

                                         

జయ జయ హరి! దేవ! సకల జంతువులకు ఙ్ఞానప్రదుండవు గాన వారి
వలన దోషంబులు గలిగిన సుగుణ సంతానంబుగా గొని ఙ్ఞాన శక్తి
ముఖ్య షడ్గుణ పరిపూర్ణ జేసి మా యాత్మ విశిష్టుండవగుచు గార్య
కారణాత్మకుడవై కడగి చరించుచు నున్న నీయందు బయోరుహాక్షా!
తివిరి యామ్నాయములుప్రవర్తించు గాన
ప్రకట త్రిగుణాత్మకంబైన ప్రకృతి తోడి
యోగ మింతయు మంపవే! యోగిమాన
సాంబు జాత మధువ్రత! యని నుతించి
 భావం:ఓ విష్ణు దేవా! నీకు జయమగు గాక! తామరల వంటి కన్నులు కలవాడవును, యోగీశ్వరుల మనసులనెడు కమలములందు తుమ్మెదల వలె ఆసక్తితో వసించుచున్నట్టి వాడవును, ప్రళయ కాలమున సకల లోకములను నీలో లయింప చేసుకొను వాడవును అయిన ఓ స్వామీ! నీవు సర్వోత్కృష్టుడవు.సకల జీవులకూ ఙ్ఞానాన్ని ప్రసాదించేవాడవు కాబట్టి నీవే ఆ ప్రాణముల వలన కలిగిన దుర్గుణములను కూడా సుగుణములుగానే ఎంచి రక్షించునట్టి వాడవు; సర్వఙ్ఞత్వము, సర్వేశ్వరత్వము, సర్వ నియంతృత్వము, సర్వ స్రష్టత్వము, సర్వాంతర్యామిత్వము, సర్వ భోక్తృత్వము అనెడు ఆరు గుణముల చేతను నిండుకొన్న వాడవై; మాయా సంబంధమగు జీవాత్మలను మీరినవాడవై ఆయా ప్రాణుల్లో ఆత్మ రూపంతో నీవు ఉంటావు. ప్రపంచ స్వరూపుడవు నీవే, ప్రపంచ సృష్టికి కారణములైన అవ్యక్త మహదహంకార పంచ తన్మాత్ర, పంచభూత స్వరూపుడవు నీవే. రజస్తమో గుణాలతో కూడిన కార్య కారణాత్మకుడవై నీవు వర్తిస్తావు. అటువంటి నీలోనే సకల వేదాలూ ప్రవర్తిస్తాయి. నీ స్వరూపమైన మాకు సత్వ రజస్తమో గుణాలతో కూడిన మూల ప్రకృతితో ఉన్న సంబంధాన్ని సంపూర్తిగా ఛేధించు.             

పరమ విఙ్ఞాన సంపన్నులైనట్టి యోగీంద్రులు మహిత నిస్తంద్ర లీల 
బరిదృశ్యమానమై భాసిల్లు ని మ్మహీ పర్వత ముఖర ప్రపంచమెల్ల
బరగ బ్రహ్మ స్వరూపము గాగ దెలియుదు రెలమి నీవును జగద్విలయ వేళ
నవశిష్టుడవు గాన ననఘ! నీయందు నీ విపుల విశ్వోదయ విలయములగు
ఘట శరా వాదులగు మృద్వికారములు మృ
దాత్మకంబైన యట్లు పద్మాయతాక్ష!
తవిలి కారణ రూపంబు దాల్చి లీల  
గడగు నీయందు బుద్ధి వాక్కర్మములను  
భావం: ఓ స్వామీ! అంతే కాక అనుభవ జన్య ఙ్ఞానము గల బ్రహ్మవేత్తలైన పరమ యోగీశ్వరులు మిక్కిలి జాగ్రత్త గల కార్యములతో; కానవచ్చుచున్న స్థావర జంగమాత్మకమైన భూమి, పర్వతాలు మొదలైన వాటితో కూడి ఉన్న ఈ ప్రపంచాన్ని బ్రహ్మ స్వరూపంగానే భావిస్తారు. నీవు కూడా ప్రళయ కాలంలో సర్వ ప్రపంచములు లయించునప్పుడు ఒక్కడవే నశింపక మిగిలి ఉంటావు.  కుండలూ, మూకుళ్ళూ మొదలైనవన్నీ మట్టితో ఏర్పడి మట్టి కంటే వేరుగా ఉన్నట్లు కనిపించినా మరల మట్టిలోనే కలిసిపోవునట్లు ఈ విశ్వం యొక్క పుట్టుకా, నాశమూ రెండూ నీ వల్లనే జరుగుతాయి. అనగా నీవే జగత్స్వ్రూపుడవై కానబడి మరల ఆ రూపమును నీయందే లయము చేస్తావు. ఓ కమలాక్షా! ఈ సమస్త విశ్వానికి నీవే కారణ భూతుడవు అయినందున బ్రహ్మ రూపము పొందునట్టి నిన్ను మనసు ధ్యానించునట్లును, వాక్కు పొగడునట్లు, శరీరము నీకు సేవ చేయునట్లు అనుగ్రహింపుము.  

అలవడ జేయుచు నుందురు బలువై ఇల బెట్టబడిన పదవిన్యాసం
బులు పతన కారణముగా, నలవున సేవించుచును గృతార్థులు నగుచున్.
భావం: యోగీశ్వరులు విఙ్ఞాన సంపన్నులైన వారు ఇతర దేవతారాధన మున్నగునవి జన్మ కారణములని తెలిసికొని వదిలివేసి మనో వాక్కాయ కర్మలను నీయందే లగ్నం చేస్తారు. వారు జన్మం ఎత్తడాన్ని పతనానికి కారణంగా గ్రహించి త్రికరణ శుద్ధిగా సకల దేవతా స్వరూపుడవైన నిన్నే సేవిస్తూ కృతార్థులవుతారు.   

లీలం ప్రాకృత పూరుష
కాలాదిక నిఖిలమగు జగంబుల కెల్లన్
మాలిన్య నివారకమగు 
నీ లలిత కథా సుధాబ్ధినింగ్రుంకి తగన్
భావం: నీకు వినోదరూపమైన ప్రకృతి యొక్క సంబంధము కలిగి వర్తిల్లునట్టి ప్రాకృత పురుషులకు నిలయమై కాలస్వరూపమైన ఈ ప్రపంచంలో నీ మనోహర కథామృత సముద్రం నిఖిల పాపాలనూ నివారించే సామర్థ్యం కలది.    

భరిత నిదాఘ తప్తుడగు పాంథుడు శీతల వారి గ్రుంకి దు 
ష్కరమగు తాపమొందొరగు కైవడి సంసరణోగ్రతాపమున్
వెరవున బాయుచుండుదురు నిన్ను భజించు మహాత్మకుల్ జరా
మరణ మనోగుణంబుల క్రమంబున బాయుట సెప్ప నేటికిన్?
భావం: లోకమునందు బుద్ధిమంతులగు వారు తీవ్రమైన ఎండచేత బాధపడే బాటసారి చన్నీళ్ళ స్నానం చేసి తన పరితాపాన్ని పోగొట్టుకునే విధంగా, నిన్ను పూజించే మహాత్ములు సంసారమనే అధికమైన భయమును కలుగచేయునట్టి దుర్భర తాపాన్ని నిన్ను ఉపాసించటం అనే జలమును మునుగుట అనెడి ఉపాయము చేత నేర్పుతో తొలగించుకుంటారు. అట్లుండగా ఎల్లప్పుడు నిన్ను సేవించునట్టి పుణ్యాత్ములు ఇక ముసలితనము, మరణము అనే వాటిని క్రమంగా పోగొట్టుకొంటారన్న మాట ప్రత్యేకంగా చెప్పటం దేనికి?

అనయంబు దేహి నిత్యానిత్య సద్విలక్షణమున పంచకోశ వ్యవస్థ
నభివృద్ధి బొరయుచు నందులోపల నున్న ప్రాణాన్న బుద్ధి విఙ్ఞాన మయము
లను చతుష్కోశంబు లవ్వల వెలుగొందు నానందమయు డీవు గాన దేవ!
సురుచిర స్వప్రకాశుండవు నీ పరిగ్రహము కల్గుటం జేసి కాదె ప్రకృతి
మహదహంకార పంచతన్మాత్ర గగన
పవన తేజోంబు భూ భూత పంచకాది 
కలిత తత్వముల్ బ్రహ్మాండ కార్య కరణ 
మందు నెపుడు సమర్థంబు లగుట జూడ.  
భావం: దుర్లభమైన మనుష్య దేహమును ధరించిన ప్రాణులు శాశ్వతము, అశాశ్వతము అనే ఈ రెండు లక్షణాల కంటే విలక్షణమైన పరబ్రహ్మ స్వరూపము చేతను; అన్న, ప్రాణ, మనో, ఙ్ఞాన, ఆనంద మయాలనే పంచకోశాల వల్ల వ్యష్టి, సమిష్టి దేహమును ధరించియును అబివృద్ధి పొందుతూ ఉంటాయి. ఈ పంచకోశాలలో చివరిదైన ఆనందమయ కోశమే స్వరూపంగా వెలుగునట్టి శుద్ధ స్వరూపము చేత నీవు స్వయం ప్రకాశుడవై వెలుగొందుతుంటావు. నీ అధీనంలో ఉన్నందువల్లనే కదా ఈ ప్రకృతీ, మహత్తు, అహంకారము; పంచతన్మాత్రలైన శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు; పంచభూతాలైన భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం మొదలైన పంచ మహా భూతాలు అను వానికి చేతనత్వము కలుగచేసి, వాని చేత బ్రహ్మాండమును పుట్టించి, అందు ప్రవేశించి వెలుగుతూ, ఈ సమస్త సృష్టి స్థితి లయ కార్యాలను సర్వ సమర్థంగా నిర్వహిస్తున్నావు.              
కోరి శరీరులు భవదను
సారంబున నిహపరైక సౌఖ్యంబుల బెం
పారగ నందుచు నుందురు
ధీరజనోత్తములనంగ దివిజారి హరా!
భావం: ఓ రాక్షసులను నాశనము చేయునట్టి హరీ! నిన్ను అనన్య భక్తితో శ్రవణ మనన నిధి ధ్యాసలచేత భజిస్తూ బ్రహ్మ వేత్తలలో శ్రేష్ఠులై ఇహ పరలోక సౌఖ్యాలను కొరత లేక పొంది ధీరులని పేరెన్నిక గంటారు.  

నిన్ను ననుసరింప నేరని కుజనులు
పవన పూర్ణ చర్మ భస్త్రి సమితి
యోజ జేయుచుందు రుచ్ఛ్వసనంబులు
బలసి యాత్మ దేహ భజను లగుచు
భావం: నీ తత్వం తెలిసి నిన్ను శ్రవణ మనన నిధి ధ్యాసముల చేత ఆరాధింపలేని బద్ధ జీవులు జీవాత్మ పరమాత్మలకు బేధం కల్పించి గాలితో నిండిన తోలు తిత్తి లాంటి చక్కగా ఉబ్బిన దేహం కలవారై శరీరం మీద మమకారంతో ఉచ్ఛ్వాశ నిశ్వాసాలు నింపుకుంటూ ఈ దేహాన్నే ఆత్మ అనే భావంతో భజిస్తూ ఉంటారు.     

దేవ! కొందరు సూక్ష్మ దృక్కులైనట్టి మహాత్మకు లుదరస్థుడైన వహ్ని
గా మది దలతురు కైకొని మరికొంద రారుణులను పేర నమరు ఋషులు
లీల సుషుమ్న నాడీ మార్గ గతుడవై హృత్ప్రదేశమున జరించుచున్న 
రుచి దహరాకాశ రూపిగా భావింతు రట్టి హృత్పద్మంబునందు వెడలి
వితత మూర్ధన్య నాడికా గతుల నోలి 
బ్రహ్మ రంధ్రంబు ప్రాపించి పరమ పురుష!
సుమహితానందమయ పరంజ్యోతి రూపి
వైన నిను బొంది మరి పుట్ట రవని యందు
భావం: దేవదేవా! స్వయంప్రకాశుడవును, బ్రహ్మ విష్ణు రుద్ర మహేశ్వర సదాశివులనెడు పంచకర్తలను పంచకృత్యములందు నియమించు వాడవును, పురుషోత్తముడవు అయిన ఓ భగవంతుడా! వేదాంత శాస్త్రములందు చెప్పబడిన సంప్రదాయములైన ఉపాసనా మార్గములను అనుభవ జన్య ఙ్ఞానముల చేత ఎరిగిన సూక్ష్మ దర్శనులైన మహితాత్ములు నిన్ను నాభి స్థానమందలి మణిపూరక చక్రమున ఉండునట్టి జఠరాగ్ని స్వరూపునిగా భావిస్తారు. మరికొందరు అరుణులనబడే ఋషీశ్వరులు వినోదంగా సుషుమ్నా నాడీ మార్గంలో సంచరిస్తూ హృదయ ప్రదేశంలో గల అనాహత చక్రంలో పరమాకాశంలో సంచరించే సూక్ష్మాకార రూపంకలవాణ్ణిగా నిన్ను గ్రహిస్తారు. మరికొందరు బ్రహ్మ నిష్ఠులు ఆ విధమైన హృదయ పద్మం నుంచి వెలువడి ముక్కు రంధ్రముల యందలి మూర్ధన్య నాడి, అనగా ఇడా పింగళ మార్గము ద్వారా బ్రహ్మ రంధ్రం చేరుకుని సహస్రారమును పొంది ఆనందమయ పరంజ్యోతి స్వరూపుడవై వెలుగు నిన్ను చేరి నీయందు ఐక్యమై మునులు ముక్తులౌతారు. మళ్ళీ వారికి జన్మమంటూ ఉండదు.  

అనఘ!దుర్గమమైన ఆత్మ తత్వంబు ప్రవర్తించు కొరకు దివ్యంబులైన
యంచిత రామకృష్ణాద్యవతారముల్ భజియించియున్న నీ భవ్య చరిత 
మను సుధాంభోనిధి నవగాహనము సేసి విశ్రాంత చిత్తులై వెలయుచుండి 
మోక్షంబు బుద్ధినపేక్షింప నొల్లరు మరియు గొందరు భవచ్చరణ పంక
జముల దగిలి పుణ్యతములైన హంసల
వడువు నొంది భాగవత జనముల
నొనరు వారు ప్రకట యోగిజన ప్రాప్య 
మైన ముక్తిగోర రాత్మలందు. 
భావం: పాపములు లేనివాడవైన ఓ స్వామీ! పొందశక్యము కానిదైన ఆత్మ తత్వమును ప్రవర్తిల్ల చేయుట కొరకు ప్రకృతి సంబంధములు కాని రామావతారము, కృష్ణావతారము మొదలగు అవతారములెత్తి వర్తించునట్టి నీ చరిత్రము పాల సముద్రము వలె స్వచ్ఛమును, మేర కానరానిదియు అయి ఉండగా అట్టి చరిత్రములను వినుట, పఠించుట, విచారించుట మొదలగు క్రియల యందు మునిగి తేలుచు నెమ్మది పొందిన మనసు గలవారు అగుచూ కొందరు మోక్షమును అపేక్షించక మెలగుచుందురు. మరికొందరు నీ పాద పద్మములను ఆరాధించుట యందు ఆసక్తి గలవారై మిక్కిలి పుణ్యాత్ములైన పరమహంసల వలె భగవంతుడవైన నిన్ను సేవించుచూ శుద్ధులగుదురు. అట్టి వారు ప్రసిద్ధములైన యోగముల వలన సిద్ధినొందిన యోగులకు పొంద తగినదైన మోక్షమును మనసులలో తలంపుకైన తలంపరు.            

కొందరు నీ శరీరము లకుంఠిత భక్తి భవద్వశంబులై
చెందగ నీ పదాబ్జములు సేరి భజించుచు దత్సుఖాత్ములై
యుందురు కొందరీ తనువు లోలి ధరించి భవత్పదాబ్జముల్
పొందుగ గొల్వలేక నిల బుట్టుచు జచ్చుచు నుందు రవ్యయా!  
భావం: ఎప్పుడును నాశము పొందక శాశ్వతమై ఉండునట్టి స్వామీ! కొందరు పొందరానిదైన మానవ దేహమును పొందిన మాత్రముననే ఆ దేహమును నీకు అధీనము చేసి సమస్త ప్రాణులకు అధీశ్వరుడవు నీవేయని తెలుసుకొని మిక్కుటమైన భక్తితో నీ చరణారవిందాలను సదా సేవిస్తూ పరమానందం చెందుతూ అందువలన కలిగిన సుఖాలను అనుభవిస్తూ ఉంటారు. మరికొందరు నీ పాద పద్మాలను భజింపలేక ఈ లోకంలో పుడుతూ చస్తూ ఉంటారు.   

యమ నియమాది యోగ మహితాత్మకులైన మునీంద్రులున్ విరో
ధమున దలంచు చైద్య వసుధావర ముఖ్య నృపుల్ ఫణీంద్ర భో
గము లన నొప్పు బాహువులు కల్గిన నిన్ను భజించు గోపికల్
క్రమమును నేమునున్ సరియ కామె భవత్కృప కంబుజోదరా! 
భావం: ఓ స్వామీ! యమ నియమములు మొదలైన యోగములు అభ్యసించి వాని వలన సిద్ధి పొందిన మునీశ్వరులును, శత్రు భావంతో నిన్ను తలపోసే శిశుపాలుడూ మొదలైన దుష్ట రాజన్యులూ, ఆలింగనాదుల చేత నిన్ను భక్తితో ఆరాధించే గోపికా స్త్రీలూ, ఎల్లప్పుడూ స్తుతి చేయునట్టి మేమూ నీ కృపకు సమానంగా పాతృలమవడంలో సందేహం లేదు. అనగా నీకు శతృవులు, మిత్రులు, సేవకులు అనువారు అందరునూ సమానమే గానీ హెచ్చు తగ్గులు చూపవు.      

అరవిందాక్ష! భవత్స్వరూపమిల బ్రత్యక్షంబునం గాన నె
వ్వరికిం బోలదు శాస్త్రగోచరుండవై వర్తింతు వీ సృష్టి ముం
దర సద్రూపుండ వైన నీ వలననే ధాత్య్రాద్య మర్తుల్ జనిం
చిరి ని న్నంతకు మున్నెరుంగ గలమే చింతింపనే మచ్యుతా!    
భావం: ఓ స్వామీ! నీ అసలైన స్వరూపమును వేదాంత శాస్త్రముల వలన తెలుసుకొన వలసిన వారమే కానీ ప్రత్యక్షంగా చూడటం ఎవరికీ సాధ్యం కాదు. నీవు శాస్త్ర గోచరుడవు. ఈ ప్రపంచ సృష్టికి పూర్వం నీవు ఎప్పుడును చెడని దివ్య స్వరూపము కలవాడవై వెలుగొందుతున్న పరమాత్మ స్వరూపుడవై ఉండి నీ వల్లనే బ్రహ్మాది దేవతలు ప్రభవించారు. నీవు ఏ రూపంలో ఉంటివో తెలుసుకొనుటకు మేము చాలము. అటువంటి నీ సచ్చిదానంద స్వరూపాన్ని మేము తెలుసుకోగలమా?     

వనజాతాక్ష! భవత్పదాబ్జ యుగ సేవాసక్తులైనట్టి య
జ్జనముల్ మృత్యు శిరంబు దన్ని ఘన సంసారాంబుధిన్ దాటి పా
వనులై లోకములుం బవిత్రములుగా వర్తించుచున్ నిత్య శో
భనమై యొప్పెడి ముక్తి బొందుదురు శుంభద్వైభవోపేతులై
భావం: దేవా! నీ పాద కమలములను మిక్కిలి ఆసక్తితో కొలుచుట యందు నిరంతర నిమగ్నులైన వారు మృత్యువును జయించి, సంసారము అనే దరిలేని మహా సముద్రాన్ని అలక్ష్యంగా దాటి తరించి, లోకంలోని ప్రాణులను అన్నింటినీ పరిశుద్ధులు అగునట్లు మెలగుచు, జనన మరణ పరంపరలకు గురి కాక పవిత్రులై, లోకాలను పవిత్రం చేస్తూ ముక్తికి యోగ్యులై ప్రకాశిస్తారు.   

మిము సద్భక్తి భజింప నొల్ల కిల దుర్మేధం ప్రవర్తించు నీ
చ మతివ్రాతము నేర్పునం బసుల బాశ శ్రేణి బంధించు చం
దమునం బెక్కగు నామ రూపముల చేతన్ వారి బంధించి దు
ర్గమ సంసార పయోధి ద్రోతువు దళత్కంజాత పత్రేక్షణా! 
భావం: పూచిన తామర రేకుల వంటి కన్నులు గల శ్రీ కృష్ణా! ఎవరు నిను భక్తితో సేవించకుండా దుర్మదాంధులై భూమి యందు చరింతురో అట్టి నీచ బుద్ధి గల పామరులను పశువులను దామెన త్రాటితో వరుసగా కట్టి వేయునట్లు నానా విధ నామ రూప బేధముల చేత బంధించి సంసారము అనెడి సముద్రము నందు పడదోస్తావు.   

మది దలపోయగ జల బు
ద్బుదములు ధర బుట్టి పొలియు పోలిక గల ఈ
త్రిదశాది దేహములలో 
వదలక వర్తించు నాత్మ వర్గము నోలిన్.
భావం: జాగ్రత్తగా మనసులో ఆలోచించి చూడగా నీళ్ళలో బుడగలు పుట్టి నశించిపోయే విధంగా ఆత్మ సమూహం దేవతాదుల దేహాల్లో ప్రవర్తిస్తూ ఉంటుంది. అటువంటి శరీరాల్లో అంతరాత్మవై నీవు వర్తిస్తావు. 

ప్రళయ వేళ నీవు భరియింతు వంతకు
గారణంబ వగుట కమలనాభ!
భక్త పారిజాత! భవ భూరి తిమిర ది
నేశ! దుష్ట దైత్య నాశ! కృష్ణ!
భావం: బొడ్డునందు బ్రహ్మకు జన్మ స్థానమైన తామర కలవాడవును, భక్తులకు కల్ప వృక్షము వలె కోరిన కోరికల నిచ్చు వాడవును, పుట్టుకలు అనే మేర లేని చీకటిని పోగొట్టుట యందు సూర్యుడవగు వాడవును, చెడ్డవారైన రాక్షాసులనెల్లను నశింప చేయు వాడవును అయిన ఓ స్వామీ! నీళ్ళలో పుట్టి అణగిపోవు బుడగల వలె భూమియందు పుట్టుచు నశించుచుండునట్టి ఎల్ల దేహ ధారుల సమూహమును సృష్టి స్థితి లయ హేతుభూతుడవైన నీవు ప్రళయ సమయంలో వాటిని నీలో లీనం చేసుకుంటావు.    

అనఘ! జితేంద్రియ స్ఫురణులయ్యును జంచలమైన మానసం
బను తురగంబు బోధ మహితాత్మ వివేకపు నూలి త్రాట న
ల్లన గుదియంగ బట్టను దలంచుచు ముక్తి కుపాయ లాభ మే
యనువును లేమికిన్ వగల నందెడు నాత్మలువో తలంపగన్.
భావం: పాపములు ఏమియు లేని ఓ దేవా! ఇంద్రియ జయము నొందునట్టి సామర్థ్యము గల వారుగా ఉండియు, చలించునట్టి స్వభావము గల మనస్సు అనెడి గుర్రమును, బ్రహ్మ ఙ్ఞానము అనెడు నూలు తాడు చేత మెల్లగా బిగబట్టుటకు యత్నించుచు ఆ మనస్సు స్వాధీనము కానందున మోక్షము నొందుటకు మార్గము ఏదియు కనబడక నీ పాదారవింద భజన లేని జీవులు విచారము పొందుదురు.   

గురు పద పంకజాతములు గొల్వని వారలువో మహాబ్ధి ని
స్తరణకు గర్ణ ధార రహితంబగు నావము సంగ్రహించు బే
హరి గతి భూరి దుస్తర భవాంబుధిలోన మునుంగుచుందురు రం
బురుహదళాక్ష! నీవు పరిపూర్ణుడవై తనరారంగా నొగిన్.
భావం: తామర రేకులను పోలిన కన్నులు గల స్వామీ! గురు పాద పద్మాలను సేవించని పామరులు పెద్ద సముద్రము దాటుటకు ఓడ వాడు లేని ఓడ యందు కూర్చుండి, బేరమాడబోవు వర్తకుని వలే జనన మరణ పరంపరలనే మేర లేనిదియు, దాటరానిదియు అయిన సంసార సముద్రంలో మునిగి పోతారు. అంతటను నిండుకొని ఎల్లప్పుడును వెలుగునట్టి నిన్ను చేరలేరు.   

పుత్ర దార గృహ క్షేత్ర భూరి విషయ
ఘన సుఖాసక్తుడగుచు నే మనుజుడేని
నర్థి జరియించు వాడు భవాబ్ధి లోన
జెంది యెన్నాళ్ళకును దరి జేర లేడు.
భావం: యే మనుష్యుడు నిరంతరం బిడ్డలు, భార్య, ఇల్లు, మడిచేను అనువాని యందు ఆసక్తి కలవాడై, విశేషమైన విషయ సుఖములు పొందగోరునో అటువంటి మానవుడు ఈ సంసార సాగరం నుంచి ఎన్నటికీ గట్టెక్కలేడు.     

జగతిపై బహు తీర్థ సదనంబు లనగల్గి పుణ్యాను వర్తన స్ఫురితులగుచు
బాటించి నీ యందు బద్ధ మత్సరములు లేక భక్తామరానోకహంబ
వగు భవత్పాదాబ్జ యుగళంబు సేవించి భవ పాశముల నెల్ల బారదోలి
సమ మతులై యదృచ్ఛాలాభ తుష మేరు సమముగా గైకొని సాధులగుచు
బాద తీర్థంబు గల మహా భాగవత జ
నోత్తమోత్తము లైనట్టి యోగి వరుల
వారకెప్పుడు సేవించు వాడు వొందు
బ్రవిమలానందమయ మోక్షపదము.  
భావం: ఈ భూలోకమునందు పుణ్య నదులను, పుణ్య క్షేత్రములను పొందుటకు సాధనాలైన సత్కార్యాలను తరు పూర్వ పుణ్య విశేషము వలన నడపునట్టి వివేకులు నీయందు విరోధ బుద్ధి లేక, భక్తుల పాలిట కల్పవృక్షమైన నీ పాద కమలములను కొల్చి, జన్మ బంధములను తొలగించుకుని, శతృవులు, మిత్రులు అను బేధ బుద్ధి లేక ఎల్ల వారి యెడల సమముగా వర్తించుచు తనంతట దొరికిన అల్ప వస్తువునైనను మేరు పర్వతముతో సమానముగా నెంచుచు సాధువులై, పరిశుద్ధులైన భగవద్భక్తుల పాద తీర్థములను కోరి అట్టి యోగీశ్వరులను సేవించి వర్తించును. అట్టి పుణ్యాత్ముడు నిర్మలమైన ఆనందమును కలుగ చేయునట్టి మోక్ష స్థానమును పొందును.        







    

Tuesday, January 31, 2017

గోపికా గీతలు

                      భక్తిలో అత్యుత్తమమైన భక్తి అని గోపికా భక్తిని కీర్తిస్తారు మహా భక్తుడైన నారదుల వారు.  అలా ఋషితుల్యులైన ఆ గోపికలు చేసే కృష్ణ స్తుతి భగవానుని పట్ల వారికి గల నిష్కల్మష తారాస్థాయి ప్రేమ భక్తి భావనను తెలియచేస్తుంది. శ్రీ కృష్ణ పరమాత్మ కొంతసేపు గోపికలతో విహరించి తరువాత అకస్మాత్తుగా మాయమైపోతారు. ఆయనను వెదకుతూ గోపికలు విరహంలో స్వామిలో తన్మయులై స్తుతిస్తారు.

                                                     
                 
                         

                 
నీవు జనించిన కతమున 
నో వల్లభ! లక్ష్మి మందనొప్పె నధికమై
నీ వెంటనె ప్రాణములిడి 
నీ వార రరసెద చూపు నీ రూపంబున్.

భావం: నాథా! నీవు పుట్టిన కారణాన గోకులంలో సిరి పెంపు సొంపారుతున్నది, అనగా సంపద అధికమైంది. నీవారందరూ నీయందే ప్రాణములను ఉంచుకుని నీకోసం వెదకుతున్నారు. దయతో నీ రూపం వీరికి చూపు.           

శారదకమలోదరు రుచి
చోరకమగు చూపు వలన సుందర! మిమ్ముం
గోరి వెల యీని దాసుల
ధీరత నొప్పించు టిది వధించుట గాదె.

భావం: ఓ అందగాడా! శరత్కాలమందు వికసించిన తామరలయందలి కాంతిని అణచివేయునట్టి కాంతి గల నీ చూపు వల్ల నిన్ను వలచి జీతబత్తెము లేని దాసురాండ్రమై నిన్ను కొలువ వచ్చిన మమ్ములను కొంచమైన జాలి లేక మమ్ము ధీరుడవై ఇలా బాధించడం నిజంగా చంపడమే కదా!     

విషజలంబు వలన విషధర దానవు
వలన రాల వాన వలన వహ్ని
వలన నున్న వాని వలనను రక్షించి
కుసుమ శరుని బారి గూల్ప దగునె? 

భావం: ఓ కృష్ణా! విషంగ్రక్కు కాళియుని విషం వలన విషపూరితమైన యమునా నదీ జలాల నుండి, సర్ప రూపుడై మమ్ము మ్రింగ వచ్చిన అఘాసురుని వల్ల, ఇంద్రుడు కురిపించిన రాళ్ళ వాన వల్ల, అడవిలో చెలరేగిన కార్చిచ్చు వల్ల, ఇంకను తక్కిన ఎన్నో ఆపదల నుండి చావకుండ మమ్ము కాపాడి ఇప్పుడు పంచబాణుని బారి కప్పగించి చంపడం నీకు న్యాయమా?     

నీవు యశోద బిడ్డడవె? నీరజ నేత్ర! సమస్త జంతు చే
తో విదితాత్మ వీశుండవు తొల్లి విరించి దలంచి లోక ర
క్షా విధ మాచరింపు మని సన్నుతి సేయంగ సత్కులంబునన్
భూవలయంబు గాన నిటు పుట్టితి గాదె మనోహరాకృతిన్.  

భావం: కమలాక్షా! నీవు కేవలం నిఖిల దేహ ధారుల బుద్ధికి సాక్షిభూతుడవైన అంతరాత్మవు. పరమేశ్వరుడివి. పూర్వం బ్రహ్మ లోక సంరక్షణం చేయడానికి ఒక ఏర్పాటు చేయమని నిన్ను స్మరించి నిన్ను ధ్యానించి వేడుకోగా భూమండలాన్ని ఉద్ధరించి రక్షించడానికి ఇలా మనోఙ్ఞ స్వరూపంతో ఈ మంచి వంశంలో ఆవిర్భవించి సమస్త ప్రాణుల హృదయములందు వర్తించునట్టి సర్వ నియామకుడవైన పరబ్రహ్మవు గానీ వాస్తవము విచారించగా నీవు యశోద కొడుకువు కావు.   

చరణ సేవకులకు సంసార భయమును
బాపి శ్రీకరంబు పట్టు గలిగి
కామదాయియైన కర సరోజంబు మా
మస్తకముల నునిచి మనుపు మీశ!

భావం: ఓ స్వామీ! నీ పాదాలను కొలిచే వారికి సంసారం వల్ల కలిగే భయాన్ని పోగొట్టి, మేలు కలుగ చేయుట యందు పట్టుదల కలిగి, కోరిన కోరికలను అన్నింటినీ గ్రహించునట్టిదీ, ఇచ్చునట్టిది అయిన నీ కర కమలాన్ని మా మస్తకంపై ఉంచి మమ్ము కాపాడుము.   

గోవుల వెంట ద్రిమ్మరుచు గొల్చిన వారల పాప సంఘముల్
ద్రోవగ జాలి శ్రీ దనరి దుష్ట భుజంగ ఫణా లతాగ్ర సం
భావితమైన నీ చరణ పద్మము చన్నుల మీద మోపి త
ద్భావజ పుష్పభల్ల భవ బాధ హరింపు వరింపు మాధవా! 

భావం: మాధవా! ఆవుల వెంట సంచరించుచూ, సేవించు వారి పాప సమూహాలను పోగొట్టగలిగీ, సిరిచే ఒప్పునదీ, కౄరుడైన కాళియుడు అనే చెడ్డ పాము యొక్క  పడగలపై నటించేదీ అయిన అతి మృదులమైన నీ పాదాన్ని మా కుచాల మీద మోపి మాకు మన్మథుని కుసుమ శరాల వల్ల ప్రాప్తించిన బాధ పరిహరించు. మమ్ము స్వీకరించు.  

బుధరంజనియును సూక్తయు
మధురయునగు నీదు వాణి మరగించెను నీ 
యధరామృత సంసేవన
విధి సంగజ తాపమెల్ల విడిపింపగదే! 

భావం: పండితులను సంతోషపెట్టునదీ, చక్కని పలుకుబడి కలదియు, తీయనిదీ అయిన నీ పలుకు మమ్ము నీయందు ఆసక్తి గొనునట్లు చేసింది. నీ యధరామృతం త్రాగించి మా మదన తాపమంతా తొలగించు. 

మగువల యెడ నీ క్రౌర్యము
దగునే? నిజ భక్త భీతి దమనుడ వకటా!
తగదు భవద్దాసులకును
నగు మొగముంజూపి కావు నళిన దళాక్షా!

భావం: కమలాక్షా! అయ్యో! ఆడువారి పట్ల ఇంతటి కౄరత్వం అవలంబించుట నీకు తగదు. నీవు భక్తుల భయం పోగొట్టిన వాడవు అయినందున నీకు ఇది తగిన పని కాదు. కనుక నీ దాసులమైన మాకు నీ నగుమోము చూపి మా మనస్తాపమును పోగొట్టి కాపాడుము. 

ఘన లక్ష్మీ యుతమై వినన్ శుభదమై కామాది విధ్వంసియై
సనకాది స్తుతమై నిరంతర తప స్సంతప్త పున్నాగ జీ
వనమై యొప్పెడు నీ కథామృతము ద్రావం గల్గునే భూరి దా
న నిరూఢత్వము లేని వారలకు మా నారీ మనోహారకా!

భావం: రమా మనోరమణా! గొప్ప మోక్ష సంపద కూడుకున్నదియు, శ్రవణ మాత్రమున ఎంతో ఎక్కువైన శుభము లిచ్చునదియు, కామ, క్రోధ,లోభ, మోహ, మద, మాత్సర్యములు అనెడు అరిషడ్వర్గములను నిర్మూలించునట్టిదియు, సనక సనందనాది యోగీశ్వరులచే కొనియాడబడునదియు, ఎడతెగని కాయిక, వాచిక, మానసిక తపముల చేత తపించుచున్న పురుష శ్రేష్ఠులైన తపస్వులకు బ్రతుకు తెరువై యొప్పుచున్న నీ కథాసుధను భక్తితో విను వారికే పేదలకు సైతము విశేష దానము చేయవలెను అను కోరిక కలుగుచుండగా, ఎన్నెన్నో గొప్ప దానములొనర్చి ప్రసిద్ధినందని వారు గ్రోలజాలరు. అనగా సర్వకాల సర్వావస్థలయందు నిన్నే తలచుకొనునట్టి మాకు ప్రాణ దానము చేయుట యందు నీకు తలపు పుట్టకుండుట తగినదేనా? 

నీ నగవులు నీచూడ్కులు

నీ నానా విహరణములు నీ ధ్యానంబుల్
నీ నర్మాలాపంబులు
మానసములు నాటినేడు మగుడవు కృష్ణా! 

భావం: కృష్ణా! నీ యొక్క నవ్వులూ, నీ చూపులూ, పలువిధములైన నీ విహారాలూ, నీ ధ్యానములూ, నీ పరిహాస వచనాలూ  మా హృదయాలలో నాటుకుని నేడు మరపునకు రాక ఉన్నవి. 


ఘోష భూమి వెడలి గోవుల మేపంగ

నీరజాభమైన నీ పదములు
గసవు శిలలు దాకి కడునొచ్చునో యని
కలగు మా మనములు కమలనయన!  

భావం: కమలాక్షా! నీవు గోవులను మేపుటకై మంద నుంచి అడవికి ఆవులతో వెడలిన వేళ కమలములతో సమానమైన నీ అడుగులు, గడ్డి మొలకులు, గులక రాళ్ళు తాకి మిక్కిలి నొచ్చునని, మేము మా మనసులో విచారపడుతుంటాము.   


మాపటి వేళ నీవు వన మధ్యము వెల్వడి వచ్చి గోష్పద

ప్రాపిత ధూళి ధూసరిత భాసిత కుంతలమై సరోరుహో
ద్దీపితమైన నీ మొగము ధీరజనోత్తమ! మాకు వేడ్కతో
జూపి మనంబులన్ మరుని జూపుదు గాదె క్రమక్రమంబునన్.  

భావం: ధీర జనములలో శ్రేష్ఠుడా! నీవు ప్రతి దినము సాయంత్రము బృందావనాంతర అటవీ ప్రాంతం నుంచీ తోలుకుని వచ్చిన ధేనువుల కాలి దుమ్ము సోకి ధూసర వర్ణం పొంది ప్రకాశించెడి ముంగురులు గలదై, పద్మం వలే భాసిల్లే నీ ముఖం మాకు ప్రీతితో కనబరచి మా మనస్సులలో అంతకంతకు మరులు హత్తుకొలుపుతుంటావు కదా!

భక్త కామదంబు బ్రహ్మ సేవిత మిలా
మండనంబు దు:ఖ మర్దనంబు
భద్ర కరమునైన భవదంఘ్రి యుగము మా
యురములందు రమణ! యునుప దగదె?

భావం: ప్రియతమా! భక్తుల అభీష్టములు తీర్చునదీ, బ్రహ్మ చేత సేవింపబడునదీ,పుడమికే అలంకారమైనదీ, దు:ఖములను పోగొట్టునదీ, శుభములొసగి కాపాడునదీ అయిన నీ అడుగుల జంటను మా వక్షముల పైన ఉంచరాదా?    

సురత వర్ధనంబు శోకాపహరణంబు
స్వనిత వంశనాళ సంగతంబు
నన్య రాగ జయమునైన నీ మధురాధ
రామృతమున దాప మార్పు మీశ!

భావం: ప్రభూ! సంభోగ ప్రీతి పెంచునదీ, శోకములను తొలగించునదీ, ఊదబడుచున్న పిల్లనగ్రోవితో కూడుకున్నదై ముద్దులందుకునేదీ, ఇతరములైన అనురాగములన్నింటినీ అతిశయించునదీ అయిన నీ తీయని కెమ్మోవి పానకముచే మా తాపం పోగొట్టుము.   

నీ వడవిం బవల్ దిరుగ నీ కుటిలాలక లాలితాస్య మి
చ్ఛావిధి జూడకున్న నిమిషంబులు మాకు యుగంబులై చనుం
గావున రాత్రులైన నిను గన్నుల నెప్పుడు జూడకుండ ల
క్ష్మీవర! రెప్పలడ్డముగ జేసె నిదేల? విధాత కౄరుడై. 

భావం: రమా నాయకా! నీవు పగటిపూట బృందావనారణ్యంలో తిరగడం వల్ల వంపులు తిరిగిన ముంగురులచే అందాలు చిందే నీ వదనం తృప్తి తీరేటట్లు కోరుకున్న విధంగా తిలకించ లేకపోతున్నాము. అందువలన మాకు క్షణాలు యుగాలుగా గడుస్తాయి. పోనీ రాత్రి వేళలందైనా ఎడ తెగకుండా చూద్దాము అని కోరుకుంటే కౄరుడైన బ్రహ్మ దేవుడు కండ్లకు ఈ రెప్పను అడ్డంగా సృష్టించాడు కదా!  

అక్కట! బంధులున్ మగలు నన్నలు దమ్ములుం బుత్రకాదులున్
నెక్కొని రాత్రి బోకుడన నీ మృదు గీత రవంబు వీనులన్
వెక్కసమైన వచ్చితిమి వేగమె మోహము నొంది నాథ! నీ
వెక్కడ బోయితో? యెరుంగ మీ క్రియ నిర్దయుడెందు గల్గునే?

భావం: మనో వల్లభా! చుట్టాలు, భర్తలు, అన్నలు, తమ్ములు, కొడుకులు మొదలైన వారు మమ్ము అడ్డగించి రాత్రి పూట ఇల్లు వదిలి వెళ్ళద్దని చెబుతున్నప్పటికీ వానిని లక్ష్యం చేయక మనోహరమైన నీ పాట సవ్వడి చెవులలో నిండగానే అధికమైన మోహావేశంతో పరుగు పరుగున ఇక్కడికి వచ్చాము. నీవెక్కడికేగినావో ఎరుగము. నీ వంటి దయమాలిన వాడు ఎక్కడైనా ఉంటాడా?    

మదనుడార్వంగ నీవాడు మంతనములు
నవరసాలోకనంబగు నగు మొగంబు
కమల కిరవైన మహిత వక్ష స్థలంబు
మా మనంబుల లోగొని మరపె గృష్ణ!

భావం: ఓ కృష్ణా! ఏకాంతమున మన్మథ ఉద్రేకము కలిగేటట్లుగా నీవు పలికే వలపు లొలకే పలుకులు, నవ రసములకు ఉనికి పట్టైన నీ చూపులు, నీ మనోఙ్ఞమైన చిరునవ్వుతో ఉండే మొగము, లక్ష్మికి వాస స్థానమైన నీ విశాల వక్షస్థలము, కామోద్దీపన కరాలై ఆకర్షించి మమ్ములను మురిపించాయి. 

అరవిందంబుల కంటె కోమలమై యందంబులై యున్న నీ
చరణంబుల్ కఠినంబులై మొనయు మా చన్నుంగవల్ మోవగా
నెరియంబోలు నటంచు బొక్కుదుము నీ ఈ కర్కశారణ్య భూ
పరి సంచారము కృష్ణ! నీ ప్రియలకుం బ్రాణ వ్యథం జేయదే!

భావం: కృష్ణా! తామర పువ్వుల కంటే మెత్తనివై, సుందరములై ఒప్పుతున్న నీ అడుగులు కఠినములైన మా కుచాలపై ఆనించినప్పుడు ఆ ఒత్తిడికి నీ పాదాలు పగిలి కందిపోతాయని తపిస్తాము. అటువంటి పాదాలతో కఠినములైన అరణ్య భూములలో నీవు సలిపే సంచారం నీ ప్రియురాండ్రమైన మాకు ప్రాణాంతకమైనంత తాపమును కలిగిస్తుంది. 

కట్టా! మన్మథు కోలలు 
నెట్టున నోనాట బెగడి నీ పాదంబుల్
పట్టికొనగ వచ్చిన మము
నట్టనడవిని డించి పోవ న్యాయమె? కృష్ణా!

భావం:  అయ్యో! కృష్ణా! ఎంత సంకటం దాపురించింది? మన్మథుని బాణాలు మా హృదయాలలో నాటి నివారింపరానివై మమ్ము పీడించుచుండగా నీ పాదములను ఆశ్రయించి ఆ బాధను పోగొట్టుకొన వచ్చాము. భయపడి నీ కాళ్ళు పట్టుకోవడానికి వచ్చాము. అలాంటి మమ్ము నట్టడవి మధ్యలో ఇట్లే వదిలి పెట్టి వెళ్ళడం నీకు న్యాయమా?  

హృదయేశ్వరా! మా హృదయము
మృదుతరముగ జేసి తొల్లి మిక్కిలి; కడ నీ
హృదయము కఠినము చేసెను 
మదీయ సౌభాగ్య మిట్టి మందము గలదే?   

భావం: ప్రాణేశ్వరా! మా చిత్తాలను, సౌందర్య రూపమైన మా అదృష్టం మిక్కిలి మెత్తనివిగా చేసి, తుదకు నీ మనసును కర్కశం కావించిన మా దురదృష్టాన్ని ఏమనుకోవాలి?    

క్రమ్మి నిశాచరుల్ సురనికాయములన్ వడి దాకి వీక వా
లమ్ముల తెట్టెముల్ వరప నడ్డము వచ్చి జయింతు వండ్రు, ని
న్నమ్మిన ముగ్ధలన్ రహిత నాథల నక్కట! నేడు రెండు మూ
డమ్ముల యేటుకా డెగువ నడ్డము రాదగదే కృపానిధీ!  

భావం: కరుణానిధీ! కృష్ణా! రాక్షసులు పూర్వం ఒక్క పెట్టున చెలరేగి దేవతా సమూహాల నెదిర్చి పట్టుదలతో వారిపై వాడి శరాలు గుప్పిస్తుంటే అడ్డుపడి రాక్షసులను శిక్షిస్తావని కొందరు అంటారు. మరి అట్టివాడవైన నిన్ను నమ్ముకున్న పడతులం మేము. పతులను పరిత్యజించి వచ్చిన వారము. అయ్యో! ఇలాంటి మమ్ములను కేవలం రెండు మూడు బాణాలు గల తుంటరి విలుకాడు వెంటాడగా అడ్డు పడవేమి?     

తియ్య విలుకాడు డీకొని
వ్రయ్యలుగా దూరనేసి వనితల మనముల్
నియ్యాన నింక నయినం
గు య్యాలింపం గదయ్య గోవింద! హరీ!

భావం:  ఓ గోవిందా! ముకుందా! మన్మథుడు మా మీద తలపడి మా మనస్సులు భేదిల్లి బద్దలగునట్లుగా మా గుండెలు దూరేటట్లు శరాలు ప్రయోగించి బాధించాడు. ఆడువారమైన మా మొరను ఆలకించి ఇకనైనా మమ్ము రక్షించరాదా? మేము చెప్పేది అబద్ధం కాదు. 


సూచన: ఈ గీతలలోని భావాలన్నీ భౌతిక పదజాలంగా మాత్రమే చూడడం మహా దోషం. గోపికలు అనగా మహా గొప్ప సాధకులైన యోగులు. వారంతా స్వామి తో తాదాత్మ్యాన్నే కోరుకుంటున్నారు గానీ, తుచ్ఛమైన శారీరక భోగాన్ని కానే కాదు. వారు వెలిబుచ్చిన యే భావము శరీర పరిమితిలో కానే కాదు.   



Sunday, January 29, 2017

రుక్మిణీదేవి కృత శ్రీకృష్ణ స్తుతి

                 ఒక సారి శ్రీకృష్ణుడు రుక్మిణి దేవితో సల్లాపమాడుతూ నేను నీకు సరైన వరుడిని కాను, నీవు తొందరపడి నన్ను  వివాహమాడావు అనగా రుక్మిణీ దేవి మూర్ఛ పడి పోతుంది. స్వామి శైత్యోపచారాలు చేసాక తేరుకుని స్వామి తత్వాన్ని ఇలా స్తుతిస్తుంది తల్లి.

                                                   

                                               
మురహర! దివసాగమ దర,
దరవిందళాక్ష! తలప నది యట్టిదగున్
నిరవధిక విమలతేజో,
వర మూర్తివి, భక్త లోక వత్సల! యెందున్.

భావం: ఓ మురాంతకా! ఉదయాన వికసించుతున్న తామరరేకుల బోలిన నేత్రములతో శోభించువాడా! భక్త లోకమును వాత్సల్యముతో రక్షించు దేవా! నీవు అనంత తేజో మూర్తివి. నీవన్న మాట అన్ని విధముల వాస్తవమే. నేను నీకు తగిన దానను కాను అనుట వాస్తవము.

సంచిత ఙ్ఞాన సుఖ బలైశ్వర్య శక్తు
లాదిగా గల సుగుణంబులమరు నీకు
నేను దగుదునె? సర్వ లోకేశ్వరేశ!
లీలమై సచ్చిదానంద శాలి వనఘ!  

భావం: యే పాపములు లేని వాడవు, సర్వ లోకములకు నియామకుడవు అయిన ఓ స్వామీ! విలాసార్థముగా ఙ్ఞాన శక్తి, బల శక్తి, సుఖ శక్తి, ఐశ్వర్య శక్తి మొదలగు అనంత శక్తులతో కూడిన సకల కళ్యాణ గుణములు కలవాడవై సచ్చిదానంద పరబ్రహ్మవై ఒప్పునట్టి నీకు ప్రకృతి రూపిణినైన నేను తగననుట యదార్థమే!    

రూఢిమై ప్రకృతి పూరుష కాలములకు నీశ్వరుడవై భవదీయ చారు దివ్య
లలిత కళా కౌశలమున నభిరతుడై కడగు నీ రూపమెక్కడ మహాత్మ!
సత్త్వాది గుణ సముచ్చయ యుక్త మూఢాత్మ నైన యేనెక్కడ? అనఘ చరిత!
కోరి నీ మంగళ గుణ భూతి దానంబు సేయంగ బడునని చెందు భీతి
నంబునిధి మధ్య భాగమం దమృత ఫేన
పటల పాండుర నిభ మూర్తి! పన్నగేంద్ర
భోగిశయ్యను బవ్వళింపుచును దనరు
నట్టి యున్నతలీల దివ్యంబు దలప.  

భావం: ఓ మహత్మా! బాగుగా విచారింపగా నీవు మూల ప్రకృతికిని, జీవునికిని, జీవజ్జీవ పరివిభాగ కారణమైన కాలమునకు కర్తవైన నీ సంబంధమై, మనోఙ్ఞమై, అప్రాకృతమై కోమలమై, సచ్చిదానంద నిర్మల పరిపూర్ణమయమై ప్రకాశించునట్టి నీ స్వరూపమెక్కడ? శాంత ఘోర మూఢ వృత్తులు గల త్రిగుణాత్మక ప్రకృతి స్వరూపిణినైన నేనెక్కడ? నీకు, నాకు చాలా తారతమ్యం కలదు. నీవు నీ కళ్యాణ గుణ సంపద భక్తుల చేత అపహరింపబడుననెడి భయము వలనేమో అన్నట్లు సముద్రము మధ్యలో, అమృతము వలెను, నురుగు తెట్టెల వలెను తెల్లగా ప్రకాశించునట్టి సర్ప రాజైన ఆదిశేషుని దేహమును శయ్యగా చేసికొని ఉండునట్టి నీ గాంభీర్య రీతి అప్రాకృతమైనది. నీలీలలు పరమ దివ్యములైనవి కదా!  

వరమునీంద్ర యోగివర సురకోటిచే
వర్ణిత ప్రభావ వైభవంబు
గలిగి యఖిల చేతనులకు విఙ్ఞాన ప్ర
దుండ వగుదు వభవ!దురిత దూర!

భావం: పుట్టుకలు, పాపములు లేనివాడవైన ఓ స్వామీ! శ్రేష్ఠులైన వ్యాస, నారద, సనందాది మునీంద్రుల చేత, యోగివరుల చేత, శుక వామదేవాది బ్రహ్మ నిష్ఠుల చేత, దేవతలచేత వర్ణితమైన ప్రభావం గల నీవు మహిమను వహించి ఎల్లప్రాణులకు అఖిల విఙ్ఞాన దాయకుడవైన వాడవు అగుచున్నావు.  

వితత రాజ్య గరిమ విడిచి కాననముల
నాత్మలందు మీ పదాబ్జ యుగము
వలతి గాగ నిలిపి వాతాంబు పర్ణాశ
నోగ్రనియతు లగుచు నుందు రభవ!

భావం: రాజులు సంతోషంతో నేను, నాది అనే ఆలోచన లేకుండా గొప్ప రాజ్యము యొక్క గౌరవాన్ని మాని అడవులకు పోయి తమ మనస్సులలో నీ పాదాలను స్మరిస్తూ గాలి, నీళ్ళు, ఆకులు ఆహారం చేసుకుని ఉగ్రమైన నియమాలతో ఉంటారు.

విమల ఙ్ఞాన నిరూఢులైన జనముల్ వీక్షింప మీపాద కం
జ మరంద స్ఫుట దివ్య సౌరభము నాస్వాదించి నిర్వాణ రూ
పము సత్పూరుష వాగుదీరితము శోభా శ్రీనివాసంబు నౌ
మిము సేవింపక మానవాధముని దుర్మేధాత్ము సేవింతునే?  

భావం: పరిశుద్ధమైన ఙ్ఞానముచేత ధృఢ పడినవారై గొప్ప సత్పురుషులైన వారు చూచుచుండగా మీ పాదపద్మ మకరంద మాధుర్య సౌరభాలను ఆస్వాదించుతూ మోక్షస్వరూపులును, సత్పురుషుల చేత సదా స్మరింపబడుచుండువారును, మహా ప్రకాశ సంపద కలిగిన వారును అయిన మీ మూర్తిని సేవించక దుర్మేధాత్ముడైన ఒక మానవాధముడిని నేను సేవింతునా?  

నీరదాగమ మేఘ నిర్యత్పయ: పాన చాతకంబేగునే చౌటి పడెకు?
పరిపక్వ మాకంద ఫలరసంబులు గ్రోలు కీరముల్ చనునె దుత్తూరములకు?
ఘనరవాకర్ణ నోత్కలిక మయూరముల్ గోరునే కఠిన ఝిల్లీరవంబు?
కరి కుంభ పిశిత సద్గ్రాస మోదిత సింహమరుగునే శునక మాంసాభిలాష
ప్రవిమలాకార! భవదీయ పాదపద్మ
యుగ సమాశ్రయ నైపుణ్యోద్యోగ చిత్త
మన్యు చేరునె తనకుపాస్యంబు
గాగ? భక్త మందార! దుర్భర భవ విదూర!  

భావం: సేవకులకు కోరిన కోరికలిచ్చుటయందు కల్పవృక్షము వంటి వాడును, చెడ్డ జన్మముల వలన కలుగు భయమును దూరముగా తొలగించు ఓ శుభాకారా!వర్షాకాలంలో మేఘం నుండి పడుతుండే జల బిందువులను ఆస్వాదించే చాతక పక్షి చవిటి గుంటలోని నీటి కోసం పోవునా? పండిన తియ్య మామిడి పండ్ల రసాన్ని గ్రోలే చిలుకలు ఉమ్మెత్త కాయలను ఆశ్రయిస్తాయా? నీలమేఘ గర్జనాన్ని విని తహతహ పడే నెమళ్ళు ఈల పురుగు ధ్వనిని కోరుకుంటాయా? ఏనుగు కుంభ స్థలంలోని మాంసాన్ని భుజించి తృప్తి చెందే సింహం కుక్క మాంసం కోసం కక్కుర్తి పడుతుందా? నీ పాద పద్మ ద్వయాన్ని కోరి ఆశ్రయించి ఆనందించే హృదయం అల్పులైన ఇతరులను సేవించుటకు కోరదు.   

వాసవ వందిత! పద కమ
లాసన శివ ముఖర దేవతావళికెల్లన్
నీ సమధిక చారిత్ర క
థా సురుచిర గాన మవితథంబై చెల్లున్. 

భావం: దేవేంద్రునిచే నమస్కరింపబడు పాదములు కలవాడా!ఓ దేవాధిదేవా!బ్రహ్మ, శివుడు మొదలైన ముఖ్యమైన దేవతలందరూ ఎప్పుడూ నీ దివ్య చరిత్రలు తెలిపే గాథలనే కమ్మగా ఎడ తెగక గానం చేస్తుండటం జరుగుతుంది.    

ధరణీ నాథులు తమతమ 
పరవనితామందిరముల వసియింపుచు గో
ఖర మార్జాలంబుల గతి
స్థిర బుద్ధులగుదురు నిన్ను తెలియని కతనన్. 

భావం: ఓ స్వామీ! నిఖిలేశ్వరుడైన నిన్ను గుర్తింపలేకపోయినందున రాజులు తమ ప్రేయసీ మందిరాలలో నివసిస్తూ సంసారారణ్యంలో చిక్కి మోహపాశంలో గట్టిగా కట్టబడి పశువులు, గాడిదలు, పిల్లుల వలే స్థిరంగా బంధింపబడిన బుద్ధిని కలిగి ఉంటారు.   

జలజ నాభ! సకల జగదంతరాత్మవై 
నట్టి దేవ! నీ పదారవింద 
యుగళి సానురాగ యుక్తమై నా మది
గలుగునట్లు గాగ దలపు మనఘ!   

భావం: బ్రహ్మ పుట్టినట్టి పద్మము బొడ్డునందు కలవాడవైన వాడవు, విఙ్ఞాన స్వరూపుడవు కనుక నీ అంతట నీవే ప్రకాశించువాడవు, నిరతిశయానంద స్వరూపుడవు కనుక దు:ఖములు లేనివాడవు అయిన ఓ స్వామీ! స్థావర జంగమ రూపమైన ప్రపంచమందు అంతట నిండి ఉన్నట్టి నీ పాదారవింద భక్తి నా మనస్సు నందు ఎల్లప్పుడును నిలుచునట్లు అనుగ్రహింపుము. 

పృథు రజోగుణ ప్రవృద్ధమైనట్టి నీ
దృష్టి చేత నన్ను దేరకొనగ
జూచు టెల్ల పద్మలోచన! నా మీది
ఘన దయార్ద్ర దృష్టిగా దలంతు.

భావం: రాజీవ లోచనా! రాజసంతో విరాజిల్లే నీ దృష్టితో నన్ను తేరుకొనేటట్లు చూడడం నామీద నీకు గల పరమ దయార్ద్ర దృష్టితో చూడడంగానే భావించెదను.  



Tuesday, January 24, 2017

రుక్మిణీ కళ్యాణం

పోతన గారి పుణ్యమా అని తెలుగు వారందరికీ చిరపరిచితమైన రుక్మిణీ కళ్యాణ ఘట్టంలోని కొన్ని మధుర శ్లోకాలు స్మరించి తరించుదామా!    
                                           

యే నీ గుణములు కర్ణేంద్రియంబులు సోక దేహ తాపంబులు తీరిపోవు
నే నీ శుభాకార మీక్షింప కన్నుల కఖిలార్థ లాభంబు కలుగుచుండు
నే నీ చరణ సేవ లే ప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబు పొందగలుగు
నే నీ లసన్నామ మే ప్రొద్దు భక్తితో దడవిన బంధ సంతతులు వాయు
నట్టి నీ యందు నాచిత్త మనవరతము
నచ్చి యున్నది నీ యాన నానలేదు
కరుణ చూడుము కంసారి! ఖల విదారి!
శ్రీయుతాకార! మానినీ చిత్త చోర! 

భావం: కంసాంతకా! ప్రశస్తమైన నీ గుణాలు చెవుల బడితే చాలు, శరీర తాపాలన్నీ శమిస్తాయి. ఓ కళ్యాణ స్వరూపా! మంగళ కరమైన నీ స్వరూపం తిలకిస్తే చాలు నేత్రాలకు నిఖిల ప్రయోజనాలు సిద్ధిస్తాయి. దుష్టులను దునుమాడువాడా! నిరంతరం నీ పాద సేవ చేస్తే చాలు లోకంలో మహోన్నతి నొందవచ్చు. మానవతుల మనసులు హరించువాడా! సంతతమూ నీ దివ్య నామం సంస్మరిస్తే చాలు బంధాలన్నీ పటాపంచలవుతాయి. నీ మహిమ ఎక్కడ? నేనెక్కడ? అని సిగ్గు చెందక నాహృదయం నీయందు లగ్నమయింది. ఇది నిజం. నన్ను కరుణతో కటాక్షించు.      

ధన్యున్ లోకమనోభిరాము గుల విద్యా రూప తారుణ్య సౌ
జన్య శ్రీ బల దాన శౌర్య కరుణా సంశోభుతున్ నిన్ను నే
కన్యల్ గోరరు? కోరదే మును రమాకాంతా లలామంబు రా
జన్యానేకప సింహ! నా వలననే జన్మించెనే మోహముల్? 

భావం: మదపుటేనుగు వలె క్రొవ్వి చరించునట్టి శతృ రాజులకు సింహం వంటివాడవైన ఓ శ్రీ కృష్ణా! నీవు ధన్యుడవు. లోకుల మనస్సులను రంజింపచేసేవాడవు. వంశము, విద్య, చక్కదనము, జవ్వనము, మంచితనము, సంపద, బలము, దానము, పరాక్రమము, కారుణ్యము అనే గుణాలతో మిక్కిలి అలరారుతున్నవాడవైన నిన్ను కోరని కన్యలు ఎవరూ ఉండరు. ఉవిదలలో ఉత్తమురాలైన శ్రీ మహాలక్ష్మి అలనాడు నిన్ను చెట్టబట్టలేదా? ఈ మోహము నాకే పుట్టి నేనే అరుదుగా మోహించితినా? వలపు అనేది నా వల్లనే జన్మించిందా?    

శ్రీయుత మూర్తి! యో పురుష సింహమ! సింహము పాలి సొమ్ము గో
మాయువు గోరు చందమున మత్తుడు చైద్యుడు నీ పదాంబుజ 
ధ్యాయినియైన నన్ను వడి దా గొనిపోయెద నంచు నున్న వా
డా యధమాధముండెరుగ డద్భుతమైన భవత్ప్రతాపమున్

భావం: వక్షస్థలము నందు లక్ష్మీ దేవిని వహించిన ఓ పురుష శ్రేష్ఠుడా! ఓ మంగళ మూర్తీ! పురుషులలో సింహము వంటి వాడవు నీవు. సింహమునకు అర్హమైన సొత్తును నక్క వాంఛించునట్లు నీ చరణ సరోజాలను స్మరించే నన్ను మదోన్మత్తుడైన శిశుపాలుడు  శీఘ్రంగా వచ్చి తీసుకుపోవడానికి యత్నిస్తున్నాడు. అల్పులలో అల్పుడైన ఆ చేది దేశపు రాజు ఆశ్చర్యజనకమైన నీ పరాక్రమం ఎరుగడు సుమా!    

వ్రతముల్ దేవ గురు ద్విజన్మ బుధ సేవల్ దాన ధర్మాదులున్
గత జన్మంబుల నీశ్వరున్ హరి జగత్కల్యాణు గాంక్షించి చే
సితి నేనిన్ వసుదేవ నందనుడు నా చిత్తేశుడౌ గాక ని
ర్జితులై పోదురు గాక సంగరములో జేదీశ ముఖ్యాధముల్   

భావం: పూర్వ జన్మములందు నేను జగన్నాయకుడూ, లోకాలకు శుభాలను కలిగించేవాడూ అయిన గోవిందుడిని పతిగా కోరి నోములు నోచి ఉంటే, దేవతలకూ, గురువులకూ, బ్రాహ్మణులకూ, విద్వాంసులకూ సేవలొనర్చి ఉంటే, దాన ధర్మాది పుణ్య కార్యాలు సలిపి ఉంటే వసుదేవుని కుమారుడైన శ్రీ కృష్ణుడు నాకు ప్రాణేశ్వరుడు అవుతాడు. శిశుపాలుడు మొదలుగా గల నీచులు భండనంలో పరాజితులు అవుతారు.  

ఘనులాత్మీయ తమో నివృత్తి కొరకై గౌరీశు మర్యాద నె
వ్వని పాదాంబుజ తోయమందు మునుగన్ వాంఛింతు రే నట్టి నీ
యనుకంపన్ విలపింపనేని వ్రత చర్యన్ నూరు జన్మంబులన్ 
నిను జింతించుచు ప్రాణముల్ విడిచెదన్ నిక్కంబు ప్రాణేశ్వరా!  

భావం: నాథా! మహాత్ములు తమ అఙ్ఞాన రాహిత్యం కొరకు పార్వతీ పతి అయిన పరమేశ్వరుని వలెనే యే పరమ పురుషుని పాదపద్మాలలో ప్రభవించిన గంగా జలాలలో స్నానం చేసి పుణ్యవంతులు కాగోరుదురో అట్టి తీర్థ పాదుడవైన నీ అనుగ్రహానికి నేను అర్హురాలను కాకపోతే అనగా నీవు నన్ను పరిగ్రహింపని పక్షమున బ్రహ్మచర్య వ్రత నిష్ఠ వహించి నూరు జన్మలకైనా నీవే నా పతి కావాలని నిన్నే ధ్యానిస్తూ నా ప్రాణాలు నీకే అర్పిస్తాను. ఇది నా మనో నిశ్చయం. అందుకే నన్ను ఉపేక్ష చేయక వచ్చి నన్ను తీసుకుని పొమ్ము.        

ప్రాణేశ! నీ మంజు భాషలు వినలేని కర్ణ రంధ్రంబుల కలిమి యేల?
పురుష రత్నమ! నీవు భోగింపగా లేని తనులతవలని సౌందర్యమేల?
భువనమోహన! నిన్ను బొడగానగా లేని చక్షురింద్రియముల సత్త్వమేల?
దయిత! నీ యధరామృతం బానగా లేని జిహ్వకు ఫల రస సిద్ధియేల?
నీరజాతనయన! నీ వన మాలికా
గంధమబ్బలేని ఘ్రాణమేల?
ధన్య చరిత! నీకు దాస్యంబు సేయని 
జన్మమేల? యెన్ని జన్మములకు 

భావం: ఓ ప్రాణ నాయకా! ఇంపులైన నీ వాక్కులు విననోచని చెవుల వల్ల ప్రయోజనం శూన్యం. పురుషోత్తమా! నీవు అనుభవింపని సుందర సుకుమార శరీర లావణ్యం ఎందుకూ కొరగాదు. జగన్మోహన మూర్తీ! లోకమునను మోహము పుట్టించ జాలిన నిన్ను సందర్శింప నోచని కనుల కలిమి దండుగ. జీవితేశ్వరా! నీ అధర సుధారసం ఆస్వాదింపని నాలుకకు ఫల రసముల ప్రాప్తి ఎందుకు? కమలాక్షా! నీవు ధరించు వనమాలికా సౌరభం ఆఘ్రాణించని ఈ నాసిక ఏల? ధన్య చరిత్రా! నీ పాద పరిచర్యకు ఉపకరించని ఈ జన్మ ఎన్ని జన్మలెత్తినా ఏమి లాభం? అనగా త్వక్చక్షుశ్రోత్ర జిహ్వాఘ్రాణములను ఙ్ఞానేంద్రియములు కలిగినందుకు ఆయా ఇంద్రియముల వలన సుఖములు నీ వల్లనే అనుభవిస్తూ నీ సేవ చేస్తూ ఉండేదే జన్మ గానీ అట్టివి కాని జన్మములు ఎన్ని ఎత్తినను వ్యర్థమే.     

నమ్మితి నా మనంబున సనాతనులైన ఉమా మహేశులన్
మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు గదమ్మ! మేటి పె
ద్దమ్మ దయాంబురాశివి గదమ్మ హరింబతి సేయుమమ్మ నిన్
నమ్మిన వారికెన్నడును నాశము లేదు గదమ్మ ఈశ్వరీ! 


భావం: అమ్మా! గౌరీ! శాశ్వతులూ, ఆది దంపతులు అయిన పార్వతీ పరమేశ్వరులైన మిమ్ము మదిలో నమ్ముకుని ఉన్నాను. మేలుకోరి నేను మిమ్ములను భక్తితో కొలుస్తున్నాను. తల్లులలోకెల్లా ప్రధానురాలైన నీవు పెద్ద తల్లివి, దయకు సముద్రము వంటి దానవు. తల్లీ! లోకములో నిన్ను నమ్ముకున్న వారికి ఎన్నటికీ చెరపు అనేది లేదు. శ్రీ కృష్ణుని నాకు భర్త అగునట్లుగా చేయుము.  





Tuesday, January 17, 2017

ముచికుందుడు చేసిన శ్రీకృష్ణ స్తోత్రం

శ్రీకృష్ణ పరమాత్మను సంహరించాలని తరుముతూ కాలయవనుడు ఒక గుహలోకి ప్రవేశిస్తాడు. ఆ గుహ పూర్తి అంధకారంగా ఉంటుంది. ఎవరో ఒక వ్యక్తి ఉన్నట్లు తెలిసి అతడే శ్రీకృష్ణుడనుకొని కాలయవనుడు కాలితో తన్నుతాడు. ఆ మహా తపస్వి కన్నులు తెరచి చూచేసరికి కాలయవనుడు భస్మమైపోతాడు. అతడే ముచికుందుడు. దేవతల వరంతో దీర్ఘ నిద్రలో ఉన్న ఆయన నారాయణుడైన శ్రీకృష్ణుని చూచి సంభ్రమంతో స్తోత్రం చేస్తారు.    

                                                  

నీ మాయ జిక్కి పురుష,
స్త్రీ మూర్తిక జనము నిన్ను సేవింపదు; వి
త్తామయ గృహగతమై సుఖ
తామసమై కామవంచితంబై ఈశా! 

భావం: సర్వేశ్వరా! స్త్రీ పురుష రూపమైన ఈ లోకంలోని జన సమూహము నీ మాయ చేత మోహితులై ధన సంపాదన రూపమైన వ్యాధిని, సంసార రూపమైన గృహమును పొంది, ఆహార, నిద్ర, భయము, సంగము, పువ్వుల గంధము మొదలైన వాని వల్ల అనుభవములను అల్ప సుఖములనే చీకటిలో మునిగి నిన్ను భజింప నేరక ఉన్నారు.    

పూని యనేక జన్మముల బొంది తుదిం తన పుణ్య కర్మ సం
తానము పేర్మి గర్మ వసుధా స్థలి బుట్టి ప్రపూర్ణ దేహుడై 
మానవుడై గృహేచ్ఛబడు మందుడజంబు తృణాభిలాషయై
కానక పోయి నూతబడు కైవడి నీ పద భక్తి హీనుడై  

భావం: ఓ స్వామీ! గొర్రె చక్కగా పెరిగిన గడ్డిని చూసి అపేక్షపడి దాని వలన హానిని తెలుసుకొన లేక తినబోయి నూతిలో పడునట్లు, పలు జన్మములెత్తి యెత్తి నీపాదాములందు భక్తి లేక చచ్చి చచ్చి తుదకు పుణ్య కార్యముల ఫలంగా కర్మ క్షేత్రమైన ధరాతలంలో పూర్ణ దేహంతో అవయవ హీనత లేని దుర్లభమైన మనుష్య జన్మమెత్తి పుట్టి కూడా మూఢత వల్ల నీ పద భక్తి లేని వాడై నిన్నెరుగక గేహాదులందలి వాంఛకు వశుడై, నిద్రా భయ సంగమాలయందు ఆశ కలవాడు అగుచున్నాడు.    

తరుణీ పుత్ర ధనాదుల,
మరగి మహా రాజ్య విభవ మద మత్తుడనై
నరతను లుబ్ధుడనగు నా
కరయంగ బహుకాల మీశ! యారడి బోయెన్  

భావం: పరమేశ్వరా! ఆలు, బిడ్డలు, ధనము మున్నగు వాటి యందు అపేక్షను ఉంచి వానితో గాఢానుబంధము గలవాడనై మహారాజ్య సంపత్తి చేత మదించిన మనసు కలవాడనై, మనుష్య శరీరమునందు గల అత్యాశను వహించి యున్న నాకు వ్యర్థముగా చాలా కాలం గడిచిపోయింది.         
ఘట కుడ్య సన్నిభంబగు 
చటుల కళేబరము జొచ్చి జనపతి నంచుం
బటు చతురంగంబులతో 
నిటు నటు తిరుగుదును నిన్ను నెరుగక ఈశా!  

భావం: కుండ, గోడ నానాటికీ క్షీణించిపోవునవి. అదేవిధంగా జడమైన, చంచలమైన ఈ దేహంలో ప్రవేశించి నేను రాజును అనే అభిమానం చేత చతురంగ బలములైన రథ, గజ, తురగ పదాతులతో విర్ర వీగుతూ, నీ స్వరూపమును విచారించి తెలుసుకోవలెనన్న చింత లేక భూమియందు అటు నిటు క్రుమ్మరుచు కాలము వ్యర్థముగా గడిపితిని.  

వివిధ కామ భోగ విషయ లాలసు మత్తు
నప్రమత్త వృత్తి నంతకుండ
వైన నీవు వేళ యరసి త్రుంతువు సర్ప
మొదిగి మూషికంబు నొడియునట్లు 

భావం: పలు విధములైన మనోరథములు, శబ్దాది విషయములందు ఆశ వహించి యేమరి యుండగా నీవు మాత్రం యేమరపాటు చెందక యమ ధర్మ రాజ స్వరూపుడవై పాము కనిపెట్టి యుండి తటాలున ఎలుకను ఒడిసి పట్టుకున్నట్లు సమయంరాగానే పట్టి విషయ లాలసులను హరిస్తావు.     

నరవర సంఙ్ఞితమై రథ
కరి సేవితమైన యొడలు కాలగతిన్ భీ
కర మృగ భక్షితమై దు
స్తర విట్క్రిమి భస్మ సంఙ్ఞితంబగు నీశా!

భావం: గోవిందా!'ప్రభువు ' అని పేరు వహించి రథాల మీద, ఏనుగుల మీద ఎక్కి తిరిగిన ఈ శరీరం కాలవశమై భయంకరములైన జంతువులచే భక్షింపబడడం వల్ల, మురిగిపోతే పురుగులతో నిండి, కాలిపోతే బూది అని వ్యవహరించబడుతుంది.      

  సకల దిశలు గెలిచి సములు వర్ణింపంగ
జారు పీఠమెక్కి సార్వభౌము
డైన సతుల గృహములందు క్రీడా భోగ 
వృత్తి నుండు నిన్ను వెదుకలేడు

భావం: అన్ని దిక్కులనూ జయించి సాటివారు కొనియాడగా ఉన్నత పీఠం అధిష్ఠించిన చక్రవర్తి అయినప్పటికీ సుందరీ మణుల మందిరాలలో కామ సుఖాలు అనుభవిస్తాడే గానీ నిన్ను అన్వేషించడు.   

మానసంబు గట్టి మహిత భోగంబులు
మాని ఇంద్రియముల మదము లడచి
తపము సేసి ఇంద్రతయ కోరుగాని నీ
యమృత పదము కోరడఙ్ఞుడీశ!   

భావం: ఈశ్వరా! ఙ్ఞాన హీనుడగు మనుష్యుడు తెలివిమాలిన వాడై మనస్సును స్వాధీనం చేసుకుని, గొప్ప భోగములను విడనాడి, ఇంద్రియాటోపము అణచి వేసి, తపస్సు చేసి ఇంద్ర పదవిని అభిలషిస్తాడే కానీ నీ అమృత స్థానమును కోరడు.  

సంసారియైయున్న జనునకు నీశ్వర! నీకృప యెప్పుడు నెరయ కల్గు 
నప్పుడు బంధంబులన్నియు తెగిపోవు, బంధ మోక్షంబైన ప్రాప్తమగును 
సత్సంగమంబు, సత్సంగమంబున నీదు భక్తి సిద్ధించు, నీ భక్తి వలన 
సన్ముక్తియగు, నాకు సత్సంగమున కంటె మును రాజ్య బంధ నిర్మూలనంబు 
కలిగినది దేవ! నీ యనుగ్రహము గాదె?
కృష్ణ! నీ సేవ గాని తక్కినవి వలదు
ముక్తి సంధాయి వగు నిన్ను ముట్ట గొలిచి
ఆత్మ బంధంబు గోరునే ఆర్యుడెందు?

భావం: అచ్యుతా! సంసారమందు పరిభ్రమిస్తున్న పురుషుడికి నీఅనుగ్రహం ఎప్పుడు కలుగుతుందో అప్పుడే ఆ సంసార బంధాలు వదిలిపోతాయి. సంసార నివృత్తి కలిగినప్పుడు సత్పురుషులతో సహవాసం లభిస్తుంది. సత్సంగం చేత నీయందు భక్తి సిద్ధిస్తుంది. నీయందు నెలకొన్న భక్తి వల్ల ముక్తి చేకూరుతుంది. నాకు సత్పురుషోత్తముల సాంగత్యమునకు పూర్వమే రాజ్య పాశ నిర్మూలనం జరిగింది. ఇదంతా నీకృప కృష్ణా! నాకు నీ పాద సేవనంతప్ప తక్కిన వేమియూ వద్దు. ఎవడు విఙ్ఞుడైన వాడో వాడు ముక్తిదాయకుడవైన నిన్ను సేవించి తనకు ప్రతిబంధకాలైన శబ్దాది విషయ భోగాలను వాంఛింపడు. ఎవడు యోగ్యుడో వాడు మోక్షం ఇచ్చువాడైన నిన్ను అనన్య భక్తితో సేవించి మరల సంసార బంధమున చిక్కుకొనుటకు ఇచ్ఛ పడడు.